Ashada Masam 2022: ఆషాఢ మాసంలో మహూర్తాలు ఉండవంటారు కానీ, ఆడవారు ఆషాఢంలో అమ్మవారి పూజను నిష్టగా చేస్తారు. వివిధ ఆలయాల్లో దుర్గాదేవిని శాకాంబరిగా అలంకరిస్తుంటారు. నెల్లూరులోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో మాత్రం విభిన్నమైన ప్రయత్నం చేశారు భక్తులు. ఆషాఢం మాసం స్పెషాలిటీని దృష్టిలో ఉంచుకుని ఆలయం మొత్తం గోరింటాకు రెమ్మలతో అలంకరించారు. అమ్మవారిని కూడా గోరింటాకుతో పూజించారు. 




వినూత్నంగా గోరింటాకులు.. 
ఆకు పూజ అంటే ఎక్కడైనా తమలపాకులు లేదా తులసి ఆకులతో చేస్తారు. ఆలయంలో తోరణాలు మామిడి ఆకులతో కడతారు. అసలు వినాయకుడి పూజలో కూడా గోరింటాకు అనే పత్రి ఎక్కడా కనపడదు. కానీ నెల్లూరులో మాత్రం అమ్మవారి ఆలయాన్ని గోరింటాకుతో నింపేశారు భక్తులు. ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని గోరింటాకుతో అందంగా ఇలా అలంకరించారు. 




ఒకటీ రెండు కాదు 250 కేజీల గోరింటాకు తీసుకొచ్చి అమ్మవారి ఆలయాన్ని అలంకరించారు. ఆలయం నిండా గోరింటాకు మండలతో తోరణాలు కట్టారు, విగ్రహాల పక్కన కూడా అవే అలంకరణ సామగ్రిగా ఉంచారు. పూజ కూడా గోరింటాకుతోనే, చివరకు భక్తులకు కూడా గోరింటాకు కోన్లను పంచి పెట్టారు.


ఆషాఢమాసం ఆడవారికి స్పెషల్, అందులోనూ గోరింటాకు పెట్టుకుంటే మంచిదంటారు. పెద్ద ముత్తయిదు వాసవీ మాతగా కొలుస్తున్న నెల్లూరు భక్తులు, అమ్మవారి ఆలయంలో గోరింటాకుతో సందడి చేశారు. అమ్మవారికి గోరింటాకుతో అలంకరించారు. బహుశా గోరింటాకుతో అలంకారం, పూజ ఇదే తొలిసారేమోనని చెబుతున్నారు భక్తులు. నెల్లూరులోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. 


నెల్లూరు నగరంలో నిర్వహించిన గోరింటాకు పూజకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పునర్నిర్మాణం తర్వాత భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు, ఉత్సవాలలో పాల్గొంటున్నారు. ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహించిన గోరింటాకు పూజ ప్రత్యేకంగా నిలిచింది. 250 కేజీల గోరింటాకుతో ఆలయం కనులవిందుగా ఉంది. 


గతంలో కూడా నెల్లూరులోని వాసవీ మాత ఆలయంలో భక్తులు ప్రత్యేక అలంకారాలకు ప్రాధాన్యత ఇస్తుంటారు. గతంలో కరెన్సీ నోట్లతో అమ్మవారి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణాన్ని అద్భుతంగా అలంకరించారు. ఈసారి గోరింటాకుతో అంతకంటే అందంగా అలంకరించారు. గోరింటాకు తో ఆషాఢ మాసంలో సకల శుభాలు కలుగుతాయని, అందుకే తాము ఈ ప్రయత్నం చేశామని చెబుతున్నారు  భక్తులు.  ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఆలయాన్ని ఇటీవల కాలంలో పునరుద్ధరించారు. పునరుద్ధరణ తర్వాత భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేటలోని ప్రధాన రోడ్డు పక్కనే ఈ ఆలయం ఉంది.