నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఓ వ్యక్తి సూసైడ్ చేసుకుంటున్నానంటూ ఓ వీడియోని బంధువులకు పంపించి ఫోన్ స్విచాఫ్ చేసుకున్నాడు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా సర్క్యూలేట్ అయింది. దీంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. అసలా వ్యక్తి ఎక్కడున్నాడో కనిపెట్టేందుకు దాదాపు 5 గంటలపాటు శ్రమించారు. చివరకు అతను ప్రాణాపాయ స్థితిలో ఉండగా గుర్తించి ఆస్పత్రికి తరలించారు.


అప్పుడు భార్యచావుకి కారణం అతడే.. 
గతేడాది సెప్టెంబర్ 21న నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఓ మహిళ ఆత్మహత్య ఘటన తీవ్ర సంచలనంగా మారింది. భర్త కళ్లెదుటే భార్య ఉరేసుకుని చనిపోయింది. భార్య తనను బెదిరించడానికి అలా చేస్తుంది అనుకుని భర్త కనీసం కాపాడే ప్రయత్నం కూడా చేయలేదు. చివరకు ఆమె చనిపోయిన తర్వాత తప్పు తెలుసుకుని ఆ వీడియోని బంధువులకు పంపించాడు. చివరకు పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. 


అప్పట్లో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆత్మకూరు సందర్శించి తల్లిని కోల్పోయిన పిల్లల బాధ్యత స్వీకరిస్తామని చెప్పారు. భార్య ఆత్మహత్య చేసుకుంటున్నా ఆపడానికి ప్రయత్నం చేయని భర్తకు కఠిన శిక్ష పడేలా చేస్తామని చెప్పారు. ఆ తర్వాత భర్త జైలుకెళ్లాడు. బెయిల్ పై విడుదలైన తర్వాత తన భార్య మరణానికి తాను కారణం కాదని, మరికొందరు వ్యక్తులు ఆమె మరణానికి కారణం అంటూ చెబుతుండేవాడు. ఈ క్రమంలోభర్త పెంచలయ్య ఆత్మహత్యాయత్నం చేశాడు. భార్య సమాధి వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. పురుగుల మందు తాగే ముందు ఓ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి అందరికీ పంపించాడు. 


సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో బాగా సర్కులేట్ అయింది. దీంతో పోలీసులు అతడికోసం తీవ్రంగా గాలించారు. సెల్ఫీ వీడియో ఎవరికి పంపాడు, ఎవరు దాన్ని సర్కులేట్ చేశారు అనే విషయంపై ఆరా తీశారు. అతడు మరణించేలోపు పట్టుకోగలమా లేదా అని టెన్షన్ పడ్డారు. చివరకు పోలీసులు అతడ్ని ప్రాణాలతో పట్టుకున్నారు. 


తన భార్య ఆత్మహత్యకు కారణం అంటూ కొంతమంది పేర్లు చెప్పి మరీ పెంచలయ్య ఆత్మహత్యా యత్నం చేశాడు. ప్రస్తుతం అతని పరిస్థితి సీరియస్ గా ఉందని తెలుస్తోంది. పోలీసుల అతడిని ఆత్మకూరు ఆస్పత్రిలో చికిత్సకోసం తరలించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకి తరలించారు. సూసైడ్ వీడియోలో పెంచలయ్య కొంతమంది పేర్లు చెప్పడంతో వారంతా హడలిపోతున్నారు. తమకేపాపం తెలియదని, తమ పేర్లు అనవసరంగా చెప్పాడని, అతని భార్య మరణానికి తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. పోలీసులు సెల్ఫీ వీడియో ఘటనపై విచారణ జరుపుతున్నారు.