నెల్లూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్డు రవాణా వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నది. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లపై వెళ్లాలంటే వాహనదారులకు నరకం కనిపిస్తోంది. జాతీయ రహదారులపై సైతం నీరు నిలిచిపోవడంతో ప్రయాణానికి కష్టం అవుతోంది. ముఖ్యంగా నెల్లూరు-చెన్నై రహదారిపై వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరి కనిపిస్తున్నాయి. లారీలు లాంటి పెద్ద వాహనాలు సైతం నీటమునగడంతో ఇటువైపుగా వెళ్లాలంటేనే వాహనదారులు భయపడిపోతున్నారు. 


వారం రోజుల క్రితం నెల్లూరు నుంచి వెళ్లే 16వ నెంబర్ జాతీయ రహదారికి గండి పడింది. పెన్నా వరదకు హైవే సైతం కొట్టుకుపోయింది. రిపేర్ చేసేందుకు 24 గంటల సమయం పట్టింది. యుద్ధప్రాతిపదికన పనులు జరిగినా.. ఒకరోజంతా ప్రయాణికులు నరకం చూశారు. మరో మార్గంలేక, ఒకవేళ వేరే రూట్లో వెళ్లినా సమయం మరింత ఎక్కువవుతుందనే భయంతో చాలామంది రోడ్లపైనే పడిగాపులు పడ్డారు. గతంలో కురిసిన వర్షాలకు రైల్వే ట్రాక్ లు కూడా దెబ్బతినడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. 


తాజాగా కురుస్తున్న వర్షాలకు మరోసారి అలాంటి పరిస్థితి ఎదురవుతోంది. నెల్లూరు నుంచి చెన్నై వెళ్లే మార్గ మధ్యంలో గూడూరు వద్ద వరదనీరు రోడ్డుపైకి వచ్చి చేరింది. దీంతో తాత్కాలికంగా బ్రిడ్జ్ పైనుంచి రాకపోకలు ప్రారంభించారు. అయితే వాహనాలను పెద్ద సంఖ్యలో దారి మళ్లిస్తున్నారు. నెల్లూరు నుంచి రాపూరు, పొదలకూరు, వెంకటగిరి మీదుగా నాయుడుపేట వైపు వాహనాలను మళ్లిస్తున్నారు. తిరుపతి వెళ్లే వాహనాలకు కూడా అదే మార్గం సూచించారు అధికారులు. దీంతో నెల్లూరు - పొదలకూరు - వెంకటగిరి మార్గంపై ఒత్తిడి పెరిగింది. అక్కడ కూడా గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతోంది. 
Also Read: Weather Updates: నేడు మరో అల్పపీడనం.. ఏపీలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.. చల్లచల్లగా తెలంగాణ


జిల్లాలో అంతర్గత రవాణాకు అంతరాయం.. 
ఇక జిల్లా వ్యాప్తంగా అంతర్గతంగా కొన్ని మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అనంతసాగరం, ఆత్మకూరు, ఏఎస్ పేట, వింజమూరు మండలాల్లో కొన్ని చోట్ల రోడ్లపైకి వరదనీరు వచ్చి చేరింది. భారీ వర్షాలకు చెరువు కట్టలపైనుంచి నీరు పొంగి పొర్లుతోంది. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ధైర్యం చేసి వాహనాలను నడిపేందుకు ప్రయత్నించినా ప్రమాదాల భయంతో వాహనదారులు వెనకాడుతున్నారు. అసలే జిల్లాలో రోడ్లు మరమ్మతులకు నోచుకోక గుంతలు తేలి ఉన్నాయి. ప్రస్తుతం వర్షాలకు అవి మరింత అధ్వాన్నంగా మారిపోయాయి. ఎక్కడ నీరు ఉందో, ఎక్కడ గుంత ఉందో తెలియక వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. 


ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మేలు.. 
అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, అనవసరంగా ప్రయాణాలు పెట్టుకుని రోడ్లపై ఇబ్బందిపాలు కావొద్దని జిల్లా వాసులకు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా వరదనీరు రోడ్లపైకి వచ్చే ప్రాంతాల్లో ప్రయాణించడం మృత్యువుతో చెలగాడం ఆడటమేనని అంటున్నారు అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు తగ్గే వరకు అత్యవసరమైతేనే ఇల్లు దాటాలని సూచిస్తున్నారు.
Also Read: CM Meet Central Team : విపత్తు నిర్వహణలో బాగా పని చేశారు.. సీఎం జగన్‌కు కేంద్ర బృందం అభినందన !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి