కరోనాకి ముందు వారంతా వేర్వేరు పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. కరోనా టైమ్ లో వ్యాపారాల్లో నష్టం రావడంతో ఏం చేయాలో దిక్కుతోచలేదు. సులభంగా డబ్బు సంపాదించేందుకు ఓ పథకం పన్నారు. వారిలో ఒకరికి డూప్లికేట్ సర్టిఫికెట్లు తయారు చేయడం తెలుసు. ఉన్నది ఉన్నట్టుగా ఆధార్ కార్డ్ ను దించేస్తాడు. అడ్రస్ లు, ఫొటోలు మార్చేసి అచ్చుగుద్దినట్టు కొత్త ఆధార్ లాగా తయారు చేస్తాడు.
ఇద్దరికి బంగారు ఆభరణాల తయారీలో ప్రవేశం ఉంది. 22 కేరెట్ గోల్డ్ కంటే తక్కువ కేరెట్ విలువతో బంగారు ఆభరణాలు చేస్తారు. అంతే కాదు, వాటికి హాల్ మార్కింగ్, 916 కేడీఎం అనే డిజిటల్ ముద్ర వేయడం కూడా వారికి తెలుసు.
నలుగురు ముఠగా ఏర్పడ్డారు. ఇద్దరు నకిలీ బంగారు ఆభరణాలు తయారు చేస్తే, మరో ఇద్దరు డూప్లికేట్ ఆధార్ కార్డులు ప్రింట్ చేసేవారు. నలుగురు కలిసి కుదువ వ్యాపారుల వద్దకు వెళ్లి వారిని బురిడీ కొట్టించేవారు.
నకిలీ బంగారం కుదవ పెట్టి వ్యాపారులను మోసం చేస్తున్న నెల్లూరుకు చెందిన ముఠాను కావలి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నకిలీ బంగారు నగలు, దాని తయారీకి ఉపయోగించే వస్తువులు, నగదు స్వాధీనం చేసుకున్నారు. మోసపోయిన వారి వివరాలు సేకరించి వారు తాకట్టు పెట్టిన నగలను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కరోనా తర్వాత సులభంగా డబ్బు సంపాదించే మార్గాలు అన్వేషించిన నలుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఇలా నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బులు కాజేస్తున్నట్టు నిర్థారించారు పోలీసులు. నెల్లూరు నగరం, కావలిలో తాకట్టు వ్యాపారులను వీరు మోసం చేశారు. ఇలాంటి వారి బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని తాకట్టు వ్యాపారులను హెచ్చరించారు పోలీసులు.
ఎలా దొరికారు..?
నెల్లూరుకు చెందిన వేలమూరి మహేష్ బాబు, పనబాక మధు, వింజమూరు హరిబాబు, లెక్కల మణికంఠ.. ఈ నలుగురు తమ వద్దఉన్న నకిలీ బంగారు ఆభరణాలు తీసుకెళ్లి కుదువ వ్యాపారులను కలిసేవారు. హాల్ మార్క్ కూడా ఉండటంతో వ్యాపారులు వారి మాటలు ఈజీగా నమ్మేవారు. అంతే కాదు, నెల్లూరు లోకల్ అడ్రస్ తో ప్రూఫ్ కూడా ఉండటంతో వారు ఈజీగా బుట్టలో పడేవారు.
ఇటీవల నెల్లూరులో ఈ ముఠా నలుగురు వ్యాపారుల్ని ఇలాగే మోసం చేసింది. ఆ తర్వాత కావలిలో తమ పని మొదలు పెట్టింది. కావలిలోని చెంద్రశేఖర్ అనే వ్యక్తికి చెందిన చంద్ర పాన్ బ్రోకర్ షాప్ లో ఫిబ్రవరి21, మార్చి 7వ తేదీన రెండు సార్లు బంగారు చైన్లు కుదవ పెట్టి 1,12,000 రూపాయలు తీసుకుని పోయారు. ఆ తర్వాత వ్యాపారి బంగారాన్నితనిఖీ చేయగా నకిలీ బంగారం అని తేలింది. ఆయన కావలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారిపై నిఘా పెట్టిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా వారి జాడ పసిగట్టారు.
నెల్లూరులో కూడా ఇలాగే చేస్తారని తెలుసుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేశారు. కుదువ వ్యాపారులను ఎలా బురిడీ కొట్టిస్తారనే విషయం తెలుసుకుని పోలీసులే షాకయ్యారు.