ఏపీలో లిక్కర్ రేట్లు భారీగా పెరిగిపోవడంతో నాటుసారాకి ఇటీవల డిమాండ్ వచ్చింది. గతంలో నాటు సారా తయారీ కేంద్రాలను పోలీసులు ధ్వంసం చేసినా.. మళ్లీ కొత్తగా అవి పుట్టుకొస్తున్నాయి. ఎంత గుట్టు చప్పుడు కాకుండా సారా తయారు చేసినా పోలీసుల నుంచి తప్పించుకోలేరని హెచ్చరిస్తున్నారు నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు. స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో (SEB) సాయంతో నెల్లూరు జిల్లాను నాటుసారారహిత జిల్లాగా మారుస్తామంటున్నారాయన. నెల్లూరు నగరంలో సెబ్ అధికారులతో సమావేశం నిర్వహించిన ఎస్పీ 14500 అనే SEB టోల్ ఫ్రీ నంబర్ పోస్టర్ ను ఆవిష్కరించారు. 




స్థానికంగా ఎక్కడా ఎటువంటి అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నా ఎప్పుడైనా 14500 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు జిల్లా ఎస్పీ విజయరావు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. మత్తుపదార్ధాలను విడనాడి, విలువైన జీవితాన్ని కాపాడుకోండి అనే సందేశంతో జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సెబ్ అధికారులు, పోలీస్ అధికారులకు సూచించారు ఎస్పీ. జిల్లాలోని 11 సెబ్ పోలీస్ స్టేషన్లలో కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మండల కేంద్రాల్లో విస్తృతంగా ఈ కార్యక్రమం చేపట్టాలన్నారు. టోల్ ఫ్రీ నెంబర్ ని గుర్తుంచుకునేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు ఎస్పీ. 


అక్రమంగా నాటు సారా తయారు చేసినా, విక్రయించినా క్రిమినల్ కేసులు, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఎస్పీ. ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించబోమని, పదే పదే ఇలాంటి నేరాలకు పాల్పడితే PD యాక్ట్ నమోదు చేస్తామన్నారు. ప్రజలు, అధికారులు కలసికట్టుగా పనిచేసి, నెల్లూరు జిల్లాను సారా రహిత జిల్లాగా మారుస్తామంటున్నారు. నాటుసారాపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు ఆదేశాలిచ్చారాయన. ఎర్రచందనం, గంజాయి, గుట్కా అక్రమ రవాణాపై నిఘా పెంచాలని చెప్పారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లాలో SEB అధికారులు ఛేదించిన పలు కేసులను ప్రస్తావించి ఆ సిబ్బందిని ప్రశంసించారు. 


నెల్లూరు జిల్లాకు సీఎం జగన్ వస్తున్న సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను కూడా ఎస్పీ విజయరావు పర్యవేక్షించారు. ఈనెల 6న నెల్లూరు జిల్లాకు సీఎం జగన్ వస్తున్నారు. నెల్లూరు బ్యారేజ్, సంగం బ్యారేజ్ ప్రారంభోత్సవాలకు ఆయన వస్తారు. ఈ క్రమమంలో హెలిపాడ్స్, పార్కింగ్, మీటింగ్ ప్రాంతాలను పరిశీలించారు. సంగం, పెన్నా బ్యారేజీలను పరిశీలించారు. సంగం వద్ద తాత్కాలిక హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తారు. ముందు సంగం బ్యారేజ్, ఆ తర్వాత నెల్లూరు పెన్నా బ్యారేజ్ ప్రారంభోత్సవాలు ఉంటాయి. పెన్నా బ్యారేజి పరిధిలో కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద తాత్కాలిక హెలిపాడ్ ఏర్పాటు చేస్తున్నారు. సీఎం పర్యటనకోసం ఎమ్మెల్సీ తలశిల రఘురాం నెల్లూరు జిల్లాకు వచ్చారు. ఎస్పీ విజయరావుతో కలసి ఆయన కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. 




పెన్నా బ్యారేజీ ఓపెనింగ్ సమయంలో.. హైవేకి ఈవైపు బ్యారేజ్, ఆవైపు హెలిప్యాడ్ ఉంటాయి. దీంతో కొంచెం సేపు హైవేపై రాకపోకలకు అంతరాయం కలిగే అకాశముంది. ఈ విషయంలో ప్రజలు సహకరించాలని కోరారు పోలీస్ అధికారులు.