Pawan Kalyan Reaction on Nellore Incident:

  నెల్లూరు జిల్లా కావలిలో పోలీసులు, బీజేపీ నేతల నిరసననుల అడ్డుకునే క్రమంలో దారుణంగా వ్యవహరించారంటూ మండిపడ్డారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. ట్విట్టర్లో ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు. అణచివేత చర్యలను ఖండించారు జనసేనాని పవన్. నియంతృత్వాన్ని సహించేది లేదన్నారు. నిరసన గళాలను అణచి వేయడం సరికాదని ప్రభుత్వానికి హితవు పలికారు. 


అసలేం జరిగిందంటే..?
నెల్లూరు జిల్లా కావలిలో శుక్రవారం సీఎం జగన్ సభ సందర్భంగా పోలీసుల చర్యలు సంచలనంగా మారాయి. సీఎం సభకు కాస్త ముందుగా బీజేపీ నేతలు అక్కడ హడావిడి చేశారు. నిరసన ప్రదర్శనకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో స్థానిక డీఎస్పీ వెంకట రమణ.. బీజేపీ నాకుడు మొగిరాల సురేష్ తలను కాళ్ల మధ్య పెట్టి నొక్కడాన్ని బీజేపీ నేతలు ఖండించారు. మొగిరాల సురేష్ నిరసనను అడ్డుకునే క్రమంలో అతడిపై పోలీసులు తీసుకున్న చర్యలపై ప్రజాస్వామ్య వాదులు మండిపడ్డారు.




కావలి డీఎస్పీపై ఆరోపణలు.. 
టీడీపీ అనుకూల మీడియాలో ఈ వార్తలు హైలెెట్ కాగా, వైసీపీ అనుకూల మీడియా పోలీసు చర్యలను సమర్థించింది. ఈ క్రమంలో కావలి డీఎస్పీ వెంకట రమణ వ్యవహారం సంచలనంగా మారింది. అసలు వెంకట రమణ నెల్లూరు జిల్లాకు ఎలా వచ్చారు, ఎవరి ద్వారా పోస్టింగ్ సాధించారనే విషయాన్ని కూపీలాగి మరీ బయటపెట్టారు. కావలి డీఎస్పీ ఎం.వెంకటరమణ స్వామిభక్తి చాటుకున్నారంటూ టీడీపీ అనుకూల మీడియా ఆరోపణలు చేసింది. ఆరునెలల క్రితం  తిరుపతి స్పెషల్‌ బ్రాంచిలో పనిచేసేవారు వెంకట రమణ. కావలిలో లా అండ్‌ ఆర్డర్‌ కు సంబంధించి సబ్‌ డివిజనల్‌ పోలీసు అధికారిగా ఇటీవల ఇక్కడకు వచ్చారు. స్థానిక ఎమ్మెల్యే సిఫారసులు లేకుండా నేరుగా ఆయనక ఇక్కడకు రావడం సంచలనంగా మారింది. ఆయనకు డీజీపీ ఆశీస్సులున్నాయని అంటున్నారు. సీఎం పర్యటనలో భాగంగా నిర్వహించే నిరసనలు సక్సెస్ అయితే, ప్రభుత్వం వద్ద డీజీపీకి ఇబ్బంది ఎదురవుతుందనే కారణంతో డీఎస్పీ వెంకటరమణ నిరంకుశంగా నిరసనలు అడ్డుకున్నారని అంటున్నారు. అందుకే ఆయన బీజేపీ నాయకుల పట్ల కఠినంగా వ్యవహరించారని తెలుస్తోంది. 


పవన్ కల్యాణ్ స్పందన ఏంటంటే..?
"నిరసన గళాలు అణచి వేసేస్తాం... కాళ్ళ కింద పడేసి తొక్కుతాం అంటే అది నియంతృత్వమే. బీజేపీ ఓబీసీ మోర్చా ఏపీ ఉపాధ్యక్షులు మొగరాల సురేష్ పట్ల కావలిలో పోలీస్ అధికారి వ్యవహరించిన తీరు పాలకుల మనస్తత్వానికి అద్దంపడుతోంది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా  ఈ అణచివేత చర్యలను ఖండిస్తున్నాం. వైసీపీ ప్రభుత్వ అవినీతిపై సురేష్ చేస్తున్న నిరసనకు అండగా ఉంటాం." అంటూ ట్వీట్ వేశారు పవన్ కల్యాణ్. 


 






ఇటీవల పవన్ తనకు సీఎం అయ్యే ఆశ, అవకాశం లేదంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు. అదే సమయంలో టీడీపీతో పొత్తు ఉంటుందనే విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు. దీంతో బీజేపీ కాస్త నొచ్చుకున్నట్టయింది. ఇప్పుడు బీజేపీ నేతల నిరసనపై పవన్ కల్యాణ్ స్పందించి ట్వీట్ వేయడం ఆసక్తిగా మారింది. కావలిలో పోలీస్ అధికారి వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో రాజకీయంగా కూడా ఆయనపై ఒత్తిడి పెంచేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. బీజేపీకి మద్దతుగా జనసేనాని పవన్ వేసిన ట్వీట్ కూడా వైరల్ గా మారింది.