APSRTC Charges : ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఏసీ బస్సుల్లో ఛార్జీలు తగ్గించినట్లు ప్రకటించింది. అయితే తగ్గింపు ఈ నెల 30 వరకే అమల్లో ఉంటుందని తెలిపింది. ఏసీ బస్సు ఛార్జీలో 20 శాతం వరకు తగ్గిస్తూ ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏ రూట్లలో ఎంత వరకూ బస్సు ఛార్జీ తగ్గించాలనే నిర్ణయం ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌లకు అప్పగించినట్లు వెల్లడించింది. ఏసీ బస్సుల ఛార్జీల తగ్గింపుపై జిల్లాల వారీగా ఆర్టీసీ అధికారులు ప్రకటనలు విడుదల చేస్తున్నారు. విజయవాడ-హైదరాబాద్‌ మార్గంలో తిరిగే అమరావతి, గరుడ, వెన్నెల ఏసీ బస్సుల్లో టికెట్‌ ధరలో 10 శాతం మేర తగ్గించినట్టు అధికారులు తెలిపారు. విజయవాడ-విశాఖ డాల్ఫిన్‌ క్రూజ్‌ , విజయవాడ-చెన్నై, విజయవాడ-బెంగళూరు వెళ్లే ఏసీ బస్సుల్లో 20 శాతం ఛార్జీలు తగ్గించినట్లు ప్రకటించారు. శుక్రవారం, ఆదివారం తప్ప మిగతా రోజుల్లో  ఛార్జీల తగ్గింపు అమల్లో ఉంటుందని ఏపీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. 


ప్రగతి పథంలో ఆర్టీసీ 


ఏపీఎస్ఆర్టీసీ 2022-23 ఏడాదిలో  ప్రగతి పథంలో ముందుకు వెళ్తుందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అన్నారు. ఏప్రిల్-ఆగస్టు వరకు బస్సుల్లో 76 శాతం ఓఆర్ సాధించినట్టు వెల్లడించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో కార్గో డోర్ డెలివరీ ప్రారంభించామని, దీని ద్వారా సగటున రోజుకు 5802 పార్సిళ్లు బుక్ అవుతున్నాయని తెలిపారు. పార్సిళ్ల బుకింగ్ ఇప్పటి వరకూ 972 ఉండగా ఇప్పుడు 5 వందల శాతం పెరిగిందన్నారు. గత ఏడాది ఆర్టీసీ కార్గోలో రూ.122 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఆర్టీసీలో 998 కొత్త అద్దె బస్సుల కోసం టెండర్లు ఆహ్వానించామన్నారు.  


నగదు రహిత సేవలు 


ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత, పేపర్‌ రహిత సేవలకు శ్రీకారం చుట్టనుంది.  యూనిఫైడ్‌ టికెటింగ్‌ సొల్యూషన్‌ (యూటీఎస్‌) విధానాన్ని త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది.  దీనికి సంబంధించిన బ్రోచర్‌ను ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు గురువారం విడుదల చేశారు. ఈ విధానం అమలులోకి వస్తే ప్రయాణికులు మరింత సౌలభ్యంగా ఉంటుందని అధికారులు తెలిపారు.  ఏపీఎస్‌ఆర్టీసీ సేవలన్నింటినీ ఒకే యాప్‌ కిందకు తెచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ యాప్‌తో అన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ యాప్‌ అందుబాటులోకి వస్తే బస్‌ టికెట్‌ బుకింగ్‌తో పాటు బస్సుల రాకపోకలు, కార్గో సేవలు తెలుసుకునే వీలుంటుందన్నారు. ఇప్పటి వరకు బస్సుల్లో నగదు ద్వారా టికెట్లు ఇస్తుండగా ఇకపై డెబిట్‌ కార్డు, క్రెడిట్‌ కార్టు, యూపీఐ పేమెంట్స్ ద్వారా చెల్లింపులు జరపవచ్చని అధికారులు తెలిపారు.   క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌తో కూడా టికెట్లు పొందే వీలుంటుందన్నారు. రానున్న రోజుల్లో పేపర్‌ రహిత టికెట్‌ విధానం అమల్లోకి తెస్తామన్నారు. బస్సులో ప్రయాణిస్తూనే మరో స్టేజి నుంచి వేరే బస్సులో వెళ్లేందుకు టికెట్‌ బుక్ చేసుకునే వీలు ఉంటుందన్నారు. 


Also Read : AP DGP Comments : కుప్పం ఘటనలు శాంతిభద్రతల సమస్య కాదన్న ఏపీ డీజీపీ - గోరంట్ల వీడియోపై ఎం చెప్పారంటే ?


Also Read : రాజకీయాల్లో ఆ "పవర్" ఏది ? పవన్ కల్యాణ్ పొలిటికల్ సూపర్ స్టార్ ఎప్పుడవుతారు?