మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో సంక్షేమ పథకాలు బాగానే ఉన్నా, అభివృద్ధి పనుల్లో ఆలస్యం, అధికారుల్లో అలసత్వం ఎక్కువైందని గతంలో పలుమార్లు ఆయన వివిధ సందర్భాల్లో జిల్లా మీటింగుల్లో ప్రస్తావించారు. ఈసారి ఐ ప్యాక్ టీమ్ ముందే ఆయన ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టారు.
ఏపీ ప్రభుత్వ పాలనపై సంచలన వ్యాఖ్యలు
మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి శాసన సభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి ఏపీ ప్రభుత్వ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇదే ప్రాంతంలో ఓట్లు అడిగే సమయంలో ప్రాజెక్ట్ లు కడతామంటూ ప్రజల్ని నమ్మించామని, కానీ మూడేళ్లలో దానికి సంబంధించిన పనులు మొదలు పెట్టలేకపోయామని చెప్పారు. పెన్షన్లకే ప్రజలు ఓట్లు వేస్తారనుకోలేమన్నారు. లే అవుట్లు అన్నారు, ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు.. కానీ ఏవీ కాలేదన్నారు. సచివాలయాల పరిధిలో నియమించిన కన్వీనర్లు, వాలంటీర్లతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన వాస్తవాలను కుండబద్దలు కొట్టారు. ఈ కార్యక్రమానికి ఐప్యాక్ ప్రతినిధి శబరినాథ్ రెడ్డి హాజరయ్యారు. అందరూ కలసి ఏడాదిపాటు సమన్వయంగా పనిచేయాలంటూ ఐప్యాక్ ప్రతినిధి చెప్పారని, కానీ ఇక్కడ వాస్తవం వేరు అని చెప్పారు. కనీసం మిగిలిన ఏడాదిలో అయినా పనులు చేపట్టాలని, ఇది మేం చేశాం అని చెప్పుకోడానికి మాకో అవకాశం ఇవ్వాలన్నారు.
మంత్రి పదవి దక్కలేదని మొదట్నుంచీ కోపమే !
సీనియర్ అయిన తనకు మంత్రి పదవి ఇవ్వలేదనే కోపం ఆయనకు మొదటి నుంచీ ఉంది. అయినా కూడా ఆయన పార్టీలోనే ఉన్నారు. ఓ దశలో ఆనం పార్టీ మారతారనే ప్రచారం జరిగినా ఇప్పటికిప్పుడు అలాంటి తొందరపాటు నిర్ణయం ఆయన తీసుకోరని అనుచరులందరికీ తెలుసు. అదే సమయంలో అధికారులు తన మాట వినకపోయినా, తన నియోజకవర్గంలో పనులు ఆలస్యమైనా ఆయన ఏమాత్రం ఊరుకోరు. అక్కడికక్కడే నిలదీస్తారు. జిల్లా అభివృద్ధి కమిటీ మీటింగుల్లో ఇప్పటికే చాలాసార్లు అధికారుల్ని చెడామడా వాయించేశారు. అలాంటి రామనారాయణ రెడ్డికి ఈరోజు ఐప్యాక్ ప్రతినిధిగా వచ్చిన శబరినాథ్ రెడ్డి కోపం తెప్పించారు. ఏడాదిపాటు అందరూ కలసికట్టుగా పనిచేయండి, మళ్లీ అధికారం మనకే రావాలని సూచించారు.
ఐప్యాక్ టీమ్ తో చాలాచోట్ల సీనియర్లకు సెట్ కావడంలేదు. రాజకీయాలు రామనారాయణ రెడ్డికి ఎవరూ కొత్తగా నేర్పాల్సిన పనిలేదు. కానీ ఇక్కడ ఐప్యాక్ ప్రతినిధులు కూడా సభలో కూర్చోవడం, సలహాలివ్వడంతో ఆయనకు కాలింది. దీంతో ఆయన ముందే అసలు మనం ఏం చేశామని ప్రజలు ఓట్లు వేస్తారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రాజెక్ట్ లు కట్టామా, రోడ్లు వేశామా, ఇంకేదైనా చేశామా అని అడిగారు. కేవలం పెన్షన్లు ఇస్తేనే ఓట్లు పడతాయా.. గత ప్రభుత్వాలు పింఛన్లు ఇవ్వలేదా అని ప్రశ్నించారు.
పనులు కావట్లేదని ఆనం ఆవేదన..
వాస్తవానికి క్షేత్ర స్థాయిలో పరిస్థితులు కొన్నిచోట్ల దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు పెన్షన్లు ఎగిరిపోవడంతో పల్లెల్లో వ్యతిరేకత పెరుగుతోంది. రీసర్వే చేయిస్తామని నాయకులు సర్ది చెబుతున్నా కుదిరేలా లేదు. అనర్హులు అనే పేరుతో పెన్షన్లు తీసేసినా ఆ కుటుంబం నుంచి ఒక్క ఓటు కూడా వైసీపీకి పడే పరిస్థితి లేదు. అసలు పెన్షన్లు పెంచాలని ఎవరడిగారు అని నిలదీస్తున్నారు. ఈ దశలో మరోసారి ఓటు అడగాలి అంటే, కచ్చితంగా అభివృద్ధి ఏంటో చూపించాలనేది ఆనం వంటి సీనియర్ల వాదన. అందుకే ఆయన ఐ ప్యాక్ టీమ్ సభ్యుడి ముందే ప్రభుత్వం ఏం చేసిందో, ఏం చేయాలో అనే విషయాలను వివరించారు. అయితే ఈ ఘాటు కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.