Nellore District Politics: నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మహిళా నేతల ప్రాతినిథ్యం తక్కువ. 2014లో అయినా, 2019లో అయినా ఇక్కడ ఎమ్మెల్యేలుగా పురుషులే ప్రధాన పార్టీల నుంచి అవకాశం దక్కించుకుని గెలిచారు. ప్రస్తుతం వైసీపీ లిస్ట్ లో కూడా పురుషులకే ప్రాధాన్యం ఉంది. కానీ తొలిసారిగా టీడీపీ మహిళా నేతలకు పెద్దపీట వేసింది. వారసులే అయినా ఈసారి ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇద్దరు మహిళలకు టీడీపీ టికెట్లు ఖరారు చేసింది.
కోవూరు నుంచి ప్రశాంతి రెడ్డి..
నెల్లూరు జిల్లా కోవూరులో ప్రస్తుతం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నారు. ఈసారి కూడా ఆయనకే వైసీపీ టికెట్ ఖరారయ్యే అవకాశాలున్నాయి, అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఓ దశలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంతి రెడ్డికి ఇక్కడ వైసీపీ టికెట్ ఖాయం అనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఆ తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరడంతో వైసీపీ టికెట్ తనదేనంటూ ప్రసన్న రిలాక్స్ గా ఉన్నారు. అయితే వేమిరెడ్డి టీడీపీలోకి ఎంట్రీ ఇవ్వడంతో అప్పటికే అక్కడ ఇన్ చార్జ్ గా ఉన్న పోలంరెడ్డి దినేష్ రెడ్డి లో టెన్షన్ మొదలైంది. ఈరోజు టీడీపీ లిస్ట్ బయటకు రావడంతో ఆయన ఆందోళనే నిజమైంది. కోవూరు అసెంబ్లీ సీటుని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి టీడీపీ ఖరారు చేసింది.
కోవూరు నియోజకవర్గ చరిత్రలో ఇప్పటి వరకు మహిళలకు ఎమ్మెల్యేగా అవకాశం రాలేదు. తొలిసారిగా ప్రధాన పార్టీ టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ఇక్కడ ఛాన్స్ దొరికింది. మరి ఆమె ఈ ఎన్నికల్లో గెలిచి కోవూరు చరిత్రలో తొలి మహిళా ఎమ్మెల్యేగా రికార్డ్ సృష్టిస్తారేమో చూడాలి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన సర్వ శక్తులు ఒడ్డి ఇక్కడ ఎలక్షన్ గెలవాలనుకుంటున్నారు. తన ప్రత్యర్థి ఎవరనేది తెలియడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిలో కూడా ఆందోళన మొదలైంది. ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.
ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి వెంకటగిరి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీ ప్రశాంతికి టికెట్ ఖరారు చేశారు చంద్రబాబు. వాస్తవానికి ఇక్కడ సీటు వ్యవహారం చాన్నాళ్లుగా హాట్ టాపిక్ గా ఉంది. మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల తనకే సీటు అని చెబుతూ వచ్చారు, మధ్యలో డాక్టర్ మస్తాన్ యాదవ్ రూపంలో ఆయనకు పోటీ మొదలైంది. ఆ తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీలో చేరిన తర్వాత తాను వెంకటగిరి బరిలోనే ఉంటానంటూ కొన్నిరోజులు హడావిడి చేశారు. చివరకు ఆనంకు ఆత్మకూరు ఫిక్స్ కావడంతో వెంకటగిరిలో ఇద్దరి మధ్య సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి. ఈ దశలో కురుగొండ్ల రామకృష్ణకు కాకుండా ఆయన కుమార్తె లక్ష్మీ ప్రశాంతికి చంద్రబాబు టికెట్ ఖరారు చేయడం విశేషం.
వెంకటగిరిలో గతంలో నేదురుమల్లి రాజ్యలక్ష్మి రెండు దఫాలు ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ఆర్ హయాంలో ఆమె మంత్రిగా కూడా పనిచేశారు. మళ్లీ ఇప్పుడు అక్కడ మహిళా అభ్యర్థి తెరపైకి రావడం విశేషం. టీడీపీ ఆఫర్ ను వీరిలో ఎవరు సక్సెస్ చేసుకుంటారో చూడాలి.