YS Jagan shifted to Vizag: మరో 2, 3 నెలల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖకు మకాం మార్చనున్నారని రాష్ట్ర మంత్రులు చెబుతున్నారు. అయితే జగన్ రుషికొండకు కాదు... ఇడుపుల పాయకు పోతే దరిద్రం పోతుందంటూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. జగన్ వైజాగ్ వెళితే అక్కడ టీడీపీ మెజారిటీ మూడు రెట్లు పెరుగుతుంది అని నెల్లూరు రూరల్ నియోజకవర్గ  నేతలు కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు అన్నారు.


చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే.. ‘వైసీపీ ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్దభేరి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నాను. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన మన పై తప్పుడు కేసులు పెడుతున్నారు. దాడులు చేస్తున్నారు. అయితే ప్రజాస్వామ్యంలో ఈతరహా రాజకీయాలకు ప్రజల మద్దతు ఉండదు. అందుకే అంగళ్లు, పుంగనూరులో ప్రజా తిరుగుబాబు మొదలైంది. తమ నేరాల్లో పోలీసులను కూడా వైసీపీ నేతలు భాగస్వాములు చేస్తున్నారు. తమ నేరాల్లో పోలీసులను, వ్యక్తులను భాగం చేయడం ద్వారా వారిని తమ ఆధీనంలో పెట్టుకుని పనిచేస్తారు. దీని వల్ల వారి జీవితం నాశనం అవుతుంది. పోలీసు అధికారులు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించవద్దు. అవసరం అయితే ఉన్నతాధికారుల అదేశాలతో విభేదించండి’ అని సూచించారు. 


నెల్లూరు రూరల్ టీడీపీ కి బలమైన నియోజకవర్గం అని, వచ్చే ఎన్నికల్లో రూరల్ నియోజకవర్గం (ప్రస్తుతం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి)లో టీడీపీ గెలవాలని చంద్రబాబు సూచించారు. వైసీపీ చేసే అరాచకాలకు కాలం చెల్లింది. వచ్చే ఎన్నికల్లోపులివెందుల కూడా గెలవబోతున్నాం. అంటే 175 గెలిచే అవకాశం ఉందని దీమా వ్యక్తం చేశారు. సైకో పోవాలి అని మనం పోస్టర్ వేస్తే.... సైకో అనే పదం కనపడకుండా అధికారులు స్టిక్కర్ వేశారని చెప్పారు. సీఎం జగన్ నిర్ణయాలు సైకో తరహా నిర్ణయాలు అన్నారు. 


జగన్ వైజాగ్ వస్తాను అంటే విశాఖ ప్రజలు వణికిపోతున్నారని, జగన్ లాంటి ఐరన్ లెగ్ వద్దు అని విశాఖ ప్రజలు అనుకుంటున్నారని చంద్రబాబు చెప్పారు. జగన్ విశాఖ వెళితే అక్కడి వాతావరణం పొల్యూట్ అవుతుందన్నారు. మరోవైపు జగన్ విశాఖ వెళితే ఉత్తరాంధ్రలో టీడీపీ మెజారిటీ రెండు మూడింతలు పెరుగుతుందని దీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం వద్ద టీడీపీ నేతలు కోంటరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పి.నారాయణ, ఆనం రాంనారాయణ రెడ్డి, బీదా రవిచంద్రతో పాటు జిల్లా ముఖ్యనేతలు చంద్రబాబుకు స్వాగతం పలికారు.


ఆనాడు వెంకన్న స్వామే నన్ను కాపాడాడు: శ్రీకాళహస్తిలో చంద్రబాబు 
శ్రీకాళహస్తిలో సాగు నీటి విధ్వంసంపై యుద్దభేరిలో శనివారం చంద్రబాబు ప్రసంగించారు. గుమ్మడికాయ దొంగ అంటే బియ్యపు మధుసూదన్ రెడ్డి భుజాల తడుముకుంటారని, గోపాలకృష్ణారెడ్డి బతికున్నంతవరకు బియ్యపురెడ్డిని ఎప్పుడైనా, ఎవరైనా చూశారా అని ప్రజల్ని అడిగారు. పుంగనూరులో తనపై జరిగిన మీద దాడి ప్రజాసామంపై, ప్రజలపై దాడి లాంటిదని, పరిస్థితి ఇలాగే ఉంటే ఆంధ్రప్రదేశ్ నార్త్ కొరియా, తెలంగాణ సౌత్ కొరియాల తయారవుతుందన్నారు. చాలా సార్లు శ్రీకాళహస్తికి వచ్చాను.. 45 ఏళ్లగా ఇక్కడ మీటింగ్ పెట్టాను కానీ గతంలోల తనను ఎవరూ అడ్డుకోలేదన్నారు. శ్రీకాళహస్తి ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఎప్పుడు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురుచూస్తున్నారని, బియ్యపురెడ్డిని ఎక్కడకు పంపించాలో నిర్ణయించుకోవాలన్నారు.