ఆరు నెలలు ఆగండి, మంచి రోజులు వస్తాయి- నెల్లూరు ప్రజలతో కోటంరెడ్డి

ఆనాడు తాను పార్టీ మారి ఉంటే మంత్రిని అయిఉండేవాడిని అని, ఈనాడు పార్టీ నుంచి బయటకు రావడం వల్ల  మరోసారి కష్టాలు అనుభవిస్తున్నానని చెప్పారు. రెండుసార్లు తాను ప్రజల కోసమే నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.

Continues below advertisement

ఆరు నెలలు ఆగండి.. మంచిరోజులొస్తాయని అంటున్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. తాను ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యేని కాదని, అయినా కూడా ప్రజల సమస్యల పరిష్కారానికి తనకు సంబంధం లేదని చెప్పడంలేదని, కచ్చితంగా ప్రజల కోసం పోరాడతానని చెప్పారు. జైళ్లకు పంపించుకున్నా, ఏం చేసినా, రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. జైల్లు, లాకప్ లు ఎప్పుడో చూశానని చెప్పారు. తనపై కోపంతో అయినా నెల్లూరు రూరల్ లో సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, అలా చేస్తే, రూరల్ నియోజకవర్గ పరిధిలో సమస్యలు పరిష్కరించగలిగితే తానే నేరుగా వెళ్లి సీఎం జగన్‌కి పూలమాల వేస్తానన్నారు. లేకపోతే పోరాటం తప్పదన్నారు. వచ్చే నెలనుంచి 141రోజుల ప్రజా ఆశీస్సుల యాత్ర చేపట్టబోతున్నట్టు తెలిపారు.

Continues below advertisement

వాస్తవానికి నెల్లూరులో నిరసన ప్రదర్శనలకోసం కోటంరెడ్డి భారీ ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నారు. కలెక్టరేట్ ఎదుట, రోడ్లు, భవనాల శాఖ భవనం ఎదుట పెద్ద సంఖ్యలో జనసమీకరణ చేసి నిరసన ప్రదర్శన చేపట్టాలనుకున్నారు. కానీ ఎమ్మల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఆ కార్యక్రమాలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆయన తన రూరల్ కార్యాలయంలోనే నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

నెల్లూరు రూరల్ పరిధిలో రోడ్లు, కాల్వలు, పొట్టేపాలెం కలుజుపై వంతెనకోసం ఆయన నిరసన చేపట్టారు. బీసీ భవన్, అంబేద్కర్ భవన్ సమస్యల పరిష్కారం కూడా గళమెత్తారు. కొమ్మరపూడి లిఫ్టి ఇరిగేషన్ పనులు, కొమ్మరపూడి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు తానేదో అధికార పార్టీనుంచి బయటకు వచ్చి ఈ మాటలు చెప్పడంలేదని, గతంలో కూడా తాను ఈ సమస్యల పరిష్కారానికై గళమెత్తానని చెప్పారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనూ ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేశానన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఇప్పుడైనా సులభంగా రూరల్ సమస్యలు పరిష్కారమవుతాయని అంచనా వేసినా, అది కూడా సాధ్యం కాలేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పార్టీలో ఉన్నా తాను మాత్రం తన నియోజకవర్గ సమస్యలు పరిష్కరించుకోలేకపోయానని చెప్పారు.

అప్పుడే మంత్రి అయిఉండేవాడిని..

గతంలో తాము ప్రతిపక్షంలో ఉండగా 23మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లారని, వారిలో కొందరు మంత్రులు కూడా అయ్యారన చెప్పారు కోటంరెడ్డి. కానీ తాను ఆనాడు కష్టాల్లో ఉన్నా కూడా జగన్ చేయి వదిలిపెట్టలేదని, ఆయన్నే అంటిపెట్టుకుని ఉన్నానని చెప్పారు. ఇప్పుడు అధికార పార్టీ శాసన సభ్యుడిని అయినా కూడా ఏడాదిన్నరపాటు ఇంకా అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండే అవకాశం ఉన్నా కూడా పార్టీని వదిలిపెట్టానని చెప్పారు. ఆనాడు తాను పార్టీ మారి ఉంటే మంత్రిని అయిఉండేవాడిని అని, ఈనాడు పార్టీనుంచి బయటకు రావడం వల్ల  మరోసారి కష్టాలు అనుభవిస్తున్నానని చెప్పారు. రెండుసార్లు తాను తన సొంత లాభానికి నిర్ణయం తీసుకోలేదని, కేవలం ప్రజల కోసమే నిర్ణయం తీసుకున్నానని చెప్పారు కోటంరెడ్డి.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి రోజూ ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు కోటంరెడ్డి. తనమీద కోపం, తనపై కక్షతో అయినా ప్రభుత్వం నెల్లూరు రూరల్ లో వేగవంతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే అంతకంటే సంతోషం తనకింకేం లేదన్నారు. అలా జరగాలని ఆశిస్తున్నట్టు చెప్పారు.

Continues below advertisement