Nellore Joint Collector : అధికారులు తనిఖీల పేరుతో చేసే హడావిడి మామూలుగా ఉండదు. బుగ్గకారులో కాన్వాయ్ తో వచ్చి తనిఖీలు చేసి వెళ్తుంటారు. అలా తనిఖీలకు వస్తున్నారని ముందే అందరికీ తెలుసు, అయినా వాటిని ఆకస్మిక తనిఖీలనే పేరుతో పిలుస్తారు. చివరకు అక్కడ ఏమీ ఉండకపోవడంతో అంతా చల్లబడిపోతారు. కానీ నెల్లూరు జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్ అందుకు భిన్నం. ఆకస్మిక తనిఖీ అంటే ఏంటో ఆయన చేసి చూపించారు. ఇద్దరు అధికారులకు నోటీసులు జారీ చేయించారు. 


అసలేం జరిగింది? 


నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ అది. నిత్యం వ్యాపారులు, వినియోగదారులతో రద్దీగా ఉంటుంది. ఎక్కడికక్కడ మార్కెట్లో వివిధ కాయగూరల ధరలు డిస్ ప్లే లో ఉంచుతారు. అంతకు మించి ఎక్కువ రేటుకి అమ్మితే అధికారులకు ఫిర్యాదు చేయాలంటూ బోర్డ్ కూడా ఉంటుంది. అలాంటి మార్కెట్లో సాయంత్రం 6 గంటలకు రద్దీ సమయంలో ఓ వ్యక్తి వచ్చారు. ఫ్యాంట్, టీ షర్ట్, చేతిలో చిన్న సంచి, ముఖానికి మాస్క్. ఓ మధ్య తరగతి ఉద్యోగిలాకా మార్కెట్లోకి ప్రవేశించారు. అక్కడ కూరగాయలు కొనుక్కున్నారు. రేట్లలో మోసం స్వయంగా అర్థం చేసుకున్నారు. బోర్డుపై ఉన్న రేటుకి, వినియోగదారుడికి ఇస్తున్న రేట్లకి తేడా తెలుసుకున్నారు. అంతే వెంటనే అక్కడి అధికారులపై ఫైరయ్యారు జాయింట్ కలెక్టర్. దీంతో అప్పటికి కాని వారికి అర్థం కాలేదు, కామన్ మ్యాన్ గా వచ్చిన వ్యక్తి జిల్లా జాయింట్ కలెక్టర్ అని. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వ్యాపారస్తులతో పాటు మార్కెటింగ్ కమిటీ అధికారులకు కూడా మూడింది. 


ఆకస్మిక తనిఖీలు 


రోణంకి కూర్మనాథ్. పార్వతీపురం ఐటీడీఏ నుంచి బదిలీపై ఇటీవలే నెల్లూరు జిల్లాకు వచ్చారు. కొన్నిరోజులు సైలెంట్ గా ఉన్నా.. తాజాగా తన తఢాకా చూపించారు. వినియోగదారుడిలాగా మార్కెట్లోకి వెళ్లడం, కూరగాయలు కొనడం, రేట్లు తనిఖీ చేయడం ఇలా తన పద్ధతి ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పారు. ఆకస్మిక తనిఖీలయినా కూడా అధికారులు హడావిడి చేస్తూ వస్తారు, తూతూ మంత్రంగా తనిఖీలు చేసి వెళ్తారు, పై అధికారుల మెప్పుకోసం, నాయకుల మెప్పుకోసం అంతా బాగుందని చెప్తారు. కానీ కూర్మనాథ్ అలా కాదు. ఆకస్మిత తనిఖీకి అసలు నిర్వచనం చెప్పారు. 


నోటీసులు జారీ


కూరగాయల మార్కెట్లో వినియోగదారుడిలాగా ఆకస్మిక తనిఖీలు చేసిన జాయింట్ కలెక్టర్ వెంటనే ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. సక్రమంగా విధులు నిర్వర్తించలేదన్న కారణంతో ఏసీ సుబ్బారెడ్డి మార్కెట్ కార్యదర్శికి షోకాజు నోటీసు జారీ చేశారు. మార్కెట్ సూపర్వైజర్ రియాజ్ కు మెమో జారీ చేశారు.