"ఇరుకు సందుల్లో సభలు వద్దని స్థానిక నాయకులు చెప్పినా వినకుండా పబ్లిసిటీ స్టంట్ కోసం కందుకూరులో సభ నిర్వహించారు చంద్రబాబు. ఫలితంగా 8 మంది అమాయకులు మృతిచెందారు. ఇప్పటికైనా ప్రచార పిచ్చి తగ్గించుకో బాబూ మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి." కందుకూరు ఘటనపై మాజీ మంత్రి కొడాలి నాని ట్వీట్ ఇది.






"సభకు ఎక్కువ మంది వచ్చారని డ్రోన్ కెమెరా షాట్ల ద్వారా చూపించడానికి కందుకూరు సభలో అందరినీ ఒకేవైపు నిలబెట్టారు టీడీపీ నాయకులు. ఫలితంగా తోపులాట జరిగి 8 మంది మృతిచెందారు. చంద్రబాబు&కో కి అమాయకుల ప్రాణాల కన్నా పబ్లిసిటీనే ముఖ్యమా? " మాజీ మంత్రి పాముల పుష్పశ్రీవాణి చేసిన ట్వీట్ ఇది. కొడాలి నాని, పుష్పశ్రీవాణితోపాటు చాలామంది వైసీపీ సానుభూతి పరులు కూడా సోషల్ మీడియాలో టీడీపీని టార్గెట్ చేశారు. చంద్రబాబు ప్రచారం కోసం 8మందిని చంపేశారంటూ నిందలు వేశారు.






బాధితులు ఆస్పత్రికి వెళ్తే చంద్రబాబు సభలో ఉన్నారా..?


ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. మనవాళ్లు ఆపదలో ఉన్నారు, వారిన ఆస్పత్రికి తరలించారు. ఈ సమయంలో ప్రసంగించడం సబబు కాదు, వారి పరిస్థితి చూసి వస్తాను, ఆ తర్వాత మాట్లాడతాను అంటూ చంద్రబాబు సభా ప్రాంగణం నుంచి వాహనంతో సహా ముందుకు కదిలారు. అయితే ఆస్పత్రిలో బాధితుల ఆర్తనాదాలు ఓవైపు, మరోవైపు చంద్రబాబు ప్రసంగాన్ని చూపిస్తూ కొంతమంది సోషల్ మీడియాలో టీడీపీ ని టార్గెట్ చేశారు. అక్కడ పార్టీ కార్యకర్తలు చావు బతుకుల్లో ఉంటే చంద్రబాబుకి అవేమీ పట్టవా అని ప్రశ్నించారు.


ఏది నిజం, ఎంత నిజం..?


కందుకూరులో సభ జరిగిన ప్రాంతం నాలుకు రోడ్ల కూడలి. దాన్ని ఎన్టీఆర్ సర్కిల్ అంటారు. అక్కడి వరకూ రోడ్ షో నిర్వహించి అక్కడ సభ పెట్టాలని ముందుగానే నిర్ణయించారు. కానీ ఆ స్థాయిలో ప్రజలు వస్తారని ఊహించలేదు. అంచనాలకంటే ఎక్కువగా జనం రావడంతో కంట్రోల్ చేయండ కుదర్లేదు. దీంతో అక్కడ కిక్కిరిసిన ప్రాంగణంలో బహిరంగ వేదికపై చంద్రబాబు ప్రసంగం మొదలు పెట్టారు. ముందుగానే టీడీపీ కందుకూరు ఇన్ చార్జ్ అక్కడ కాల్వ ఉంది జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరించారు. కానీ స్థానికేతరులు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఒకరినొకరు తోసుకుంటూ కొందరు కాల్వలో పడ్డారు.


మురుగు కాల్వలో కొంతమంది పడిన వెంటనే అక్కడున్నవారు అలర్ట్ అయ్యారు. ఆపై అందరూ అటువైపు నుంచి పక్కకు పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో ప్రమాద స్థాయి పెరిగింది. తొక్కిసలాటలో కొందరు స్పాట్ లోనే చనిపోయినట్టు తెలుస్తోంది.


కందుకూరులో  సభా ప్రాంగణంలో జరిగింది ప్రమాదం. అంతే కానీ, అది ప్రచార యావ కాదని అంటున్నారు టీడీపీ నేతలు. కానీ వైసీపీ మాత్రం చంద్రబుపై తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. వాస్తవానికి రాయలసీమ, ఉత్తరాంధ్ర పర్యటనల్లో కూడా చంద్రబాబు సభలకు జనం భారీగా హాజరవుతున్నారని టీడీపీ చెప్పుకుంటోంది. దీంతో ఇటు  నెల్లూరు జిల్లాలో కూడా సభకు భారీగా జనం తరలి వచ్చారు. అనుకోకుండా ప్రమాదానికి గురయ్యారు.