వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. బారాషాహీద్ దర్గా అభివృద్ధికి రూ. 15 కోట్ల నిధులు ప్రభుత్వం విడుదల చేసిందని, దానికోసం జగన్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు కోటంరెడ్డి. మూడేళ్ల క్రితమే 15 కోట్ల రూపాయలకు సంబంధించి జీవో విడుదలదైనా, ఇప్పటి వరకు దానికి సంబంధించిన నిధులు విడుదల కాలేదని, తాను చేసిన పోరాటం వల్ల ఇప్పటికైనా నిధులు విడుదలయ్యాయని చెప్పారు. ఇది ఏ ఒక్కరి విజయమో కాదని, ముస్లిం సమాజం మొత్తం పార్టీలకతీతంగా కదలి వచ్చి సాధించుకున్న విజయం అని అన్నారు. 


నెల్లూరు నగరంలో రొట్టెల పండగ జరిగే బారాషహీద్ దర్గా ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలనే ప్రణాళిక ఎప్పటి నుంచో ఉంది. ఆ దర్గా ప్రాంతం నెల్లూరు రూరల్ పరిధిలోకి వస్తుంది. అక్కడ గతంలో నారాయణ మంత్రిగా ఉండగా రొట్టెల పండగ కోసం సుందరీకరణ పనులు చేశారు. ఆ పనులు నాసిరకంగా ఉన్నాయని గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి ఆరోపణలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు మొదలు పెడతామన్నారు. అప్పట్లో ఆయన నిధుల కోసం బాగానే కష్టపడ్డారు. ఆ తర్వాత దర్గా అభివృద్ధికి, మసీదు నిర్మాణానికి కలిపి ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్టుగా జీవో ఇచ్చారు. అప్పటికి కోటంరెడ్డి వైసీపీలోనే ఉన్నారు. కానీ అక్కడే చిన్న మతలబు ఉంది. జీవో వచ్చింది కానీ, నిధులు విడుదల కాలేదు. ఆర్థిక అనుమతి లేదన్నారు, ఆ తర్వాత అనుమతి తీసుకుని, మసీద్ నిర్మాణానికి 4 సార్లు టెండర్లు పిలిస్తే ఒక్క కాంట్రాక్టర్ కూడా టెండర్ వేయలేదు. దీంతో కోటంరెడ్డి ఈ విషయంపై పదే పదే ఉన్నతాధికారుల్ని ప్రశ్నించారు. ఓ దశలో ఆయన జిల్లా మీటింగ్ లో కూడా అధికారుల తీరుని ఎండగట్టారు. ఆ తర్వాత క్రమక్రమంగా ఆయన పార్టీకి దూరమయ్యారు. 


పార్టీకి దూరమైనా నెల్లూరు రూరల్ సమస్యలపై తన పోరాటం ఆగదని గుర్తు చేస్తూ ఆయన పోరాట పంథా ఎంచుకున్నారు. ఇటీవల పొట్టేపాలెం కలుజుకోసం జలదీక్ష చేపడతానంటే పోలీసులు అడ్డుకున్నారు. బారాషహీద్ దర్గా అభివృద్ధి నిధులకోసం మరోసారి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆయన పోస్ట్ కార్డ్ ఉద్యమం మొదలు పెట్టారు. వారం రోజుల నుంచి మసీదులు, ఈద్గాల నుంచి లక్ష లాది మంది ముస్లిం పెద్దల ద్వారా వాట్స్ యాప్, టెక్స్ట్ మెసేజ్ ద్వారా వినతులు ఇచ్చే ప్రయత్నం చేశారు. లెటర్లు కూడా రాయించారు. చివరకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో కోటంరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. 


బారాషాహీద్ అభివృద్ధి కి  రూ. 7.5 కోట్లు, మసీద్ నిర్మాణానికి రూ. 7.5 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. జిల్లా ముస్లిం సోదరుల పక్షాన ముఖ్యమంత్రి జగన్ కి , ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నానన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. అదే సమయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని గురుకుల పాఠశాల, ములుముడి రోడ్డు, పొట్టేపాలెం కలుజు బ్రిడ్జి, షాదీ మంజిల్, స్టడి సర్కిల్స్, కాపు భవన్,  ఆమంచర్ల పారిశ్రామికవాడ, జగనన్న కాలనీల్లో వసతులు వంటి సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. కొమ్మరపూడి సాగునీటి పనులు, ఇళ్ల స్థలాల నగదు, గణేష్ ఘాట్, గోమతినగర్ బ్రిడ్జి వంటి సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. 


ఎన్నికల సమయంలో తప్ప మిగిలిన సమయాల్లో రాజకీయం వద్దు, అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. తాను కొత్తగా ప్రజా సమస్యలపై మాట్లాడడం లేదని నాలుగేళ్లుగా మాట్లాడుతున్నానన్నారు. సీఎం జగన్ రెండేళ్ల కిందటే దర్గా అభివృద్ధి నిధుల విడుదల కోసం సంతకాలు చేస్తే ఇప్పటికి అవి రావడం సంతోషకరం అన్నారు. నెల్లూరు సమస్యలపై మరో పోరాటం చేస్తానన్నారు.