నెల్లూరు జిల్లాలో భారీ ఎత్తున సిలికా శాండ్ కుంభకోణం జరుగుతోందని, నెల్లూరు జిల్లాలో మరో ఓబులాపురం తరహా కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఘాటుగా బదులిచ్చారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. కర్నూలు జిల్లాలో అనుమతులు తీసుకుని, నెల్లూరు జిల్లాలో తవ్వకాలు జరుపుతున్నారని సోమిరెడ్డి చేసిన విమర్శలపై మంత్రి కాకాణి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అన్ని పాముల్ని చూసి ఏలిక పాము కూడా బుసకొడుతోందన్నారు కాకాణి గోవర్దన్ రెడ్డి. 


నిత్యం వైసీపీని విమర్శించే సోమిరెడ్డి, అది చాలదన్నట్లు ఉద్యోగులను దూషించడం దురదృష్టకరం అన్నారు మంత్రి కాకాణి. అధికారంలో ఉన్నప్పుడు అధికారులను బెదిరించడం, అధికారంలో లేనప్పుడు బ్లాక్ మెయిల్ చేయడం సోమిరెడ్డికి ఆనవాయితీ అని అన్నారు. నెల్లూరు జిల్లా చరిత్రలో సోమిరెడ్డి లాంటి అవినీతిపరుడిని గతంలో ఎన్నడూ చూసి ఉండరని, భవిష్యత్తులో చూడబోరని అన్నారు కాకాణి. నెల్లూరు జిల్లా చరిత్రలోనే అత్యంత అవినీతిపరుడిగా ఘనకీర్తి గడించిన ఏకైక నాయకుడు సోమిరెడ్డి అని అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, నావూరు సచివాలయ పరిధిలో "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో పాల్గొన్న కాకాణి.. సోమిరెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 


"భాష సామ్రాట్" తన భాషతో అధికారులను బెదిరించి, బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అన్నారు కాకాణి. అన్ని పాములు ఆడితే  ఏలిక పాము కూడా బుస కొట్టినట్లు, ఏలిక పాము లాంటోళ్లు ఏదేదో మాట్లాడి పత్రికల్లో రాయించుకొని సంతోష పడుతున్నారని ఎద్దేవా చేశారు. అధికారం ఉన్నపుడే సోమిరెడ్డి లాంటి ఏలిక పాములను లెక్క చేయలేదని, ఇప్పుడు టీడీపీకి అధికారం లేదని, ఇప్పుడు తాము భయపడతామా..! అని అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గం తన కుటుంబం లాంటిదని అన్నారు కాకాణి. సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని వివరణ ఇచ్చారు. 


ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధి ప్రధాన అజెండాగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు కాకాణి. వైసీపీ పాలనలో అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు గ్రామాలలోని ప్రజలకు సంపూర్ణంగా సమగ్రంగా అందుతున్నాయని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో శంకుస్థాపన శిలాఫలకాలు కాకుండా, ప్రారంభోత్సవ శిలాఫలకాలు వేస్తున్నామన్నారు. గ్రామాల్లోని ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను సమగ్రంగా అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని వివరించారు. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కంటే 15 నుంచి 20 శాతం అధికంగా రేటు పలుకుతోందని, దీనికి జగన్ కృషి ఎనలేదని చెప్పారు. జగన్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు కాకాణి. 


పంట ధరలు పడిపోవాలని, రైతులు నష్టపోవాలని, రైతులు రోడ్డెక్కాలని, రైతులు ప్రభుత్వాన్ని విమర్శించాలని తెలుగుదేశం నాయకులు కంటిమీద కునుకు లేకుండా ఎదురు చూస్తున్నారని విమర్శించారు కాకాణి. ఆకాశంలో మబ్బులేస్తే చాలు తెలుగుదేశం నాయకుల్లో ఆశలు చిగురిస్తున్నాయన్నారు. అకాల వర్షం పడకపోతుందా!, రైతులు నష్టపోకుండా ఉంటారా! అని వారంతా ఎదురుచూస్తున్నారని ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లాలోని 23,023 మంది రైతుల 43 వేల ఎకరాల చుక్కల భూములకు జగన్ శాశ్వత పరిష్కారం చూపించారని చెప్పారు. 


ఇది ఓ స్వర్ణ యుగం
చంద్రబాబు ఆలోచనకు అందని అనేక సంక్షేమ కార్యక్రమాలు జగన్ అమలు చేస్తున్నారని చెప్పారు కాకాణి. జగన్ పరిపాలనలో రాష్ట్రం అన్ని రకాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. జగన్ పాలన ఆంధ్ర రాష్ట్రానికి ఒక స్వర్ణ యుగం అని చెప్పారు.