ఆస్తుల కోసం కనిపెంచిన తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టే దుర్మార్గులు భూమ్మీద చాలామందే ఉన్నారు. తల్లిదండ్రుల్ని హత్య చేసే దుర్మార్గులు కూడా అక్కడక్కడా ఉంటారు. అలాంటి వారిలో వీడు కూడా ఒకడు. అయితే ఇక్కడ ఆస్తికోసమో, వ్యసనాలకు బానిస కావడం వల్లో తల్లిని చంపలేదు. తాను జైలులో ఉండగా తనను కలిసేందుకు రాలేదన్న కక్ష మనసులో పెట్టుకుని ఉక్రోషంతో ఇంటికొచ్చిన తర్వాత తుదముట్టించాడు. దీనికితోడు తల్లి ప్రవర్తనపై కూడా అతడికి అనుమానం ఉంది. అందుకే ఆమె ప్రాణాలు తీశాడు. 


నవమాసాలు మోసిన తల్లినే అతి కిరాతకంగా హత్య చేశాడు నెల్లూరు నగరం చంద్రమౌళి నగర్ కి చెందిన లక్ష్మీశెట్టి సాయితేజ. గొంతు నులిమి.. ముఖంపై గాయాలు చేసి, గోళ్లతో రక్కి.. అతి దారుణంగా తల్లి లక్ష్మిని హత్య చేశాడు. ఈ ఘటన డిసెంబర్ 19న జరిగింది. అయితే ఆ రోజు ఎవరికీ అనుమానం రాకుండా తన తల్లిని ఎవరో హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను బయటికి వెళ్లానని, ఇంటికి తిరిగొచ్చిన తర్వాత తలుపు తీసి చూస్తే తల్లి శవమై మంచంపై పడి ఉందని పోలీసులకు చెప్పాడు. పైగా అనుమానితుల వివరాలు కూడా అందించాడు. దీంతో పోలీసులు అనుమానితుల జాబితా పట్టుకుని విచారణ మొదలు పెట్టారు. అయితే అసలు విషయం ఏంటంటే.. కొన్నిరోజుల క్రితమే ఓ హత్యాయత్నం కేసులో సాయితేజ రిమాండ్ కి వెళ్లి వచ్చాడు. అతడి నేర చరిత్రను కూడా గుర్తించిన పోలీసులు అతిపై కూడా నిఘా పెట్టారు.


విచారణలో భాగంగా పోలీసులు డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీం తో ఆధారాలు సేకరించి అన్ని కోణాల్లో దర్యాప్తు నిర్వహించారు. ఘటన జరిగిన రోజు డాగ్‌స్క్వాడ్‌ నేరుగా మృతురాలి కుమారుడి వద్దకు వెళ్లడం, అతని చేతికి గాయాలుండటంతో పోలీసులు అనుమానించారు. ఆ తర్వాత తమదైన శైలిలో విచారణ మొదలు పెట్టారు. చివరకు అతడు తన నేరం అంగీకరించాడు. 


తల్లిని చంపింది ఎందుకంటే..?
లక్ష్మీశెట్టి సాయితేజ గతంలో ఓ హత్యాయత్నం కేసులో జైలుకెళ్లాడు. ఆ సమయంలో తనను చూసేందుకు తల్లి రాలేదని కోపం పెంచుకున్నాడు. జైలు నుంచి తిరిగొచ్చిన తర్వాత తన తల్లికి వేరే వ్యక్తుల నుంచి ఫోన్లు రావడంతో అనుమానం మొదలైంది. తల్లి గురించి తన స్నేహితులు చెడుగా మాట్లాడుతున్నారని బాధపడేవాడు. ఎలాగైనా ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో డిసెంబర్ 19న రాత్రి తల్లిని హత్య చేశాడు.


తనకేమీ తెలియదన్నట్టు పోలీసుల ముందు బుకాయించాడు. వేరే వారిపై అనుమానం వచ్చేలా వారి గురించి సమాచారమిచ్చాడు. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపారు. ఈ క్రమంలో సాయితేజ వీఆర్వో సమక్షంలో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కేసు వివరాలను రూరల్ డీఎస్పీ హరినాథ రెడ్డి తెలియజేశారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన వేదాయపాలెం ఇన్‌ స్పెక్టర్‌ నరసింహారావు, సిబ్బందిని ఆయన అభినందించారు. 



Also Read: Gold-Silver Price: గుడ్‌న్యూస్! నేడు మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. మీ ప్రాంతంలో తాజా ధరలు ఇవీ..


Also Read: Petrol-Diesel Price, 11 January: నేడు ఈ నగరాల్లో పెరిగిన ఇంధన రేట్లు, ఇక్కడ మాత్రం స్థిరంగా.. ఇవాల్టి ధరలు ఇవీ..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి