Nellore Mayor Potluri Sravanthi: నెల్లూరు నగర కార్పొరేషన్లో సోమవారం జరిగిన కౌన్సిల్ సమావేశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కార్పొరేషన్ హాల్ లో సీఎం వైఎస్ జగన్ ఫొటోపై రగడ జరిగింది. ఆ ఫొటో అక్కడ ఎవరు పెట్టారంటూ మేయర్ ప్రశ్నించడంతో గొడవ మొదలైంది. తనకి కూడా అక్కడ జగన్ ఫొటో ఉండటం ఇష్టమేనని అంటున్న ఆమె, అనుకోకుండా ఆ ప్రశ్న అడిగే సరికి అవతలి వర్గం రెచ్చిపోయింది. సీఎం జగన్ ఇచ్చిన బీ ఫామ్ తో గెలిచిన మేయర్ ఇప్పుడిలా మాట్లాడటమేంటని ప్రశ్నించారు వైరి వర్గం కార్పొరేటర్లు. మేయర్ రాజీనామా చేయాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కౌన్సిల్ సమావేశం కాస్తా జగన్ ఫొటో వ్యవహారం తెరపైకి రాగానే మేయర్ వర్సెస్ కార్పొరేటర్లు అన్నట్టుగా మారిపోయింది.
మేయర్ ఏమన్నారనే విషయం పక్కనపెడితే, మేయర్ కి జరిగిన అవమానంపై మాత్రం సర్వత్రా విమర్శలు వినపడుతున్నాయి. మహిళా మేయర్ ని కొంతమంది కార్పొరేటర్లు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. బలవంతంగా ఆమెను లాగేశారు. ఈ క్రమంలో తన చీర కూడా చినిగిపోయే పరిస్థితి వచ్చిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కూడా వైరి వర్గం కార్పొరేటర్లు రాద్ధాంతం చేశారు. మేయర్ అబద్ధాలాడుతున్నారని మండిపడ్డారు.
నెల్లూరు నగర కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో కొంతమంది కార్పొరేటర్లు దౌర్జన్యం చేయడంతో తన చీర చిరిగిపోయే పరిస్థితి వచ్చిందని, వారు తనని అవమానించాలని చూశారంటూ ఆరోపించారు మేయర్ పొట్లూరి స్రవంతి. ఆమెను అవమానానికి గురి చేయాలనుకున్నవారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెల్లూరు లోని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మేయర్ స్రవంతి. ఆమెకు రశీదు ఇవ్వడానికి పోలీసులు తటపటాయించారు. చివరకు ఎస్టీ నాయకులంతా కలసి పోలీస్ స్టేషన్ కి వచ్చి ఆందోళన చేయడంతో పోలీసులు రశీదు ఇచ్చారు. మీడియాతో మాట్లాడిన మేయర్ తనకు జరిగిన అవమానాన్ని వివరించారు. కనీసం మహిళను అని కూడా చూడకుండా దౌర్జన్యంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్టీ కమిషన్ కి ఫిర్యాదు చేస్తానని, రాష్ట్రపతికి లేఖ రాస్తానని తెలిపారు. ఈ వ్యవహారంపై మంగళవారం ఆమె నేరుగా జిల్లా ఎస్పీని కలసి ఫిర్యాదు ఇవ్వడానికి సిద్ధమయ్యారు.
ఎందుకీ వివాదం..?
నెల్లూరు జిల్లా రాజకీయాలే ఇప్పుడు కార్పొరేషన్లో ప్రతిబింబించాయి. కార్పొరేషన్లో అందరూ వైసీపీ తరపున గెలిచిన కార్పొరేటర్లే. మేయర్, డిప్యూటీ మేయర్ అన్ని పదవులకు ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. మేయర్ గా రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ప్రతిపాదించిన పొట్లూరి స్రవంతిని ఎన్నుకున్నారు. డిప్యూటీ మేయర్ పదవుల్లో ఒకటి సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ బాబాయి రుప్ కుమార్ యాదవ్ కి ఇచ్చారు. అక్కడితో లెక్క సరిపోయింది. అయితే ఆ తర్వాత రూప్ కుమార్ సొంత కుంపటి పెట్టుకోవడంతో కార్పొరేషన్లో అనిల్ పెత్తనం తగ్గింది.
ఇక రూరల్ విషయానికొచ్చే సరికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీకి దూరం జరిగారు. దీంతో కొంతమంది కార్పొరేటర్లు ఆయన దగ్గరకు వెళ్లారు. వారిలో మేయర్ కూడా ఉన్నారు. మేయర్ శ్రీధర్ రెడ్డి వర్గం అనే ముద్ర బలంగా పడిపోయింది. మరికొందరు ఆదాల వర్గంలో చేరారు. ఇలా కార్పొరేటర్ల మధ్య కుమ్ములాట మొదలైంది. మిగతావాళ్లంతా కలసి మేయర్ ని టార్గెట్ చేశారు. దీంతో ఆమె ఒంటరిగా మిగిలారు. ఆమెకు మద్దతిచ్చే కార్పొరేటర్లతో కలసి ఈరోజు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. రాజకీయ అజెండాలో భాగంగానే తనను అవమానించారంటూ ఆమె మండిపడ్డారు.