నెల్లూరు రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. నెల్లూరు జిల్లాలో వైసీపీ బహిష్కృత ముగ్గురు ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు ఉప్పునిప్పుగా ఉన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ టీడీపీ ఇన్ చార్జ్ అబ్దుల్ అజీజ్ ఇప్పుడు ఒక్కటయ్యారు. అబ్దుల్ అజీజ్ ని కోటంరెడ్డి పరామర్శించడంతో ఇద్దరి మధ్య సయోధ్య కుదిరినట్టేనని తెలుస్తోంది. 


ఈ వైరం ఇప్పటిది కాదు..
అబ్దుల్ అజీజ్ రాజకీం వైసీపీనుంచే మొదలైంది. గతంలో ఆయన వైసీపీ తరపున నెల్లూరు నగర మేయర్ గా ఎంపికయ్యారు. ఆయన విజయంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ పాత్ర చాలా ఎక్కువ. అయితే గెలిచీ గెలవగానే అజీజ్ ప్లేటు ఫిరాయించారు. టీడీపీలోకి వెళ్లిపోయారు. అప్పటినుంచి ఎమ్మెల్యేలు అనిల్, కోటంరెడ్డి.. అజీజ్ తో విభేదించారు. పార్టీ మారిన నాయకుడంటూ చాలాసార్లు దెప్పిపొడిచారు. కాలక్రమంలో ఇప్పుడు కోటంరెడ్డి కూడా వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చారు. అయితే టీడీపీ రూరల్ టికెట్ విషయంలో వీరిద్దరి మధ్య పోటీ ఉంది. కోటంరెడ్డిని టీడీపీలో చేర్చుకోవద్దంటూ అజీజ్ వర్గం గొడవ చేస్తోంది కూడా. కానీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి నెల్లూరు రూరల్ టీడీపీ టికెట్ ఖాయమంటూ ఇటీవల సంకేతాలు వెలువడ్డాయి. దీంతో అజీజ్ అనివార్యంగా పోటీనుంచి తప్పుకోవాల్సి వస్తోంది. ఈ దశలో వీరిద్దరూ చేతులు కలపడం టీడీపీ వర్గాల్లో సంతోషం నింపింది. 


అనారోగ్య కారణంగా నెల్లూరు నగరంలోని హరనాధపురం నివాసంలో  విశ్రాంతి తీసుకుంటున్న నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీఇన్ చార్జి అబ్దుల్ అజీజ్ ను  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని తిరిగి ప్రజా క్షేత్రం లోకి రావాలని ఆకాంక్షించారు. అబ్దుల్ అజీజ్ టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడిగా, రూరల్ టీడీపీ ఇన్ చార్జ్ గా ఉండడం, వైసీపీ ఎమ్మెల్యేగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉండటంతో వీరి మధ్య కొంతకాలం మాటలు కూడా కరువైన పరిస్థితి. అయితే ఇటీవల రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికార వైసీపీకి దూరంగా జరిగి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్న నేపథ్యంలో ఇద్దరి కలయిక అనివార్యమైంది. 


టీడీపీ బలోపేతం.. 
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గట్టిపోటీ ఎదురైనా, శ్రీధర్ రెడ్డి చివరకు విజేతగా నిలిచారు. ఆ తర్వాత ఆయన టీడీపీకి దగ్గరవడంతో వైసీపీ క్రమంగా బలహీనపడింది. రూరల్ నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లలో మెజార్టీ వర్గం కోటంరెడ్డికి సన్నిహితంగా ఉంటోంది. కొంతమంది ఎంపీ ఆదాల వైపు వెళ్లినా ఎన్నికలనాటికి కోటంరెడ్డి దగ్గరకు వచ్చేస్తారని తెలుస్తోంది. ఈ దశలో 2024 ఎన్నికలనాటికి నెల్లూరు రూరల్ లో టీడీపీ మరింత బలోపేతమవుతుందని అర్థమవుతోంది. శత్రువులుగా ఉన్న కోటంరెడ్డి, అబ్దుల్ అజీజ్ కూడా ఒక్కటవడంతో నెల్లూరు రూరల్ లో టీడీపీ విజయం ఖాయమని అంటున్నారు. నెల్లూరు రూరల్ టికెట్ కోటంరెడ్డికి ఇస్తే, అసంతృప్త అజీజ్ ని అధిష్టానం ఎలా బుజ్జగిస్తుందో చూడాలి.