Banakacharla Project: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం, వృథాగా పోయే గోదావరి వరద జలాల్లో సుమారు 200 టీఎంసీల (ట్రిలియన్ క్యూబిక్ ఫీట్) నీటిని వినియోగించుకోవడం. రాయలసీమతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలు ఈ నీటిని మళ్లించాలన్నది ప్రణాళిక. ఈ ప్రక్రియ పోలవరం ప్రాజెక్టు నుంచి ప్రారంభమవుతుంది. ఇందు కోసం వివిధ రకాల కాలువలు, టన్నెల్స్ నిర్మించి, ఎత్తిపోతల పథకాల ద్వారా శ్రీశైలం కుడి కాలువలో కీలకమైన బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ వరకు గోదావరి వరద నీటిని తరలించడం ఈ ప్రాజెక్టులో ముఖ్యమైన అంశం. బనకచర్ల నుంచి నీటిని రాయలసీమ ప్రాంతానికి అందించడం ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఇలా నీటిని తరలించడం ఏపీ ప్రభుత్వానికి సాంకేతికంగా సవాలే.
మూడు దశల్లో ఈ ప్రాజెక్టుకు ప్రణాళికలు:
ఈ మెగా ప్రాజెక్టును మూడు దశల్లో వివిధ సాంకేతిక నిర్మాణాలతో పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఈ మూడు దశల్లో నిర్మాణాలు ఎలా చేపట్టనున్నారు? అందుకు అవసరమైన ప్రణాళికలు ఏంటో తెలుసుకుందాం.
మొదటి దశ - పోలవరం నుంచి కృష్ణా నది వరకు:
బనకచర్ల తొలి దశలో పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి వరద నీటిని కృష్ణా నదికి, అంటే ప్రకాశం బ్యారేజికి, తరలిస్తారు. అయితే, పోలవరం కుడి కాలువ సామర్థ్యం 17,500 క్యూసెక్కులు మాత్రమే. గోదావరి వరద నీటిని తరలించాలంటే కుడికాలువ సామర్థ్యాన్ని 38 వేల క్యూసెక్కుల ప్రవాహం తట్టుకునేలా పెంచాల్సి ఉంది. దీంతోపాటు, పోలవరం కుడి కాలువకు సమాంతరంగా 25 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యం గల కొత్త వరద కాలువను తవ్వుతారు. అధిక వరదలు వచ్చినప్పుడు నీటిని మళ్లించడానికి, ప్రస్తుత కాలువపై ప్రవాహ భారం తగ్గించడానికి కొత్త కాలువ ఉపయోగపడుతుందన్నది ప్రభుత్వ ఆలోచన. దీంతోపాటు, ఈ నీటిని ఎత్తిపోసే తాడిపూడి ఎత్తిపోతల పథకం సామర్థ్యాన్ని పెద్ద ఎత్తున పెంచుతారు. అందుకు అవసరమైన అదనపు పంపులు, అధిక సామర్థ్యం గల మోటార్లు, పంపు హౌస్ విస్తరణ, కాలువల సామర్థ్యం పెంచడం వంటి పనులు చేపడతారు. ఈ మొదటి దశలో నీటి తరలింపు దాదాపు 175 కిలోమీటర్ల పొడవు ఉంటుంది.
