Pawan Kalyan Comments in Srihari Kota: తెరపై కనిపించకుండా దేశం కోసం జీవితాన్ని ధారబోసిన శాస్త్రవేత్తలు నాకు నిజమైన స్ఫూర్తిప్రదాతల'ని ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ అన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన సంస్థ (షార్) నిర్వహించిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు చిన్నారులు, కళాశాల యువత, షార్ శాస్త్రవేత్తలు, సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ "ఒక ఫార్ములా కనుక్కోవడానికి కాని, ఓ ప్రయోగం నిర్వహించేందుకుగానీ శాస్త్రవేత్తలు చేసే మేధో మధనం చాలా విలువైనది. ఆలోచనల్లో పడి వారు నిద్ర, ఆహారానికి కూడా ఒక్కోసారి దూరం అవుతారు. దేశానికి ఏదో ఒకటి చేయాలనే తపన, ఏకాగ్రత, శ్రమ అమూల్యమైనవి. వారికి ఈ దేశం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేదు. అలాంటి హీరోలు ప్రజలకు తెలియాలి.
బలంగా కోరుకుంటే మంచి జరుగుతుంది
నేను నెల్లూరులో చదువుకున్నాను. నాకు చిన్నప్పటి నుంచి శాస్త్రసాంకేతిక రంగాలు, అంతరిక్ష ప్రయోగాలపై మక్కువ ఉండేది. స్కూల్లో టీచర్ ను పదేపదే దీనిపై ప్రశ్నలు అడిగేవాడిని. టీచర్ నాలో ఉన్న తపనను గుర్తించి... నన్ను స్కూలు సైన్స్ టీంలో వేసి ఆర్యభట్ట ఉపగ్రహ ప్రయోగం మీద ఓ నమూనా తయారు చేసి తీసుకురమ్మన్నారు. నానా రకాల పాట్లు పడి... అప్పుడున్న వనరులతో సాధారణ పేపర్ నమూనా తయారు చేయడానికే నాకు చుక్కలు కనిపించాయి. మరి అంతరిక్షంలోకి ప్రయోగించే, అక్కడ పని చేసే ఉపగ్రహాల తయారీకి, వాటి ప్రయోగానికి శాస్త్రవేత్తలు ఎంత కష్టపడతారో అన్న ఆలోచన నాకు శాస్త్రవేత్తలపై అమితమైన గౌరవాన్ని పెంచింది.
1969 నుంచి ఇంతింతై వటుడింతై అన్నట్లు సాగిన భారతదేశ అంతరిక్ష పరిశోధన ప్రయాణం నేడు ప్రపంచంలోనే మేటిగా మారింది. భారత్ ను బలమైన శక్తిగా నిలపడంలో ఎందరో కనిపించని హీరోల కష్టం దాగుంది. వారి విజ్ఞానం ఉపయోగించుకొని నిరంతరం ముందుకు సాగుతున్న వారికి మాత్రమే విజిల్స్, చప్పట్లు దక్కాలని భావిస్తాను.
దైవం మానుష రూపేణా
చిన్నప్పుడు నేను, మా అమ్మ ప్రతిరోజు సాయంత్రం అవగానే ఇంట్లో బల్బు స్విచ్ వేసి దణ్నం పెట్టుకోవడం గమనించేవాడిని. నువ్వు ఎవరికి మొక్కుతున్నావు అని అడిగితే బల్బు కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్ కు అని చెప్పేది. అంటే శాస్త్రవేత్తలను, వారి జ్ఞానాన్ని దేవుడిగా నమ్మే సంప్రదాయం మనది. పది మందికి మంచి చేసేవారికి దణ్నం పెట్టడమే భారతీయ ధర్మం. విశ్వం తాలుకా శక్తి నన్ను ఇక్కడ వరకు నడిపించింది అని నమ్ముతాను. మంచి చేయాలని, దేశానికి ఏదో ఇవ్వాలని బలంగా అనుకుంటే కచ్చితంగా అది జరిగి తీరుతుంది. అలాగే దేశం కోసం పనిచేసే ప్రతి శాస్త్రవేత్తకు జాతి రుణ పడి ఉంది.
ఎక్కడో ఒక చోట అడుగుపడితేనే...
ఎక్కడో కేరళలోని తుంబ అనే ప్రాంతంలో చిన్నస్థాయిలో మొదలైన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయాణం నాకు స్ఫూర్తిదాయకం. ఎక్కడో ఒక చోట అడుగుపడితేనే అది వేల మైళ్ల ప్రయాణానికి దారి చూపుతుంది. మన దగ్గర వనరుల్లేవు.. మనకు శక్తి లేదు.. మన వల్ల కాదు అనుకుంటే ఏదీ కాదు. భారతీయ పరిశోధన సంస్థ ఒకేసారి 104 ఉపగ్రహాలను పంపే స్థాయికి ఎదగడం ఓ గొప్ప రికార్డు. మాజీ రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం గారు ఎప్పుడు ఒకటి చెబుతుండేవారు. నీ కల.. నీ ఆశయం పెద్దగా ఉండాలి అని అనేవారు. నిజంగానే ఆయన మాట ఓ స్ఫూర్తి మంత్రం. ఇస్రో పెద్దలు కూడా ఒకప్పుడు అలాగే కలలు కనేవారు.
గగన్ యాన్ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరిస్తుంది
ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే గగన్ యాన్ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన సహాయ సహకారాలు అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అంతరిక్ష పరిశోధనలను పూర్తిస్థాయిలో ప్రొత్సహిస్తుంది. శాస్త్రవేత్తల కృషి, వారి జ్ఞానం వినియోగించుకొని అద్భుతాలు చేయాలని భావిస్తోంది. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇప్పుడు స్పేస్ ఎకానమీని సృష్టించే స్థాయికి ఎదిగింది. విదేశాలకు చెందిన ఉపగ్రహాలను మనం కక్ష్యలో ప్రవేశపెట్టడం ద్వారా స్పేస్ ఎకానమీని మనం సాధిస్తున్నాం.
ఇస్రోతో ఎంఓయూ
ఆంధ్రప్రదేశ్ యువతలో అపరిమితమైన జిజ్ఞాస ఉంది. దీన్ని సరైన రీతిలో ముందుకు తీసుకెళ్లే దారి లేక యువత ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. ఇస్రోతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో విజ్ఞాన విషయాలను పంచుకునేందుకు, విలువైన సూచనలు యువతకు అందించే నిమిత్తం ఓ ఎంఓయూ చేసుకోవాలని భావిస్తున్నాను. దీనిపై నేను క్యాబినెట్ లో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాను. భావితరాలకు అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి ఏర్పడాలి. యువతకు అంతరిక్ష పరిశోధనలపై ఉన్న ఆకాంక్షకు తగిన ఉపాధి మార్గం లేదా పరిశోధనల మార్గం చూపేలా ఇస్రో అధికారులు తగిన గైడెన్స్ ఇచ్చేలా మాట్లాడుతాం. గ్రామీణ, అర్భన్ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులను అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తిని పెంచేలా ముందుకు వెళ్లాలి. దీనికి ప్రత్యేకంగా ఓ ఎంఓయూ చేసుకొని సంయుక్తంగా ముందుకు వెళ్లేలా ప్రయత్నాలు చేస్తాం’’ అని పవన్ అన్నారు.