Former Minister Narayana: నెల్లూరు నగరంలో మాజీ మంత్రి నారాయణ అనుచరుల ఇళ్లలో జరిగిన పోలీస్ సోదాల విషయంలో ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి మీడియాకు వివరాలు తెలియజేశారు. రాజకీయాలకు ఈ సోదాలకు సంబంధం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. నారాయణ విద్యా సంస్థల పేరుతో బస్సుల కొనుగోలు వ్యవహారంలో ప్రభుత్వాన్ని మోసం చేయాలని చూశారని, రవాణా శాఖకు రావాల్సిన ఆదాయానికి గండి కొట్టాలని ప్రయత్నించారని.. అందుకే ఆ కేసుతో సంబంధం ఉన్న అందరి ఇళ్లలో సోదాలు చేపట్టామని తెలిపారాయన. 


అసలేం జరిగిందంటే..?
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీకి అనుబంధంగా ఇన్స్ పైరా అనే సంస్థ ఉందని తెలిపారు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి. ఆ సంస్థకు పునీత్ అనే వ్యక్తి డైరెక్టర్ గా ఉన్నారని, నారాయణ విద్యాసంస్థల్లో కూడా ఆయన డైరెక్టర్ గా ఉన్నారని చెప్పారు. 2023 జూన్ లో ఇన్స్ పైరా అనే కంపెనీ నారాయణ విద్యా సంస్థలతో ఒక ఒప్పందం కుదుర్చుకుందని అన్నారు ఎస్పీ. ఈ ఒప్పందం ప్రకారం 92 కొత్త బస్సుల కోసం రూ. 20.8 కోట్లకు ఇన్స్ పైరా సంస్థ ఆర్డర్ పెట్టిందని, అయితే ఇన్ వాయిస్ మాత్రం నారాయణ విద్యా సంస్థల పేరు మీద తీసుకున్నారని ఆయన వివరించారు. 




ఎందుకీ జిమ్మిక్కులు..?
వాస్తవానికి విద్యా సొసైటీ కి చెందిన వాహనాలకు పన్ను తక్కువగా ఉంటుంది. అందుకే ఇన్స్ పైరా సంస్థ ఇక్కడ నారాయణ విద్యా సంస్థల పేరు వాడుకుందని అంటున్నారు నెల్లూరు జిల్లా ఎస్పీ. అయితే ఈ కేసులో జిల్లా రవాణా శాఖ అధికారికి ఈ గోల్ మాల్ పై సమాచారం అందిందని, ఆ సమాచారం ఆధారంగా తాము విచారణ చేపట్టామని, సోదాలు చేశామని చెప్పారాయన. బస్సులను నారాయణ సంస్థ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించినా.. ప్రతి నెలా ఇన్స్ పైరా సంస్థ ఆ బస్సులకు సంబంధించి అద్దెను నారాయణ సంస్థలనుంచి వసూలు చేయడం విశేషం. వాహనాలను ఇన్స్ పైరా కొన్నా కూడా వాటిని నారాయణ సంస్థ కొన్నట్టు రవాణా శాఖకు చూపించారు. మరి వాటి యజమాని నారాయణ విద్యాసంస్థ అయితే.. ఇన్స్ పైరా కు సదరు సంస్థ అద్దె ఎందుకు చెల్లిస్తోందనేదే ఇక్కడ అసలు ప్రశ్న. అంటే ఇక్కడ గోల్ మాల్ చేసి, ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారని పోలీసులు తేల్చారు. 


అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు 
నెల్లూరు జిల్లా రవాణా శాఖ అధికారులు బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవారి ఇళ్లపై దాడులు చేశారు. ఈ దాడుల్లో కోటీ 81 లక్షల రూపాయల సొమ్మ స్వాధీనం చేసుకున్నారు. ఈ సొమ్ముకి సదరు యజమానులు లెక్క చూపించకపోవడం విశేషం. దీన్ని ఆదాయపు పన్ను శాఖకు అప్పగిస్తున్నట్టు తెలిపారు పోలీసులు. తప్పుడు డాక్యుమెంట్ల తో  వాహనాలను రిజిస్ట్రేషన్ చేసిన కేసులో పూర్తి స్థాయి విచారణ చేపట్టామన్నారు. ఈ వ్యవహారంలో పునీత్ పై కేసు నమోదు చేశామని, విచారణ కొనసాగుతోందని చెప్పారు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి. 


కోట్లకు బదులు లక్షల్లో పన్ను.. 
డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటలిజెన్స్ విభాగం ఈ మోసాన్ని గుర్తించిందని తెలిపారు డీటీసీ చందర్. రవాణా శాఖ కమిషనర్ కు ఫిర్యాదు రావడంతో ఆయన ఆదేశాల మేరకు తాము విచారణ చేపట్టామన్నారు. మొత్తం 92 వాహనాలు కొనుగోలు చేశారని, నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించి పన్ను ఎగ్గొట్టారని అన్నారు. రూ.10 కోట్లకు పైగా పన్ను చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.22.25 లక్షలు మాత్రమే పన్ను కట్టారన్నారు. నారాయణ సంస్థకు నోటీస్ లు ఇచ్చి వివరణ తీసుకుంటున్నామని, అవసరమైతే ఆయా బస్సుల్ని సీజ్ చేస్తామని చెప్పారు డీటీసీ చందర్. బస్సుల రిజిస్ట్రేషన్లలో జీఎస్టీ అక్రమాలకు కూడా పాల్పడినట్టు గుర్తించామన్నారాటన.