రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మళ్లీ ప్రెస్ మీట్ పెట్టారు. ఈసారి ఆయన మాజీ మంత్రి అనిల్ ని టార్గెట్ చేశారు. తమ్ముడు అనిల్, గతం మరచిపోవద్దు అంటూ చురకలంటించారు. కోటంరెడ్డిపై అనిల్ నిన్న ప్రెస్ మీట్లో కాస్త ఘాటుగా మాట్లాడారు. తామిద్దరం జగన్ కి రుణపడి ఉండాలని, అలాంటిది కోటంరెడ్డి, జగన్ ని వ్యతిరేకించి బయటకు వెళ్తున్నారని, అది సరికాదని చెప్పారు. దీనికి కోటంరెడ్డి కౌంటర్ ఇచ్చారు. అనిల్ గతంలో ఎవరెవరికి ఎన్నిసార్లు నమ్మక ద్రోహం చేశారో వివరించారు.
ఆనం వివేకాకు ద్రోహం చేయలేదా..?
2009 ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ కి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందని, ఆనం వివేకానే ఆయనకు టికెట్ ఇప్పించారని, ఆ ఎన్నికల్లో ఓడిపోయిన అనిల్, ఆ తర్వాత వివేకాకే ఎదురు తిరిగారని, ఆయన ఇంటిపైకి వెళ్లారని, ఆయన ఇంటిని ధ్వంసం చేస్తామని హెచ్చరించారని గుర్తు చేశారు. టికెట్ ఇచ్చిన ఆనం వివేకాపైకి వెళ్లడం ఆనాడు అనిల్ చేసిన నమ్మక ద్రోహం కాదా అని ప్రశ్నించారు.
అనిల్ నిన్ను భుజాలపై మోశా..
అనిల్ కుమార్ యాదవ్ జిందాబాద్ అంటూ తాను నినాదాలు చేసిన సందర్భాలున్నాయని, కానీ అనిల్ తనపై అసందర్భంగా మాట్లాడారని మండిపడ్డారు శ్రీధర్ రెడ్డి. అనిల్ కి మంత్రి పదవి వచ్చిన తర్వాత ఆయనకు స్వాగతం పలికింది, నగరంలో ర్యాలీలు చేసింది తానేనని చెప్పారు. అనిల్ ని తన భుజాల మీద మోశానని గుర్తు చేశారు. అలాంటి తమ్ముడు తనపై నిందలు వేయడం సరికాదన్నారు.
నా బిడ్డలు ఏం చేశారు..?
తాను తప్పు చేస్తే దాని ఫలితం తానే అనుభవిస్తానని, తన బిడ్డలు ఎందుకు అనుభవిస్తారని అన్నారు. బిడ్డలకు ఆ పాపం తగులుతుందంటూ అనిల్ చేసిన కామెంట్లను ఖండించారు శ్రీధర్ రెడ్డి. నా బిడ్డలు ఏం తప్పు చేశారు తమ్ముడు అనిల్ అంటూ ప్రశ్నించారు శ్రీధర్ రెడ్డి.
శ్రీధర్ రెడ్డి ప్రెస్ మీట్ మొదలు పెట్టడంతోనే అనిల్ కి కౌంటర్లు ఇచ్చారు. తమ్ముడు అనిల్ అంటూనే సుతి మెత్తగా ఆయనపై విమర్శలు చేశారు. కష్టకాలంలో ఆయనకు అండగా తాను నిలబడ్డానని, అప్పట్లో ఆయనకు అండగా ఇద్దరు కార్పొరేటర్లు మాత్రమే ఉన్నారని, వారిని కూడా ఆయన దూరం చేసుకున్నారని అన్నారు. శ్రీధర్ రెడ్డి వరుస ప్రెస్ మీట్లతో ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. అప్పటి వరకు తనకు సన్నిహితులుగా ఉండి, తనపై విమర్శలు చేస్తున్న వారికి కూడా కోటంరెడ్డి కౌంటర్లు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే అనిల్ ని టార్గెట్ చేశారు కోటంరెడ్డి.
నెల్లూరు రూరల్ కి కోటంరెడ్డి, సిటీకి అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యేలుగా వరుసగా రెండు దఫాలుగా గెలుస్తూ వచ్చారు. అయితే రెండోసారి గెలిచినప్పుడు వైసీపీ అదికారంలోకి రావడంతో అనిల్ కి అనుకోకుండా మంత్రి పదవి వరించింది. అదే సమయంలో కోటంరెడ్డికి మాత్రం మంత్రి పదవి వరించలేదు. ఆ తర్వాత అనిల్ కి మంత్రి పదవి పోయింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య కాస్త గ్యాప్ పెరిగింది. ఇప్పుడు విమర్శలు, ప్రతి విమర్శలతో ఆ గ్యాప్ మరింత పెరిగి పెద్దదైంది.