నెల్లూరు జిల్లా పోలీసుల వ్యవహారం ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. ఆ మధ్య మహిళా కానిస్టేబుళ్ల యూనిఫాం కొలతల వ్యవహారంపై విమర్శలు రాగా.. ఇటీవల ఆ విషయాన్ని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రస్తావిస్తూ నెల్లూరు జిల్లా ఎస్పీపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఎస్పీ కుటుంబ సభ్యులపై కూడా అనిత వ్యాఖ్యలు చేయడంతో దుమారం మొదలై చివరకు అది రాజకీయ రంగు పులుముకుంది. మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు మద్దతుగా టీడీపీ రంగంలోకి దిగింది. అనితకు వ్యతిరేకంగా వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి సహా, వైసీపీ మహిళా నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో మరోసారి నెల్లూరు పోలీసులు టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారారు. 


మర్రిపాడు ఎస్సైపై క్రమశిక్షణ చర్యలు.. 
ఈ ఘటన జరిగిన రెండు రోజులకే మర్రిపాడు ఎస్సై వెంకట రమణ వ్యవహారంపై దుమారం రేగింది. మర్రిపాడులో స్కూటీపై వెళ్తున్న ఓ వ్యక్తి మాస్క్ పెట్టుకోలేదన్న కారణంగా ఎస్సై చేయి చేసుకున్నారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఎస్సై ప్రవర్తనపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగింది. దీంతో హడావిడిగా స్థానిక డీఎస్పీతో విచారణ జరిపించిన జిల్లా ఎస్పీ విజయరావు ఎస్సై వెంకటరమణపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఆయనకు చార్జ్ మెమో ఇచ్చారు. 




మహిళను వివస్త్రను చేశారంటూ.. 
ఇటీవల ఓ ప్రైవేటు స్థలం వ్యవహారంలో పోలీసులు ఓ మహిళను అరెస్ట్ చేసే క్రమంలో ఆమె దుస్తులు సరిగా లేకున్నా.. అలాగే పోలీస్ స్టేషన్ కు తరలించారనే ఆరోపణలున్నాయి. కలిగిరి మండలం పెద్ద అన్నలూరు గ్రామంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఆ వెంటనే పోలీసులు నష్టనివారణ చర్యలు చేపట్టారు. కలిగిరి సీఐ సాంబశివరావు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆ వార్తల్ని ఖండించారు. పోలీసుల తప్పేమీ లేదని వివరణ ఇచ్చారు. 


దీనికితోడు ఇటీవల లిధువేనియాకు చెందిన ఓ యువతిపై నెల్లూరు జిల్లాలో అత్యాచార యత్నం జరిగింది. ఈ ఘటన సరిగ్గా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున జరగడంతో మరోసారి నెల్లూరు వార్తల్లోకెక్కింది. అత్యాచార ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారడంతో నెల్లూరు జిల్లా పోలీసులు నష్టనిరవారణ చర్యలు చేపట్టారు. ఎస్పీ ఆదేశాలతో గంటల వ్యవధిలోనే నిందితుల్ని అరెస్ట్ చేశారు. విదేశీ మహిళకు రక్షణ కల్పించి, ఆమె ప్రయాణానికి ఏర్పాట్లు కూడా చేశారు. 




అటు అభినందనలు.. 
ఇటీవల రోడ్డు ప్రమాదాల నివారణలో నెల్లూరు జిల్లా ఫస్ట్ ప్లేస్ లో ఉందంటూ ఉన్నతాధికారులు జిల్లా ఎస్పీని అభినందించారు. వైట్ కాలర్ నేరాల నివారణలో కూడా జిల్లా పోలీసులు చురుగ్గా వ్యవహరిస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని గంటల వ్యవధిలోనే కొన్ని కిడ్నాప్ కేసుల్ని ఛేదించిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. సెబ్ అధికారులతో కలిసి జిల్లాలో గంజాయి, నాటుసారా, సారా అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇవే కాకుండా విజిబుల్ పోలీసింగ్, చాయ్ విత్ బీట్స్, స్పందన కార్యక్రమం రోజున బాధితులకు అన్నదానం.. వంటి కార్యక్రమాలు కూడా జిల్లా పోలీసులపై ప్రజల్లో మంచి అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. మరోవైపు వరుసగా జరుగుతున్న ఘటనలు జిల్లా పోలీసుల వ్యవహారాన్ని రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి. 




Also Read: Chittoor Woman: తల్లి చనిపోయిందని తెలీక రోజూ టాటా చెప్పి స్కూల్‌కి వెళ్తున్న బాలుడు, కన్నీరు పెట్టిస్తున్న పదేళ్ల పిల్లాడి దుస్థితి


Also Read: She Is A Man: నా భార్య స్త్రీ కాదు, న్యాయం చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన భర్త - విచారణకు ధర్మాసనం ఓకే