Nellore Rural MLA kotamreddy: నెల్లూరు జిల్లాలో ఇద్దరు పోలీసు అధికారులు అధికార పార్టీకి ఏజంట్లుగా మారిపోయారని ఆరోపించారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అతి త్వరలో వారి బండారం బయటపెడతానని హెచ్చరించారు. పూర్తి ఆధారాలతోసహా ఆ ఇద్దరి గుట్టు విప్పుతానన్నారు. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులుపై కూడా కోటంరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. కొల్లి రఘు రామిరెడ్డితో కలసి సీతారామాంజనేయులు వైసీపీ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు.
పోలీస్ వ్యవస్థపై తమకు గౌరవం ఉందంటూనే కొంతమంది పోలీసులపై ఆరోపణలు ఎక్కుపెట్టారు కోటంరెడ్డి. ఏపీ పోలీసుల్లో 90 శాతం మంది నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, మిగతా 10 శాతం మందితోనే సమస్య అని అన్నారు కోటంరెడ్డి. టీడీపీ నేతల్ని వేధింపులకు గురి చేస్తున్నారని, కనీసం తమ సభలకు కూడా పర్మిషన్లు ఇవ్వడం లేదని, ఒకవేళ అనుమతి ఇచ్చినా ప్రజలు రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు కోటంరెడ్డి. ఎన్ని వేధింపులు, నిర్బంధాలకు గురి చేసినా, వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన అధికారంలోకి రావడం ఖాయమన్నారు కోటంరెడ్డి.
నారాయణను వేధిస్తారా..?
నెల్లూరు సిటీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి నారాయణను ప్రభుత్వం రకరకాలుగా వేధిస్తోందని మండిపడ్డారు కోటంరెడ్డి. నెల్లూరు జిల్లాలో వైసీపీని వీడి అనేక మంది టీడీపీలోకి వస్తున్నారని, అది జీర్ణించుకోలేకే ఇలా కక్షసాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైసీపీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా టీడీపీ, జనసేన సభలకు భారీగా జనం వస్తున్నారని చెప్పారు. ఇవన్నీ భరించలేక వైసీపీ ప్రభుత్వం బరితెగించి ప్రవర్తిస్తోందన్నారు. మాజీమంత్రి నారాయణపై వేధింపులు కూడా ఇందులో భాగమేనని చెప్పారు ఎమ్మెల్యే కోటంరెడ్డి.
వైసీపీ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో నారాయణపై రాష్ట్రంలో అనేక పోలీస్ స్టేషన్లలో ఎన్ని కేసులు పెట్టారో లెక్కేలేదన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. ఐటీవల డ్రగ్స్ పేరుతో నారాయణ కాలేజీకి వెళ్లి విధ్వంసం సృష్టించారన్నారు. తాజాగా నారాయణ అనుచరులు, వ్యాపారస్తులపై దాడులు చేశారని.. చివరికి బెడ్ రూమ్, కిచెన్ రూమ్ లోకి కూడా వెళ్లి సోదాలు చేశారని అన్నారు. ఆడిటర్ల వద్దకు వెళ్లి నారాయణ రహస్యాలు చెప్పాలని వేధించారని మండిపడ్డారు.
టీడీపీ, జనసేన సభలని అడ్డుకుంటూ నేతల్ని పోలీసులు బెదిరిస్తున్నారని అన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. తమ మీటింగ్ లకి వస్తే పోలీస్ స్టేషన్ కి పిలిపించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారనిల అన్నారు. ప్రజాస్వామ్యం బతకాలన్నా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగలన్నా ఏపీపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ గా దృష్టి పెట్టాలని చెప్పారు. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న విషయాలన్నిటిపై కేంద్ర ఎన్నికల కమిషన్ విచారణ చేపట్టాలన్నారు కోటంరెడ్డి.
వాలంటీర్లకు మా సపోర్ట్..
ఏపీలో విలేజ్, వార్డ్ వాలంటీర్లు రూ.5వేల జీతానికి గొడ్డు చాకిరీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కోటంరెడ్డి. టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు వస్తాయని భరోసా ఇచ్చారు. వాలంటీర్ల ఉద్యోగాలు తీసేయబోమని.. వారికి విద్యార్హతలను బట్టి ఉన్నత ఉద్యోగాలు వచ్చేలా చేస్తామన్నారు.
పీకే చెప్పారుగా..
ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టుగానే ఏపీలో వైసీపీకి ఘోర పరాభవం తప్పదన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. 57 శాతం ఓటింగ్ తో టీడీపీ-జనసేన కూటమి 160 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లలో గెలవబోతోందని జోస్యం చెప్పారు. జగన్ దారుణంగా ఓడిపోవడం ఖాయమన్నారు.