New Covid Cases: కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో ఏపీ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్రంలో కొవిడ్ కేసుల పట్ల అప్రమత్తంగా ఉన్నామని వివరించారు అధికారులు. ఏపీలోని 12 మెడికల్ కాలేజీల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షల కోసం ఏర్పాట్లు చేశారు. ప్రతి గ్రామ సచివాలయానికి 10 ర్యాపిడ్ కిట్లు అందుబాటులో ఉంచారు. ఇటు జిల్లా స్థాయిలో అధికారులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం అయ్యారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రెండు ప్రత్యేక వార్డులు సిద్ధం చేశారు అధికారులు. ఈమేరకు సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు.
కరోనా కొత్త వేరియంట్ JN-1 వ్యాప్తి వార్తల నేపథ్యంలో నెల్లూరు జిల్లా ప్రభుత్వాసుపత్రి వైద్యులు అప్రమత్తమయ్యారు. కేంద్రం హెచ్చరికలతో ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఇప్పటికే నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బీఎస్ నాయక్.. వైద్యులు, సిబ్బందితో సమావేశమై కొత్త వేరియంట్ పై వివరాలు తెలియజేశారు. ఇలాంట్ సమయంలో ఎవరూ సెలవలు తీసుకోవద్దని చెప్పారు. ప్రతి వైద్యుడు కచ్చితంగా విధులకు హాజరుకావాలని సూచించారు. కరోనా కేసులు తమ పరిధి కాదని చెప్పకుండా.. ప్రతి ఒక్కరూ చొరవ చూపాలని స్పష్టం చేశారు సూపరింటెండెంట్.
నెల్లూరు జీజీహెచ్ లో రెండు ప్రత్యేక వార్డులు
కొవిడ్ కేసులను ఎదుర్కొనేందుకు.. నెల్లూరు జీజీహెచ్‌లో రెండు ప్రత్యేక వార్డులు కేటాయించారు. వాటిలో మొత్తం 320 పడకలు ఏర్పాటు చేశారు. పల్మనాలజీ విభాగంలో 100 పడకలు, జనరల్ మెడిసిన్‌లో 220 పడకలు కొవిడ్ పేషెంట్స్ కోసం సిద్ధం చేశారు. ఆసుపత్రిలో మొత్తం 750 పడకలు ఉన్నాయి. ఒకవేళ కొవిడ్ విజృంభించి కేసులు ఎక్కువయితే.. మిగతా వార్డుల్లో కూడా తాత్కాలికంగా బెడ్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో 13 కేఎల్, 10 కేఎల్ ఆక్సిజన్ ప్లాంట్లు అందుబాటులో ఉన్నాయి. ఆస్పత్రిలో 300కుపైగా వెంటిలేటర్లు ఉన్నాయి. ఐసీయూ, ఐసోలేషన్ వార్డులను అదనంగా సిద్ధం చేస్తున్నారు వైద్యశాఖ అధికారులు.
శబరిమల భక్తుల విషయంలో..
వైరస్ ట్రాన్స్‌ఫర్ మీడియా(VTM)కు వైద్యులు సిద్ధమయ్యారు. రోగికి వైరస్ సోకిన తర్వాత, వారినుంచి నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపించే ప్రక్రియను వేగవంతం చేసేలా చర్యలు చేపట్టారు. కేరళలో ఈ JN-1 వైరస్ ను గుర్తించడం.. ఇటీవల కాలంలో పలువురు భక్తులు శబరిమలకు వెళ్లి రావడంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. శబరిమల వెళ్లివచ్చిన వారిని గుర్తించి.. పరీక్షలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు వైద్యులు. ప్రస్తుతం ఏపీలో ఎవరికీ ఈ JN-1 వైరస్ సోకినట్టు నిర్థారణ కాలేదు. జిల్లాలో కూడా కేసులు లేవు, ఒకవేళ కేసులు వెలుగు చూస్తే, ఆ కేసులకు కేరళకు సంబంధం ఉందని తెలిస్తే.. శబరిమల యాత్రకు వెళ్లి వచ్చిన భక్తుల వివరాలు పూర్తి స్థాయిలో సేకరిస్తామంటున్నారు వైద్యులు.
మళ్లీ మాస్క్ నిబంధన..
నెల్లూరు జిల్లాలో మళ్లీ మాస్క్ నిబంధన తెరపైకి వచ్చేలా ఉంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని వైద్య అధికారులు చెబుతున్నారు. 60 ఏళ్లు పైబడిన వారు అవసరమైతేనే తప్ప బయటకు వెళ్లకూడదని సూచించారు. బయటనుంచి ఇంటికి వెళ్లిన తర్వాత కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని చెప్పారు వైద్యులు. శానిటైజర్ వాడకం అలవాటు చేసుకోవాలన్నారు.
ఇక ఏపీలో మొత్తంగా 33 వేలకి పైగా ఆక్సిజన్ బెడ్స్, 6 వేలకి పైగా ఐసీయూ బెడ్స్ అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర అధికారులు ఇప్పటికే ఓ ప్రకటన విడుదల చేశారు. వెంటిలేటర్లకు, కొవిడ్ మందులకి కొరత లేదన్నారు. జ్వరంతో బాధ పడుతున్న రోగులను ర్యాపిడ్ కిట్లతో పరీక్షించి అందులో పాజిటివ్ వస్తే ఆయా శాంపిల్స్ ని ఆర్టీపీసీఆర్ ల్యాబ్ లకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారిలో కొవిడ్ వేరియంట్ తెలుసుకోవాలంటే దాన్ని విజయవాడలోని జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ కి పంపించాల్సి ఉంటుంది. పొడి దగ్గు, డయేరియా లాంటి లక్షణాలు JN-1 కొత్త వేరియంట్‌లో కనిపిస్తున్నాయనే వార్తల నేపథ్యంలో ఆయా లక్షణాలు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు అధికారులు.