ఏడాదికోసారి అంగరంగ వైభవంగా జరిగే ఉత్సవం అది. నెల్లూరు జిల్లా కొండ బిట్రగుంటలో వెలసి ఉన్న ప్రసన్న వెంటకేశ్వర స్వామి ఉత్సవాల సందర్భంగా రథోత్సవానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ప్రసన్న వెంకటేశ్వర స్వామికి ఏటా చేసే బ్రహ్మోత్సవాల ముగింపులో రథోత్సవం నిర్వహిస్తారు. ఈ ఏడాది ఆ రథోత్సవంలో అపశృతి దొర్లింది. స్వామివారి రథం ఒక్కసారిగా కుప్పకూలింది. ముందుకు పడిపోయింది. స్వామివారి ఉత్సవ విగ్రహాలు కూడా ముందుకు ఒరిగిపోయాయి. దీంతో బిట్రగుంట ప్రజలే కాదు, నెల్లూరు జిల్లావాసులు కూడా ఆందోళనకు గురయ్యారు. అయితే రథం పడిపోయిన ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కేవలం రథం మాత్రమే పడిపోయింది. భక్తులు భయంతో పరుగులు తీశారు. విగ్రహాలు కిందపడిపోవడంతో సంప్రోక్షణకు పూజారులు సిద్ధమయ్యారు.


ఎందుకిలా..?


మంగళవారం రాత్రి స్వామివారికి రథోత్సవం నిర్వహించారు. కొండపైన ఉండే ఆలయం దగ్గరనుంచి రథాన్ని కింద ఉన్న ఊరిలోకి తీసుకొస్తారు. అనంతరం రథాన్ని యథావిధిగా ఆలయం దగ్గరకు తెచ్చి ఉత్సవ విగ్రహానలు ఆలయంలోకి చేరుస్తారు. రాత్రి 9 గంటల సమయంలో స్వామివారి రథం కొండకు తిరిగి వస్తుండగా.. గ్రామంలో ఓవైపు కాలువలోకి రథం ముందు చక్రం పడింది. దీంరో రథం ముందుకు ఒరిగిపోయింది. పూర్తిగా పడిపోయింది.


బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా సాగింది. సాయంత్రం నాలుగు గంటలకు రథోత్సవం ప్రారంభమైంది. రథోత్సవం ప్రారంభమైన దగ్గరనుంచే మలుపుల వద్ద రథం సరిగా ముందుకు కదల్లేదు. దీంతో ఆటంకాలు ఎదరయ్యాయని భక్తులు అపశకునంగా భావించారు. కొండ బిట్రగుంట, పాత బిట్రగుంట మధ్య రథం వెళుతున్న సందర్భంలో రోడ్డు అంచుల్లోకి వెళ్లి ఓ చక్రం కుంగింది. అక్కడినుంచి దాన్ని ఎలాగోలా సరిచేసి తిరిగి రోడ్డుపైకి ఎక్కించారు. గ్రామ సచివాలయం మలుపు వద్ద మరోసారి రథం మొరాయించింది. ముందుకు కదల్లేదు. విద్యుత్తు సరఫరా కూడా లేకపోవడంతో జనరేటర్‌ ఏర్పాటు చేయాలని సిబ్బంది అడగడంతో అధికారులు హుటాహుటిన జనరేటర్ తెచ్చారు. ఆ తర్వాత రథం ముందుకు కదిలింది. తిరిగి కొండబిట్రగుంటకు వచ్చింది.


కొండబిట్రగుంటలో రథం పడిపోయింది. రోడ్డు అంచుల్లో లోతుగా ఉన్న కాలువలో కుడి వైపు చక్రాలు దిగడంతో ముందుకు పడిపోయింది. దేవతామూర్తుల విగ్రహాలకు సంప్రోక్షణ చేశాకే ఆలయంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.


గతంలో రథం అగ్ని ప్రమాదంలో కాలిపోవడం పెద్ద చర్చనీయాంశమైంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఘటన జరగడంతో అప్పట్లో అది పెద్ద సంచలనంగా మారింది. అప్పట్లో వరుసగా రథాలు తగలబడిన సంఘటనలు జరిగాయి. ఆ తర్వాత రథాన్ని నూతనంగా నిర్మించారు. చెక్కతో రథాన్ని పటిష్టంగా నిర్మించారు. అయితే ఈసారి రథం పడిపోవడం అపశకునంగా భావిస్తున్నారు. రథోత్సవం ప్రారంబమైనప్పటినుంచి ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంది. చివరకు రథోత్సవం సజావుగా సాగలేదు. స్వామివారి విగ్రహాలు కూడా కిందపడిపోయే సరికి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా వేలాది జంటలు ఇక్కడ వివాహం చేసుకుంటాయి. స్వామివారి కల్యాణోత్సవ మహూర్తానికి అంత బలముందని వారి నమ్మకం. ఇప్పుడిలా రథోత్సవంలో అపశృతి చోటు చేసుకోవడంతో గ్రామస్తులు భయపడుతున్నారు.