భారీ వర్షాలకు పెన్నమ్మ పోటెత్తడంతో వరదనీరు నెల్లూరుపై ప్రతాపం చూపించింది. ఇప్పటికే నెల్లూరు నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఈ క్రమంలో వరదనీరు రోడ్లపైకి పోటెత్తింది. ఈ ప్రవాహ ఉధృతికి ఏకంగా హైవేలు సైతం కొట్టుకుపోతున్నాయి. ఇప్పటికే నెల్లూరు-ముంబై హైవే వరదనీటిలో మునిగిపోగా.. తాజాగా నెల్లూరు-విజయవాడ రహదారి మార్గానికి ఏకంగా గండి పడింది. 


పెన్నా నదిపై ఉన్న బ్రిడ్జ్ దాటిన తర్వాత కోవూరు సమీపంలో నెల్లూరు-విజయవాడ హైవే కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. అటు నెల్లూరు-గూడూరు మధ్య కూడా వరదనీటికి రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. ఎక్కడివాహనాలు అక్కడే హైవేపై నిలిచిపోయాయి. ఇటు నెల్లూరు-విజయవాడ మార్గం కూడా ఇప్పుడు కొట్టుకుపోవడంతో వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరి నిలిచిపోయాయి. 


నెల్లూరు-కావలి-ఒంగోలు వైపు వెళ్లే 16వ నెంబర్ జాతీయ రహదారిపైకి శనివారం వరదనీరు వచ్చి చేరింది. రాత్రి ఒకటిన్నర గంటల సమయానికి నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో రోడ్డుకి గండి పడింది. అప్పటికే అప్రమత్తమైన పోలీసులు ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేశారు. దీంతో రోడ్డుకి ఇరువైపులా వాహనాలు బారులు తీరాయి. 


ప్రత్యామ్నాయం లేదు.. 
నెల్లూరు నుంచి విజయవాడ వెళ్లే వాహనాలకు ఇప్పుడు ప్రత్యామ్నాయం వెదికే పనిలో పడ్డారు అధికారులు. నెల్లూరు నగరంపైనుంచి కోవూరు చేరుకునే అవకాశం ఉంది. అయితే వాహనాలతో నెల్లూరు నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే అధికారులు ఏంచేయాలా అని తలలు పట్టుకున్నారు. మరోవైపు పామూరు, వింజమూరు నుంటి ట్రాఫిక్ మళ్లించాలనుకుంటున్నా.. నెల్లూరు-ముంబై హైవేపై వరదనీరు తిష్టవేసి ఉంది. నీటి మట్టం ఇంకా పూర్తి స్థాయిలో తగ్గలేదు. 


వర్షాలు తగ్గినా వదలని వరద.. 
వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాల వల్ల నెల్లూరు, చిత్తూరు, కడ పజిల్లాలకు తీవ్ర నష్టం జరిగింది. ఇప్పుడు వర్షాలు తగ్గినా వరద ప్రభావం మాత్రం ఆయా జిల్లాలను ఇంకా వదిలిపెట్టలేదు. వరదనీటిలో ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. 


రహదారికి మరమ్మతులు చేయాలన్నా కూడా ఇప్పుడల్లా సాధ్యమయ్యేట్టు కనిపించడంలేదు. గండిపడిన చోట వరద తీవ్ర ఉధృతంగా ఉంది. దీంతో మరమ్మతులకు అవకాశం లేదు. మరమ్మతులకు కనీసం మరో 48గంటలు సమయం పడుతుందని చెబుతున్నారు అధికారులు. అప్పటి వరకు హైవేపై ప్రయాణికులు అల్లాడిపోవాల్సిందే. 


ఇక సోమశిలనుంచి పెన్నా నదికి విడుదల చేసే నీటి పరిమాణం 3లక్షల క్యూసెక్కులకు తగ్గడంతో క్రమక్రమంగా పెన్నమ్మ శాంతిస్తోంది. అయితే ఇప్పటికే నీరు నిలబడిపోయిన లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు రహదారులు సైతం తెగిపోవడంతో వాహనాలు ఆగిపోయి పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.