తమిళనాడు నుంచి వచ్చినవారిని అరవోళ్లు అనడం రివాజు. అయితే వెటకారంగా పదే పదే అరవోడా అంటే ఎవరికైనా కోపం వస్తుంది. కానీ ఆ కోపం ఏకంగా మనిషి ప్రాణం తీసే స్థాయిలో ఉంటుందని ఎవరూ అనుకోరు. కానీ నెల్లూరు జిల్లాలో అదే జరిగింది. తమిళనాడుకి చెందిన ఇద్దరు అన్నదమ్ములు నెల్లూరులో నివశిస్తున్నారు. వీరిని స్థానికుడైన ఓ వ్యక్తి అరవోడా అరవోడా అన్నాడని కోపం పెంచుకుని అన్నదమ్ములిద్దరూ అతడిని కొట్టి చంపేశారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 


నెల్లూరులోని ఎన్టీఆర్‌ నగర్‌ ఆర్చి సెంటరులో తిరుమల సురేష్‌ అలియాస్ మార్కెట్‌ సురేష్‌ (34) అనే వ్యక్తి నివశిస్తున్నాడు. ఇతను లారీ డ్రైవర్. ఖాళీ సమయంలో కరెంటు పనులు కూడా చేస్తుండేవాడు. ఇటీవల సురేష్ అనారోగ్యంపాలవడంతో లారీ డ్రైవింగ్ కి వెళ్లడంలేదు. ఇంటి వద్దే ఉంటూ కరెంటు పనులు చేసుకుంటున్నాడు. చివరకు కరెంటు పనులు కూడా కష్టంగా ఉండటంతో సొంతగా టీ కొట్టు పెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఆ టీకొట్టు ఓపెనింగ్ కి రెండు రోజుల ముందుగా స్నేహితుల్ని పిలిచి ఓ పార్టీ ఇచ్చాడు ఆ పార్టీయే అతని ప్రాణం తీసింది. 


తాను టీ కొట్టు పెడుతున్నానని ఈ సందర్భంగా పార్టీ ఇస్తున్నానని చెప్పిన సురేష్ తన స్నేహితులందర్నీ పిలిచాడు. టీకొట్టు ఓపెనింగ్ కి రెండు రోజుల ముందు ఫుల్లుగా ఎంజాయ్ చేయాలనుకున్నాడు. స్నేహితుల్ని పిలిచి మందు పార్టీ ఇచ్చాడు. ఈ మందు పార్టీలో పెద్ద గొడవైంది, అదే సురేష్ ప్రాణాలు పోవడానికి కారణం అయింది. 


సురేష్ కి ఆటో డ్రైవర్ వెంకయ్య స్నేహితుడు. వెంకయ్యతోపాటు అతని అన్న మురుగన్ కూడా పార్టీకి వచ్చాడు. వీరిద్దరు ఇటీవలే తమిళనాడు నుంచి వలస వచ్చి నెల్లూరులో ఉంటున్నారు. అయితే పార్టీలో జరిగిన గొడవతో వీరిద్దరూ హర్ట్ అయ్యారు. పార్టీలో పదే పదే తమను సురేష్ అరవోడా అని పిలిచారనేది వారి బాధ. 


మందు పార్టీలో స్నేహితులు సరదాగా ఒకరినొకరు ఆట పట్టించుకునే క్రమంలో పదే పదే సురేష్ వెంకయ్యను అతని అన్న మురుగన్ ని అరవోడా అని పిలిచాడు. దీంతో వారిద్దరూ ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్నారు. కొంతసేపటికి అక్కడినుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత సురేష్ కూడా తన ఇంటికి వెళ్లాడు. అరవోడా అనే మాట జీర్ణించుకోలేకపోయిన అన్నదమ్ములిద్దరూ మళ్లీ సురేష్ ఇంటికి వచ్చారు. గొడవ పడ్డారు. సురేష్ ని తమతోపాటు బైక్ ఎక్కించుకుని తీసుకెళ్లారు. 


సురేష్ భార్య అనుమానంతో వారి వెంట వెళ్లింది. అక్కడి నుంచి సురేష్ ని తమ ఇంటికి తీసుకెళ్లారు మురుగన్, వెంకయ్య. అక్కడ చెక్కపీటతో సురేష్ తలపై కొట్టారు. కర్రతో విచక్షణారహితంగా దాడి చేశారు. రక్తపు మడుగులో పడిపోయిన సురేష్ ని చూసి భార్య కేకలు వేసింది. చుట్టుపక్కలవారు అక్కడికి వచ్చారు. సురేష్ ని ఆస్పత్రికి తరలించారు. కానీ లాభం లేదు. సురేష్ ఆస్పత్రిలో చనిపోయాడు. అనంతరం నిందితులు అక్కడినుంచి పారిపోయారు. టీ కొట్టు పెట్టుకుందామనుకున్న సురేష్ ఓపెనింగ్ కి ఒకరోజు ముందే చనిపోయాడు. అతని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులిద్దర్ని అరెస్ట్ చేశారు.