Somireddy Chandramohan Reddy counters to YS Jagan: వైసీపీ ఉంటుందో.. లేదో చూసుకో జగన్ రెడ్డీ.. ఈవీఎం పగలగొట్టి, సీఐపై హత్యాయత్నం చేస్తే తప్పు లేదా? పాపాలు చేశారు కాబట్టే ఈ రోజు ఫలితం అనుభవిస్తున్నారు’’ అని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డిని జైలులో ములాఖత్ కావడంపై సోమిరెడ్డి స్పందించారు.
సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘పిన్నెల్లి పరామర్శ కోసం నెల్లూరుకు వచ్చిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హితబోధలు చేయడం హాస్యాస్పదం. ఆయన అన్నీ డోర్ డెలివరీ చేశారంట.. అవును నిజమే.. డ్రైవర్ సుబ్రహ్మణ్యం డెడ్ బాడీని కూడా డోర్ డెలివరీ చేశారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి కేసులో చిన్నరాయి కారణంగా సీఐ తల పగిలిందంట. ఈయన మీద చిన్నగులకరాయి పడిందని విజయవాడ యువకుడిని నెల్లూరులో ఇదే జైలులో పెట్టిన విషయం మాత్రం గుర్తులేదా? భుజంపై బఠాని గింజంత గాయం లేకపోయినా కోడికత్తి కేసులో శ్రీనుపై కనికరం లేకుండా ఐదేళ్లు జైలులో పెట్టించారు.
కులం చూడలేదంట, మతం చూడలేదంట. పార్టీ చూడలేదంట. ఇది కూడా నిజమే. ఒక రామోజీరావు, ఒక అమర్ రాజా ఫ్యాక్టరీ, సంగం డెయిరీ, రఘురామకృష్ణంరాజు, అచ్చెన్నాయుడు చివరకు చంద్రబాబు నాయుడిని కూడా వదిలిపెట్టకుండా కక్షసాధింపుల్లో అందరినీ సమానంగా చూశాడు. ఈవీఎం పగలకొడితే తప్పేమిటని ఒక సీఎంగా పనిచేసిన వ్యక్తి అనడం చాలా దురదృష్టకర పరిణామం. ప్రజాస్వామ్యం, చట్టం, ఎన్నికల కమిషన్ పై జగన్మోహన్ రెడ్డికి కనీస గౌరవం లేదు.
చంద్రబాబు నాయుడు అనుభవిస్తారంటూ శాపనార్థాలు పెట్టడం కాదు. మీరు చేసిన పాపాలకు వచ్చే ఎన్నికల వరకు వైసీపీ ఉంటుందో.. లేదో చూసుకోండి. మీరు మంచి చేసి ఉంటే ప్రజలు మిమ్మల్ని 11 సీట్లకు ఎందుకు పరిమితం చేశారో ఆలోచించుకోండి. వైసీపీ ఐదేళ్ల పాలనలో అనేక దుర్మార్గాలకు పాల్పడ్డారు.. కాబట్టే ఈరోజు పాపాలకు ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్నారు’’ అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు.