నెలరోజుల క్రితం నెల్లూరు నగరానికి చెన్నైనుంచి వచ్చిన కుళ్లిన చికెన్ ని హెల్త్ ఆఫీసర్స్ సీజ్ చేశారు. వారు నిఘా పెట్టిన తర్వాత ఇప్పుడు చెన్నై నుంచి కుళ్లిన చికెన్ సరఫరా నిలిచిపోయింది. కానీ తాజాగా నెల్లూరులోనే అలాంటి ముఠా బయలుదేరింది. అమ్ముడుపోగా మిగిలిన చికెన్, అనారోగ్యంగా ఉన్న కోళ్లనుంచి తీసిన మాంసం. ఇతరత్రా పాడేపోయిన చికెన్ ని నెల్లూరు నగరం వెంకటేశ్వర పురంలోని ఓ చికెన్ స్టాల్ లో దాచి ఉంచారు. ఇటీవల స్థానికులు ఈ చికెన్ స్టాల్ లో మాంసం కొనగా అది చెడిపోయినట్టు తేలింది. దీంతో అధికారులు ఆ చికన్ స్టాల్ పై దాడి చేశారు. ఫ్రిడ్జ్ లలో దాచి ఉంచిన 100 కేజీల చికెన్ ని సీజ్ చేశారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లు ఉన్నా కూడా హెల్త్ ఆఫీసర్స్ దాడి చేసి కుళ్లిన చికెన్ బండారాన్ని బట్టబయలు చేశారు. దీంతో నెల్లూరులో చికెన్ కొనాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు.




కార్తీకమాసం పూర్తి కావడంతో ఇప్పుడిప్పుడే చికెన్ కి డిమాండ్ పెరుగుతోంది. అయితే జిల్లాలో అయ్యప్ప స్వాముల మాలధారణ కార్యక్రమాలు కూడా జోరుగా సాగుతున్నాయి. దీంతో చికెన్ అమ్మకాలు ఆశించిన స్థాయిలో జరగలేదు. జనవరికల్లా పరిస్థితి మెరుగవుతుంది. ఈదశలో ఇప్పుడు నిల్వచేసిన చికెన్ వార్తల్లోకెక్కింది.


సహజంగా మనముందే చికెన్ ముక్కలుగా కట్ చేసి ఇస్తారని ధీమాగా ఉంటాం. కానీ కొన్నిచోట్ల నిల్వ చేసిన చికెన్ ని కూడా వాటితో కలిపి ఇచ్చేస్తారు. వాటిని తీసుకెళ్లి వెంటనే ఉడకబెట్టేందుకు సిద్ధం చేస్తారు కాబట్టి దానిలో మార్పు మనం గమనించలేం. అందుకే ఇలాంటి చికెన్ ని అంటగట్టేస్తారు.


హోటళ్లకోసం స్పెషల్ గా..


అయితే కుళ్లిన చికెన్ ని ప్రత్యేకంగా హోటళ్లకు సరఫరా చేస్తుంటారు. ఇటీవల చెన్నై నుంచి ఇలాంటి కుళ్లిన చికెన్ నెల్లూరుకి సరఫరా అయ్యేది. ఆమధ్య హెల్త్ ఆఫీసర్స్ దాడులు చేయడంతో అలాంటి సరఫరా తగ్గింది. అలా తెప్పించిన కుళ్లిన చికెన్ ని కొన్ని హోటళ్లు తక్కువ రేటుకి కొనుగోలు చేస్తుంటాయి. ఇప్పుడు చెన్నై నుంచి సరఫరా తగ్గిపోవడంతో.. నెల్లూరులోనే పారేయాల్సిన చికెన్ ని ఫ్రిజ్ లలో దాచిపెడుతున్నారు. దాన్ని హోటళ్లకు సరఫరా చేస్తున్నారు.


హోటళ్లలో వేడి వేడి చికెన్ తో జాగ్రత్త..


హోటల్ కి వెళ్లి చికెన్ ఐటమ్ ఆర్డర్ ఇస్తే కాస్త ఆలస్యంగా అయినా వేడి వేడి చికెన్ తెచ్చి వడ్డిస్తారు. ఈ వేడి చికెన్ టేస్ట్ మనం పెద్దగా గమనించలేకపోవచ్చు. వేడివేడిగా ఆరగించేస్తాం కాబట్టి తేడా తెలియదు. అయితే దానివల్ల ఫుడ్ పాయిజనింగ్ అయితే మాత్రం అప్పుడు ఇబ్బంది పడతాం. అందుకే సహజంగా హోటళ్లలో బోన్ లెస్ ఐటమ్ కంటే, బోన్ ఐటమ్ ఆర్డర్ చేయమని చెబుతుంటారు. చికెన్ కుళ్లిపోతే దానినుంచి ఎముకను తీసివేసి నిల్వ చేస్తుంటారు. బోన్ లెస్ చికెన్ అయితే కుళ్లినది వండి వడ్డించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకే బోన్ లెస్ ఆర్డర్ చేస్తే కుళ్లిన చికెన్ కి అవకాశం ఉండదని చెబుతుంటారు.