టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డిపై నెల్లూరులో దాడి జరిగింది. నెల్లూరు బీబీనగర్ సమీపంలో టీడీపీ నేత కిలారి వెంకటస్వామి నాయుడు నివాసం వద్ద ఆనం వెంకట రమణారెడ్డి ఉండగా 8 మంది దుండగులు ఆయనపై దాడి చేసినట్టు తెలుస్తోంది. ఆనంపై దాడి చేస్తున్న వారిని అక్కడే ఉన్న టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో వారు రెండు వాహనాలను అక్కడే వదిలి పారిపోయారు. కర్రలు, మారణాయుధాలతో సహా దుండగులు అపార్ట్ మెంట్ దగ్గరకు వాహనాల్లో వచ్చారని తెలుస్తోంది. అపార్ట్ మెంట్ వాసులంతా కేకలు వేయడంతో దాడి చేయడానికి వచ్చినవారు పారిపోయారు.
వైసీపీ పనే..!
దాడికి ప్రయత్నించింది వైసీపీ నాయకులేనంటూ ఆరోపణలు వినపడుతున్నాయి. ఆనం వెంకట రమణారెడ్డి టీడీపీ వాయిస్ బలంగా వినిపిస్తున్నారని, అందుకే ఆయనపై దాడికి పాల్పడ్డారని అంటున్నారు ఆ పార్టీ నేతలు. వైసీపీ నాయకులే వారి అనుచరులతో ఈ పని చేయించారని చెప్పారు. దుండగులు వాడిన రెండు వాహనాలను స్వాధీనం చేసుకుని వివరాలు ఆరా తీస్తున్నారు.
దాడిపై అచ్చెన్నాయుడు స్పందన..
ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తే దాడులకు పాల్పడడం అనాగరికం, అప్రజాస్వామికం అని అన్నారు అచ్చెన్నాయుడు. సైకో చర్యలకు సమాధికట్టే రోజు దగ్గరలోనే ఉందని చెప్పారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సీనియర్ నాయకులు ఆనం వెంకటరమణారెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తుట్టు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జగన్ తీరు చూస్తుంటే జర్మనీలో నాజీల దురాగతాలను కళ్ళకు కడుతోందన్నారు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, విమర్శించడం నేరమా? ఎంత సేపు ప్రశ్నించే వారిని వేధించడం, అణచివేయడమే లక్ష్యంగా జగన్ పాలన సాగుతోందన్నారు అచ్చెన్నాయుడు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలు అవుతుందా అని హైకోర్టు పదే పదే ప్రశ్నించడం అంటే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు. తాత, తండ్రి వారసత్వ ఫ్యాక్షన్ రాజకీయాలను, దౌర్జ్యన్యాలను, దోపిడి విధానాన్ని జగన్ కొనసాగిస్తూ రాష్ట్రాన్ని నేరగాళ్లకు అడ్డాగా మార్చారని మండిపడ్డారు. జగన్ దమనకాండకు ముగింపు పలికే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. దాడిచేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి.. ఆనంకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
ఎందుకీ దాడి..?
ఆనం వెంకట రమణారెడ్డి సహజంగా హాస్య చతురత కలిగిన వ్యక్తి. ఆయన సెటైర్లు ఓ రేంజ్ లో పేలుతుంటాయి. అందుకే ఆయనకు రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు. ఇటీవల మహానాడులో కూడా ఆనం డైలాగులు బాగానే పేలాయి. ముఖ్యంగా మంత్రి రోజాని టార్గెట్ చేస్తూ ఆయన చెణుకులు విసిరారు. గతంలో కూడా మంత్రి రోజాను ఆయన చాలాసార్లు టార్గెట్ చేశారు. సీఎం జగన్ సహా.. ఆయన అందరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు, చేస్తున్నారు. ఈ దశలో ఆయనపై దాడి జరగడంతో వెంటనే వైసీపీపై అనుమానాలు మొదలయ్యాయి. దాడి చేసిన వారి వాహనాలు స్వాధీనం చేసుకున్నారు కాబట్టి, వారు ఎవరనేది తేలిపోతుంది. ప్రస్తుతం స్థానిక నాయకులంతా ఆనం వెంకట రమణారెడ్డిని పరామర్శించేందుకు బయలుదేరారు. దాడిని వారు తీవ్రంగా ఖండించారు. వెంటనే పోలీసులు దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.