ఇటీవల వరుసగా వచ్చిన వరదల ధాటికి సోమశిల ఆప్రాన్ పూర్తిగా దెబ్బతిన్నది. ఆప్రాన్ కి వెంటనే మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇటీవల వరదల సమయంలో నెల్లూరు జిల్లాకు వచ్చిన సీఎం జగన్, ఆప్రాన్ మరమ్మతులకు నిధులు కేటాయిస్తున్నట్టు తెలిపారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కూడా ఈ విషయంలో అధికారులకు గతంలో పలు సూచనలు చేశారు. ఆప్రాన్ పరిసరాలను కూడా ఆయన గతంలో పరిశీలించి వెంటనే మరమ్మతులు ప్రారంభించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఆప్రాన్ మరమ్మతులకు టెండరింగ్ ప్రక్రియ అంతా పూర్తయింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మార్చి 1 నాటికి పనులు మొదలవుతాయని అంచనా.
ఎడమ రిటైనింగ్ వాల్ పొడవు పెంపు..
సోమశిల జలాశయానికి ఇటీవల వరదనీరు భారీగా పోటెత్తడంతో ఒకేసారి అన్ని గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలారు. రోజులతరబడి ఇలా గేట్లు ఎత్తివేసి ఉంచారు. నీటి ప్రవాహానికి ఆప్రాన్ పూర్తిగా ధ్వంసమైంది. రిటైనింగ్ వాల్స్ పక్కన ఉన్న దేవాలయం, ఎస్బీఐ కార్యాలయం కూడా దెబ్బతిన్నాయి. దీంతో రిటైనింగ్ వాల్ పొడవు మరింత పెంచేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎడమ రిటైనింగ్ వాల్ ని 750 మీటర్ల వరకు పెంచాలనుకుంటున్నారు. పైనుంచి ఏ స్థాయిలో నీరు వదిలినా, కింద ఎంత తీవ్రతతో నీరు ప్రవహిస్తున్నా.. ఆప్రాన్ చెక్కుచెదరకుండా ఉండేందుకు రిటైనింగ్ వాల్ పొడవు కూడా పెంచితే సరిపోతుందని అధికారులు నివేదిక ఇవ్వడంతో దీనిపై కసరత్తులు మొదలయ్యాయి.
99.11 కోట్ల రూపాయలతో పనులు..
ఇటీవలే ప్రభుత్వం 117 కోట్ల రూపాయలతో ఆప్రాన్ మరమ్మతులకు పాలనా పరమైన అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో టెండర్లు పిలవగా, రీటెండరింగ్ లో 99.11 కోట్ల రూపాయలకు అవి ఖరారయ్యాయి. నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం వీలైనంత త్వరగా పనులు మొదలు పెట్టాలని చూస్తున్నారు అధికారులు.
వర్షాకాలం వచ్చేలోగా..
వర్షాకాలం వచ్చేలోగా ఆప్రాన్ మరమ్మతు పనులు పూర్తి కావాల్సి ఉంటుంది. లేకపోతే పనులకు ఆటంకం ఏర్పడుతుంది. అప్పటి వరకు చేసిన పని కూడా వృథా అవుతుంది. అందుకే వర్షాకాలం వచ్చేలోపు వేసవి చివరినాటికి ఆప్రాన్ మరమ్మతు పనులు పూర్తి చేస్తామంటున్నారు అధికారులు. దానికి సంబంధించిన ప్రణాళికలు కూడా సిద్ధమయ్యాయి. మార్చి 1 నుంచి కాంక్రీట్ పనులు మొదలవుతాయి. దివంగత మంత్రి మేకపాటి చొరవ, జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి సీఎం జగన్ పర్యటనలో ఆప్రాన్ పనులను ప్రముఖంగా ప్రస్తావించడంతో ఈ పనులు మొదలయ్యేందుకు మార్గం సుగమం అయింది. మరోవైపు సోమశిల రిజర్వాయక్ రాల్వల ఎక్స్ టెన్షన్ పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. ఇప్పుడు ఆప్రాన్ మరమ్మతులు కూడా వేగంగా పూర్తి చేయాలని చూస్తున్నారు అధికారులు.