కృష్ణా నది నుంచి బొల్లపల్లి రిజర్వాయర్ వరకు రెండో దశ పనులు:
తొలి దశలో పోలవరం నుంచి వైకుంఠపురం బ్యారేజి లేదా ప్రకాశం బ్యారేజి వద్దకు గోదావరి వరద జలాలను తరలిస్తారు. రెండో దశలో ప్రకాశం బ్యారేజి నుంచి బొల్లపల్లి వద్ద ప్రస్తుతం బనకచర్ల ప్రాజెక్టులో ప్రతిపాదిస్తున్న బొల్లపల్లి వద్ద నిర్మించే రిజర్వాయర్ కు నీటిని తరలిస్తారు. ఈ ప్రాజెక్టులో బొల్లపల్లి రిజర్వాయర్ చాలా కీలకమైన నిర్మాణం. ఈ రిజర్వాయర్‌ను 152 టీఎంసీలను నిల్వచేసే సామర్థ్యంతో నిర్మించాలన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రణాళిక. అయితే, దీన్ని 400 టీఎంసీల వరకు పెంచే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై మాత్రం ఇప్పటికి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. నీటిని నిల్వ చేయడానికి, ఇక్కడి నుంచి నీటిని తరలించడానికి బొల్లపల్లి రిజర్వాయర్ చాలా ముఖ్యమైనది. ఈ రెండో దశలో సుమారు 152 కిలోమీటర్ల వరకు గోదావరి వరద జలాలను తరలిస్తారు.
బొల్లపల్లి రిజర్వాయర్ నుంచి బనకచర్ల రెగ్యులేటర్ వరకు మూడో దశ పనులు:
రెండు దశల్లో బొల్లపల్లి రిజర్వాయర్ వరకు నీటిని తరలించిన తర్వాత అక్కడి నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ వరకు నీటిని తరలించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టులో ఇదే సాంకేతికంగా సంక్లిష్టమైన దశగా నీటిపారుదల నిపుణులు చెబుతున్నారు. బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ నుంచే పెన్నా బెసిన్‌కు గోదావరి నీరు చేరుతుంది. ఈ దశలో ఓపెన్ కాలువలతోపాటు 20.50 కిలోమీటర్ల టన్నెల్ నిర్మించాల్సి ఉంది. ఆ తర్వాత 6.60 కిలోమీటర్ల దూరం అంటే సిద్ధాపురం వద్ద జంట సొరంగరాలు (ట్విన్ టన్నెల్స్) నిర్మిస్తారు. ఆ తర్వాత 17 కిలోమీటర్ల పైప్ లైన్స్ వేయాల్సి ఉంటుంది. ఈ మార్గంలో నల్లమల అటవీ ప్రాంతం, పర్వతాలతో నిండి ఉండటం, భూసేకరణ సమస్యలను అధిగమించడం కోసం ఈ టన్నెల్స్, పైప్ లైన్ ద్వారా నీటిని తరలించాలన్నది ప్రభుత్వ ఆలోచన. మూడో దశలో నీటిని 135 కిలోమీటర్లు తరలించాల్సి ఉంటుంది.
400 కిలోమీటర్ల కాలువలు, తొమ్మిది లిఫ్టులు, నాలుగువేల మెగావాట్ల విద్యుత్:
గోదావరి వరద జలాలను పెన్నా బెసిన్‌కు తరలించేందుకు మొత్తం మూడు దశలు కలిపి దాదాపు 400 కిలోమీటర్ల వరకు ఓపెన్ కాలువలు, టన్నెల్స్, పైప్ లైన్స్ వేయాల్సి ఉంది. బనకచర్ల ప్రాజెక్టులో మూడు దశల్లో 9 లిఫ్టులను ఏర్పాటు చేసి నీటిని ఎత్తిపోయాల్సి ఉంది. ప్రతీ దశలో మూడు లిఫ్టులు ఏర్పాటు చేయాలి. నీటిని ఎత్తిపోసేందుకు దాదాపు 4 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుందని నీటి పారుదల శాఖ ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు.
తెలంగాణ అభ్యంతరం ఏంటీ
బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్రాజెక్టు అమలైతే తెలంగాణకు చెందిన గోదావరి నీటి వాటా తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. తెలంగాణ ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు కొరత ఏర్పడుతుందని పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. వృథాగా పోతున్న నీరు తెలంగాణకు కూడా అవసరం ఉందని అంటున్నారు. తెలంగాణకు సంబంధించిన స్టేక్‌హోల్డర్స్‌ను సంప్రదించకుండా ఏపీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడుతోంది.