నెల్లూరు జిల్లాలో నారా లోకేష్ యువగళం యాత్ర కొనసాగుతోంది. అనంతసాగరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వైసీపీ నేతలపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. తన యాత్ర నెల్లూరులోకి రాగానే వైసీపీ నేతల ఫ్యాంట్లు తడిచిపోయాయని, అందుకే తనపై విమర్శలు చేయడానికి వరుసగా ప్రెస్ మీట్లు పెట్టారని అన్నారు. సింహపురి లో యువగళం గర్జన మొదలైందన్నారు లోకేష్. 


ఆనం వెంట ఆత్మకూరులో.. 
నారా లోకేష్ ఆత్మకూరు నియోజకవర్గ పర్యటనలో అన్నీ తానై నిలబడుతున్నారు ఆనం రామనారాయణ రెడ్డి. కుమార్తె కైవల్యా రెడ్డితో కలసి రామనారాయణ రెడ్డి యువగళం యాత్రలో ఉన్నారు. ఆత్మకూరు ప్రజలకు ఆత్మాభిమానం ఎక్కువని, ధర్మం వైపు నిలబడతారని, ధర్మం చేసే గుణం ఇక్కడి ప్రజలకు ఉందని చెప్పారు లోకేష్. రాజులు ఏలిన నేల ఆత్మకూరు అని, జిల్లా మొత్తానికి సాగు, తాగు నీరు అందించే సోమశిల జలాశయం ఉంది ఇక్కడే అని వివరించారు. ఎన్టీఆర్ హయాంలో సోమశిల, కండలేరు ప్రాజెక్టులను నిర్మించి లక్షల ఎకరాలకు సాగునీరు అందించారని గుర్తు చేశారు. ఘన చరిత్ర ఉన్న ఆత్మకూరు నేలపై పాదయాత్ర చెయ్యడం తన అదృష్టం అన్నారు నారా లోకేష్. 


వణికిపోయారు..
రాయలసీమ జిల్లాల్లో తాను అడుగుపెట్టిన తరువాత వైసీపీ నేతలు గజగజా వణికారని అన్నారు లోకేష్. నెల్లూరు జిల్లాలో అడుగుపెట్టక ముందే వైసీపీ నేతలు ప్యాంట్లు తడుపుకున్నారని ఎద్దేవా చేశారు. నెల్లూరు నుంచే మార్పు మొదలవుతుందని తాను జనవరిలోనే చెప్పానన్నారు. సింహపురి లో మార్పు మొదలైందని, జగన్ పనైపోయిందని చెప్పారు. యువగళాన్ని అడ్డుకోవడానికి జగన్ అడ్డదారులు తొక్కాడన్నారు. జీఓ నెంబర్-1 తెచ్చారని, దాన్ని మడిచి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో అని చెప్పానన్నారు. తాను మాత్రం తగ్గేదే లేదన్నారు. యువగళానికి వస్తున్న జనాన్ని చూసి జగన్ కి ఫ్రస్ట్రేషన్ వచ్చిందని, ఇప్పటికే నాలుగు టీవీలు పగలగొట్టాడని సెటైర్లు పేల్చారు. 


కోడికత్తి బ్యాచ్ తో కోడిగుడ్లు.. 
తనను ఏమీ చెయ్యలేక కోడికత్తి బ్యాచ్ ని పంపి కోడిగుడ్లు వేయించారని అన్నారు నారా లోకేష్. క్లైమోర్ మైన్లకే భయపడని కుటుంబం తమది అని, కోడికత్తి బ్యాచ్ కి భయపడతామా..? అని ప్రశ్నించారు.  కోడిగుడ్డు విసిరిన కోడికత్తి బ్యాచ్ కి మన వాళ్లు మొఖం మీద ఆమ్లెట్లు వేసి పంపారన్నారు. జగన్ ఒక ఫెయిల్డ్ సీఎం అన్నారు లోకేష్.  బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల్ పేషీలో సిబ్బందికి 7 నెలలుగా జీతాలు ఇవ్వలేదని, అందుకే వారు పేషీకి తాళాలు వేసి వెళ్లిపోయారని, వాళ్ల జీతాలు బీసీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్ నుంచి ఇస్తున్నారని చెప్పారు. అంటే ఇక్కడ సీఎం ఫెయిల్, బీసీ శాఖ మంత్రి ఫెయిల్, ప్రభుత్వం ఫెయిల్, బీసీ కార్పొరేషన్ ఫెయిల్, కాపు కార్పొరేషన్ ఫెయిల్ అని అన్నారు లోకేష్. 


చంద్రబాబు కట్టిన సచివాలయం కూర్చోవడం చేతగాని వాళ్లు మూడు రాజధానులు కడతాం అని బిల్డప్ ఇస్తున్నారని చెప్పారు లోకేష్. జగన్ విశాఖ ను క్రైం క్యాపిటల్ చేసారని అమిత్ షా చెప్పారని, ఆ తర్వాత మంత్రులంతా రోడ్డు మీదకి వచ్చి మొరిగారని, ఇప్పుడు అమిత్ షా చెప్పింది నిజం అని తేలిందని, విశాఖ ఎంపీ సత్యనారాయణ కొడుకు, భార్య, ఆడిటర్ జివి ని ఒక గ్యాంగ్ కిడ్నాప్ చేసిందని, భూ కబ్జాల్లో వచ్చిన తేడాల వల్లే ఈ కిడ్నాప్ లు జరిగాయన్నారు లోకేష్.