కాదేదీ విగ్రహం తయారీకి అనర్హం అంటున్నారు నెల్లూరు జిల్లా వాసులు. రకరకాల వస్తువులు, పదార్థాలతో విగ్రహాలను తయారు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. పర్యావరణ హిత వినాయక ప్రతిమలతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రకరకాల విగ్రహాలు కొలువై ఉన్నా.. అందులో ఈ వెరైటీ ప్రతిమలు మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
గాజుల వినాయక
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని బాపూజీ వీధిలో 62 వేల గాజులతో విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ వినాయకుని ఐదు రోజులు పూజలు చేసి ఆదివారం గాజులు తీసి పంచి పెడతామని చెప్పారు నిర్వాహకులు. నగరంలోని సాయి వినాయక రెడీమేడ్స్ కి చెందిన పాదర్తి అమర్నాథ్ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.
ఉలెన్ బాల్స్ వినాయక
నెల్లూరు సమీపంలోని ఇనమడుగు గ్రామంలో ఉలెన్ బాల్స్ తో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేశారు. దాదాపు 20వేల ఉలెన్ బాల్స్ తో ఈ విగ్రహాన్ని అందంగా ముస్తాబు చేశారు. స్థానిక ఠాగూర్ టీమ్ తొమ్మిదేళ్లుగా ఇక్కడ వివిధ రకాలుగా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాది ఉలెన్ బాల్స్ తో కష్టపడి వినాయక రూపాన్ని తయారు చేశామని చెబుతున్నారు నిర్వాహకులు. రంగు రంగుల ఉలెన్ బాల్స్ వినాయకుడు అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. ఉలెన్ బాల్స్ వినాయకుడని ఇంతకు ముందు ఎక్కడా ఏర్పాటు చేయలేదని, ఇక్కడే తొలిసారి ఏర్పాటు చేశామని చెప్పారు.
అట్టముక్కల వినాయకుడు
నెల్లూరుకు చెందిన నరసింహన్ అనే కళాకారుడు.. అట్ట ముక్కలతో వినాయకుడి ప్రతిమను తయారు చేశాడు. దాదాపు 30 కిలోల అట్ట ముక్కలతో ఈ విగ్రహాన్ని తయారు చేశారు నరసింహన్. పూర్తి పర్యావరణ హితంగా ఈ విగ్రహాన్ని తయారు చేశానన్నారాయన. ఈ విగ్రహాన్ని నీటిలో కలిపినా ఎలాంటి నష్టం లేదంటున్నారాయన.
అందరూ పర్యావరణ హిత పదార్థాలతో విగ్రహాలను తయారు చేయాలని సూచిస్తున్నారు. నరసింహన్ ఇప్పటికే పర్యావరణ హిత విగ్రహాల తయారీలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు. అట్ట ముక్కలను సేకరించి ఎంతో జాగ్రత్తగా ఈ విగ్రహాన్ని రూపొందించారు నరసింహన్.
విగ్రహాలే కాదు అలంకరణ కూడా
వింతైన విగ్రహాలే కాదు, వాటి అలంకరణ కూడా వెరైటీగా చేస్తున్నారు నెల్లూరీయులు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పాటూరు గ్రామంలో వినాయక మండపంలో 6 లక్షల రూపాయల విలువ చేసే కొత్త కరెన్సీ నోట్లతో అలంకరణ చేపట్టారు. ఈ అలంకరణ చూసేందుకు జిల్లా వాసులు భారీగా తరలి వస్తున్నారు. కరెన్సీ నోట్లతో చేసిన కాస్ట్ లీ అలంకరణ అందరినీ ఆకట్టుకుంటోంది. కొత్త నోట్లన్నీ కలర్ ఫుల్ గా ఉండటంతో తాము ఇలా అలంకరణ చేశామని చెబుతున్నారు. ప్రతి ఏడాదీ వినూత్నంగా ఇక్కడ అలంకరణ ఉంటుందని, ఈ ఏడాది కరెన్సీ నోట్లతో మండపాన్ని అలంకరించామని అంటున్నారు.
రెండేళ్ల కొవిడ్ విరామం తర్వాత ఈ ఏడాది నెల్లూరు జిల్లాలో వినాయక మండపాల వద్ద సందడి బాగా పెరిగింది. అందులోనూ వెరైటీ వినాయకులను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.
Also Read : Nellore News : మంత్రిపై గెలిచిన సామాన్యురాలు, న్యాయ పోరాటంతో మళ్లీ ఉద్యోగం!
Also Read : APSRTC Charges : ప్రయాణికులకు గుడ్ న్యూస్, ఛార్జీలు తగ్గించిన ఏపీఎస్ఆర్టీసీ