Southwest Monsoon enters Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల వారికి చల్లని కబురు వచ్చింది. ఇటీవల కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించాయని వాతావరణ కేంద్రం తెలిపింది. భానుడి భగభగలకు అల్లాడిపోతున్న ఏపీ వాసులకు ఊరట లభించనుంది. అసలే విశాఖపట్నంలో శనివారం గత 100 ఏళ్లలోనే అధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఈ క్రమంలో ఆదివారం నాడు తిరుపతి జిల్లా శ్రీహరి కోట సమీప ప్రాంతాలలో నైరుతి రుతుపవనాలు విస్తరించాయని వాతావరణ కేంద్రం తెలిపింది.


తమిళనాడులోని ధర్మపురి, రత్నగిరి, కర్ణాటకలోని శివమొగ్గ, హాసన్‌ ప్రాంతాలతో పాటు ఏపీలో తిరుపతి జిల్లాలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. రాగల 24 గంటల్లో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తో పాటు మహారాష్ట్రలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. నైరుతి రుతుపవనాల రాకతో రాయలసీమతో పాటు సరిహద్దుగా ఉన్న తమిళనాడు ప్రాంతాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.






రుతుపవనాలు విస్తరించే వరకు ఉక్కపోతే! 
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు పూర్తిగా వ్యాపించేంత వరకు అధిక ఉష్ణోగ్రతలు తప్పవని ఏపీ వెదర్ మ్యాన్ అన్నారు. జూన్ 17వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలలో హీట్ వేవ్ ఇలాగే ఉంటుందని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలైన ఉమ్మ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఉక్కపోత అధికంగా ఉండనుంది. కోస్తా ఆంధ్రలో మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు సులభంగా 43-44 C తాకవచ్చు అని కొన్ని ప్రాంతాలలో 45 డిగ్రీల  వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని.. ప్రజలు మధ్యాహ్నం వేళ అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించారు.


'బిపర్ జాయ్' తుపాను అరేబియా సముద్రంలో తీవ్రరూపం దాల్చుతోంది. రానున్న 24 గంటల్లో తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని ఎన్డీఆర్ఎస్ సిబ్బందిని, అధికారులను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా గుజరాత్​లోని సౌరాష్ట్ర, కచ్ తీర ప్రాంతాలకు వాతావరణం కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. బిపర్ జాయ్ తుపాను పోర్ బందర్ తీరానికి దగ్గరగా 460 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో సౌరాష్ట్ర, కచ్​ ప్రాంతాల్లో మరో నాలుగైదు రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది. మహారాష్ట్ర, గోవా, గుజరాత్ తీర ప్రాంతాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.