ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కొడుకుని తానేనంటూ శివచరణ్ రెడ్డి అనే యువకుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ వర్గం మీడియా కూడా ఈ వ్యవహారాన్ని హైలెట్ చేసింది. అయితే కేవలం తనను రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. తన కొడుకుని అని చెప్పుకుంటున్న వ్యక్తికి తండ్రి వేరే ఉన్నాడని, అయినా తనను బ్లాక్ మెయిల్ చేయడానికి ఇలాంటి డ్రామాలాడుతున్నారని మండిపడ్డారాయన. తనకు ఇద్దరు భార్యలు, వారిద్దరికీ ఇద్దరు కుమార్తెలు మాత్రమే ఉన్నారని చెప్పారు. తన పెద్ద భార్య తులశమ్మ, ఆమె ద్వారా కలిగిన సంతానం రచనా రెడ్డి, రెండో భార్య పేరు శాంతమ్మ, ఆమె కుమార్తె సాయి ప్రేమితా రెడ్డి మాత్రమేనని చెప్పారు. తనకు ఇద్దరు కుమార్తెలేనని, మగ సంతానం లేరని చెప్పుకొచ్చారు.  


ఉదయగిరి ఎమ్మెల్యే మొదటి భార్య తులశమ్మ. ఆమె ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి శాంతి కుమారి అనే మహిళను వివాహం చేసుకున్నారు. ఆమెతోనే కలసి ఉంటున్నారు. ఆమెను తనతోపాటు రాజకీయ పర్యటనలకు కూడా తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకు కుమార్తెలు మాత్రమే ఉన్నారని, కుమారులు లేరు అంటూ చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. దీంతో శివచరణ్ రెడ్డి తెరపైకి వచ్చారు. నేనెవరు అంటూ ఆయన ఓ ప్రశ్న సంధిస్తూ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి  బహిరంగ లేఖ రాశారు.


చిన్నప్పటి నుంచి ఆయనతో కలసి ఉన్నా ఆయన కేవలం తన బాగోగులు మాత్రమే చూసుకున్నారని, తన చదువుకయ్యే ఖర్చు భరించారని, ఎప్పుడైనా దగ్గరకు వెళ్లినా దూరంగా పెట్టేవారని చెప్పుకొచ్చారు శివచరణ్ రెడ్డి. కుటుంబ గౌరవం కోసం తాము బయటకు రాలేదన్నారు. ఇటీవల శాంతి కుమారికి న్యాయం చేసినట్టే తమకు కూడా న్యాయం చేయాలంటూ శివచరణ్ రెడ్డి బయటకొచ్చారు. అయితే చంద్రశేఖర్ రెడ్డి మాత్రం శివచరణ్ రెడ్డికి తాను తండ్రి కాదన్నారు. శివచరణ్ రెడ్డి తల్లికి భర్త ఉన్నారని, ఆయనే శివచరణ్ రెడ్డికి తండ్రి అవుతారని చెప్పారు చంద్రశేఖర్ రెడ్డి. తనను బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నారని, రాజకీయంగా తనను ఎదుర్కోలేక ఇలాంటి చీప్ ట్రిక్స్ ఫాలో అవుతున్నారని మండిపడ్డారు. మొత్తమ్మీద ఈ వివరణతో చంద్రశేఖర్ రెడ్డి మరోసారి వార్తల్లోకెక్కారు.


నెల్లూరు జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యవహారం సంచలనంగా మారింది. శివచరణ్ రెడ్డి బయటకు రావడం, ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి తన తండ్రి అని చెప్పడంతో ఉదయం నుంచి ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా ఉంది. కొన్ని మీడియా ఛానెళ్లలో ఇదే టాపిక్ నడిచింది. అయితే సాయంత్రానికి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి తెరపైకి వచ్చారు. అవన్నీ కల్పిత కథనాలని కొట్టిపారేశారు. తనకి కొడుకులెవరూ లేరని, ఉన్నది ఇద్దరు కూతుళ్లు మాత్రమేనని చెప్పారు. పెద్ద భార్య ద్వారా ఒక కూతురు, రెండో భార్య ద్వారా మరో కూతురు మాత్రమే ఉన్నారని క్లారిటీ ఇచ్చారు.