2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ పాదయాత్ర చేశారు. తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తాననే విషయాన్ని వివరించారు. మరి 2024 ఎన్నికల సంగతేంటి.. ఇప్పుడు అమలవుతున్న పథకాలను కంటిన్యూ చేస్తామని మాత్రమే ఆయన చెప్పగలరు. పాదయాత్రల్లాంటి కార్యక్రమాలు కూడా లేకపోవడంతో అసలు వైసీపీ యాక్టివిటీ ఏంటనేది అనుమానంగా మారింది. ఈ దశలో జగన్ మాస్టర్ ప్లాన్ వేశారు. దాదాపుగా ప్రతి ఇంటినా వైసీపీ నేతలు పలకరించే కార్యక్రమాల లిస్ట్ రెడీ చేశారు. 


ఏపీలో అధికార వైసీపీ ఎన్నికల సమర శంఖం పూరించింది. అటు నాయకుల్ని, ఇటు ప్రజల్ని ఏమాత్రం ఖాళీగా ఉంచడంలేదు సీఎం జగన్. ఏదో ఒక కార్యక్రమం పేరుతో రెండు వర్గాల్నీ బిజీగా ఉంచుతున్నారు. ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జోరుగా సాగుతోంది. దీనికి తోడు మా నమ్మకం నువ్వే జగన్, జగనన్నే మా భవిష్యత్ అనే కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ప్రతి కుటుంబం వద్ద ప్రభుత్వ పనితీరుపై అభిప్రాయాలు సేకరించారు వైసీపీ నేతలు. మెగా పీపుల్ సర్వే పేరుతో పార్టీయే నేరుగా ప్రజల అభిప్రాయాలు సేకరించింది. ఇదే రూట్లో జగనన్నకు చెబుదాం అంటూ మే 9నుంచి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది రాష్ట్ర ప్రభుత్వం.


ఏపీలోకి ఎవరొచ్చినా ఎటు చూసినా వైసీపీ జెండాలే కనిపించాలి. ఏ ఇంటికి వెళ్లినా జగన్ స్టిక్కర్ కనపడాలి, ఏ వీధిలోకి వచ్చినా వైసీపీ నాయకులు హడావిడిగా అటూ ఇటూ తిరుగుతుండాలి. ఎవరిని పలకరించినా వాలంటీర్ అనో, సచివాలయ ఉద్యోగి అనో, సచివాలయ కన్వీనర్ అనో.. లేదా వారికి తెలిసిన వారు అనో.. చెబుతుండాలి. దాదాపుగా వైసీపీ కార్యకర్తలందరికీ చిన్నా చితకా పదవులిచ్చేశారు. వాటి వల్ల ఏమాత్రం లాభం ఉంటుందనే విషయం పక్కనపెడితే... ఆ పదవుల ద్వారా వారిలో ఆత్మ విశ్వాసం వచ్చేసింది. ఆ పదవుల్ని అడ్డుపెట్టుకునే చాలామంది సచివాలయాల్లో పనులు చక్కబెట్టుకుంటున్నారు. ఒకరకంగా చిన్న చిన్న పదవులతో కూడా వైసీపీ కేడర్ బాగా సంతృప్తి పడుతోందనే చెప్పాలి. 


కేడర్ సరే, జనాల సంగతేంటి..?
సమస్యలనేవి బర్నింగ్ టాపిక్ గా ఉంటే, ప్రజలు అవి పరిష్కారమయ్యాయా, లేదా అనే విషయాన్ని పట్టించుకోరు. తమ తరపున ఏదో ఒకటి జరుగుతోందనే భ్రమలో ఉంటారు. ఇదే కాన్సెప్ట్ తో జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చారు. ఏళ్ల తరబడి జిల్లా స్థాయిలో స్పందన కార్యక్రమాల్లో అర్జీలు ఇచ్చి విసిగి వేసారి పోయిన ప్రజలు, కొత్తగా జగన్ ఇచ్చిన హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేయాలి. వాటిలో జెన్యూన్ ప్రాబ్లమ్స్ ని గుర్తించి అధికారులు, సీఎం జగన్ దగ్గరకు తీసుకెళ్తారు. ఆయన వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తారు. 


ఇన్ని కార్యక్రమాలు ఎందుకు..?
జాగ్రత్తగా గమనిస్తే.. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమానికి పెద్ద తేడా లేదు. ఇందులో జగనన్నే మా భవిష్యత్ అనే మరో కార్యక్రమం కూడా కలసి ఉంది. వీటన్నిటి లక్ష్యం ఒక్కటే.. ప్రతి ఓటరునీ వైసీపీ నాయకులు పలకరించారి, పరామర్శించాలి, ఎవరు ఎటువైపు ఉన్నారో తెలుసుకోవాలి. నేరుగా సీఎం జగన్ పరిస్థితులను అంచనా వేసేందుకు జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమం రూపొందించారు. దీనివల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉంటుందో కానీ, పార్టీ పరంగా వైసీపీకి మాత్రం మైలేజీ వస్తుందని చెబుతున్నారు.