మహిళా దినోత్సవం సందర్భంగా ఎంతో మంది విజేతలైన మహిళల కథలు వినిపిస్తాయి. కానీ ఈమె కథ కొంచెం భిన్నం.. చాలా స్ఫూర్తిదాయకం. ఎందుకంటే ఎక్కడ వాలంటీర్ గా పని జీవితాన్ని ప్రారంభించిందో ఇప్పుడు అదే మున్సిపాలిటీకి ఆమెనే ఛైర్ పర్సన్. ఈమె ఇంట్రెస్టింగ్ స్టోరీ అందరికీ స్ఫూర్తిదాయకం.


అప్పటికి కేవలం రూ.5 వేల రూపాయల గౌరవ వేతనం తీసుకునే సాధారణ వార్డ్ వాలంటీర్ ఆమె. ఆ తర్వాత 35 వేల మంది జనాభాకు ఆమె ప్రథమ మహిళ. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వార్డ్ వాలంటీర్ గా పనిచేస్తూ.. స్థానిక ఎన్నికల్ల అనూహ్యంగా చైర్ పర్సన్ గా ఎంపికైన ఆమె పేరు గోపారం వెంకట రమణమ్మ. ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ఉన్నత చదువులకు వెళ్లే ఆర్థిక స్థోమత లేక షాపుల్లో సేల్స్ గర్ల్ గా పనిచేసేది వెంకటమ రమణమ్మ. ఆ తర్వాత టీచర్ గా కొన్నాళ్లు విద్యార్థుకు పాఠాలు బోధించింది. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చాక వాలంటీర్ గా విధుల్లో చేరింది. అనూహ్యంగా ఆత్మకూరు చైర్ పర్సన్ గా ఎంపికైంది.


వాలంటీర్ గా ఉంటే కేవలం 50 కుటుంబాల సమస్యలే తెలిసేవని, చైర్ పర్సన్ గా ఇప్పుడు మున్సిపాల్టీలోని ప్రజలందరితో మమేకం అయ్యే అవకాశం కలిగిందని చెబుతోంది వెంకట రమణమ్మ. ఎస్టీ రిజర్వ్ డ్ స్థానంలో చైర్ పర్సన్ గా ఎంపికైన వెంకట రమణమ్మ.. విద్యార్థి దశలో ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకుంది. తల్లిదండ్రులు కూలిపనులకు వెళ్లేవారు. చదువుకునే సమయంలో ఎన్నో సమస్యలను అధిగమించానని, ఇప్పుడు కూడా చదువుని వదిలిపెట్టడంలేదని చెబుతోంది వెంకట రమణమ్మ.


మేకపాటి కుటుంబం వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని, ముఖ్యంగా దివంగత నేత గౌతమ్ రెడ్డికి తానెంతో రుణపడి ఉంటానని చెబుతోంది వెంకట రమణమ్మ. వాలంటీర్ నుంచి చైర్ పర్సన్ గా ఎదిగినా.. చదువుని మాత్రం కొనసాగిస్తానని అంటోంది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా స్థిరపడాలనేది తన జీవితాశయం అని చెబుతోందామె.