లోన్ యాప్ ల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న నలుగురిని నెల్లూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. తీగ లాగితే డొంక అంతా కదిలింది ఈ లోన్ యాప్ మూలాలు హాంగ్ కాంగ్ లో బయటపడ్డాయి.


లీసా అనే మహిళ ఫిలిప్పీన్స్, హాంకాంగ్ నుంచి ఇన్ స్టా గ్రామ్ ద్వారా కొంతమందికి మెసేజ్ లు పంపుతూ ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ లో మంచి ఆఫర్లు ఉన్నాయంటూ ఊరిస్తుంది. ఆమె పంపించిన లింక్ లపై క్లిక్ చేస్తే.. మొబైల్ లోని సమాచారమంతా హ్యాక్ అవుతుంది. SMS లిసనింగ్ అనే యాప్ ద్వారా ఫోన్ లోని సమాచారాన్ని తస్కరిస్తుంది.


నెల్లూరు కేసు ఏంటంటే..?


నెల్లూరు నగరంలోని ఆదిత్య నగర్ కి చెందిన విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బాలాజీ నగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడు లోన్ యాప్ ద్వారా 30 వేల రూపాయలు అప్పు తీసుకున్నాడు. అయితే అతను ఆ డబ్బు చెల్లించినా సైబర్ మోసగాళ్లు అతడిని వదిలిపెట్టలేదు. విడతల వారీగా 40లక్షల వరకు కాజేశారని తెలుస్తోంది. పైగా అతని ఫోటోలు మార్ఫింగ్ చేసి బెదిరించారని ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. విచారణ చేపట్టారు.


తెలంగాణకు చెందిన ఓ యువకుడితోపాటు, కర్నాటకకు చెందిన వారిని కూడా అరెస్ట్ చేశారు. నలుగురిని మీడియా ముందు ప్రవేశ పెట్టారు. అదిలాబాద్ కి చెందిన యువరాజు అనే యువకుడిపై నెల్లూరు లోని బాలాజీ నగర్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశరు. కర్నాటకకు చెందిన అజయ్ పవన్ కళ్యాణ్ , రాథోడ్ సాయి కిరణ్, అబ్దుల్ లు మసూద్  ని సూత్రధారులుగా గుర్తించి అరెస్ట్ చేశారు. వీరిలో అబ్దుల్ మసూద్ అలహాబాద్ ఐఐటీలో మూడో సంవత్సరం బీటెక్ చేస్తుండటం విశేషం. నిందితుల పేరు మీద ఉన్న బ్యాంక్  అకౌంట్స్ ఫ్రీజ్ చేసి కోటి 20 లక్షల నగదు హోల్డ్ చెయ్యమని బ్యాంక్ లకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారం అంతటికీ సూత్రధారి హాంకాంగ్ కి చెందిన  లీసా అనే మహిళ అని గుర్తించారు.


ఇటీవల నెల్లూరు జిల్లాలో లోన్ యాప్ దుర్మార్గులు ఏకంగా మంత్రి కాకాణి, ఆ తర్వాత ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కి కూడా ఫోన్ చేసి వేధించారు. వారి ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగి, తమిళనాడుకు చెందిన రికవరీ ఏజెంట్లను అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు దానికంటే పెద్ద కేసు ఇది. ఈ కేసులో ఏకంగా బాధితుడు ఫొటోలు మార్ఫింగ్ చేస్తూ బెదిరించాలని చూశారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నెల్లూరు పోలీసులు అలర్ట్ అయ్యారు. నలుగురిని అరెస్ట్ చేశారు. విదేశాల్లో ఉన్నవారి విషయంలో విచారణకు ప్రయత్నిస్తున్నారు.


ఫోటోలు మార్ఫింగ్ చేయడం, అకౌంట్ లలో నగదు దొంగిలించడం వంటివాటితోపాటు, మన కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్నవారిని బెదిరించడం కూడా ఇటీవల బాగె పెరిగిపోయింది. తాజాగా నెల్లూరు ఘటనలో సైబర్ నేరగాళ్లు ఓపెన్ చేసిన 29 అకౌంట్ ల ద్వారా 34 కోట్ల రూపాయాలను సీజ్ చేశామని, వీరంతా వివిధ రకాల పేర్లతో  12 కంపెనీలను ఓపెన్ చేయడం ద్వారా పలువురిని మోసం చేశారని తెలిపారు జిల్లా ఎస్పీ విజయరావు.