నెల్లూరు కలెక్టరేట్ ప్రాంగణంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈరోజు స్పందన కార్యక్రమం ఉండటంతో ప్రజలు పెద్ద ఎత్తున కలెక్టరేట్ కి తరలి వచ్చారు. వివిధ విభాగాల్లో అర్జీలు ఇచ్చారు. సడన్ గా కలెక్టరేట్ ముందు ఓ దివ్యాంగుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకోబోయాడు. ఆ విషయం గమనించిన కల కలెక్టరేట్ సిబ్బంది, పోలీసులు అతడిని అడ్డుకున్నారు. వెంటనే 108లో ఆస్పత్రికి తరలించారు. తన పేరు హేమంత్ కుమార్ అని, శ్రీచైతన్య కాలేజీ రామలింగాపురం బ్రాంచ్ ఇన్ చార్జ్ గా పనిచేస్తున్నానని, జీతాలు సరిగా ఇవ్వకుండా యాజమాన్యం వేధిస్తోందని, కాలేజీ డీన్ కూడా తనను వేధిస్తున్నాడంటూ చెప్పాడు ఆ యువకుడు. గత్యంతరం లేక తాను కలెక్టరేట్ వద్ద ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్టు చెప్పాడు. 




ఆరా తీస్తున్న పోలీసులు..
హేమంత్ కుమార్ టీపీ గూడూరు నివాసి అని తేల్చారు పోలీసులు. శ్రీచైతన్య కాలేజీలో పనిచేసేవాడని గుర్తించారు. అయితే శ్రీచైతన్య కాలేజీ డీన్, యాజమాన్యంపై హేమంత్ తీవ్ర ఆరోపణలు చేశాడు. డీన్ తనను మానసికంగా వేధిస్తున్నాడని చెప్పాడు. డీన్ వ్యవహార శైలితో తాము ఉద్యోగాలు చేయలేకపోతున్నామని అన్నాడు. అదే సమయంలో నాలుగున్నరేళ్లుగా ఉద్యోగం చేస్తున్నా జీతాలివ్వడంలేదంటూ ఆరోపణలు చేశాడు హేమంత్. ఆయన ఆరోపణలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. 


నెల్లూరు కలెక్టరేట్ వద్ద గతంలో కూడా చాలామంది ఆత్మహత్యాయత్నం చేసిన ఉదాహరణలున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎవరూ చనిపోలేదు. స్పందన కార్యక్రమంకి వచ్చే బాధితులు అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసిగి వేసారిపోయి ఉంటారు. కొంతమంది ఏళ్లతరబడి తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటారు. అలాంటివారు ఆత్మహత్యాయత్నం చేశారంటే వారి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రైవేటు సంస్థ జీతం ఇవ్వకపోతే దానికి కలెక్టరేట్ లో ఉన్నవారు ఎలాంటి సహాయం చేస్తారనేది తేలాల్సి ఉంది. హేమంత్ నిజంగానే జీతం కోసం ఆత్మహత్యాయత్నం చేశారా..? లేక ఇతర కారణాలున్నాయా అని ఆరా తీస్తున్నారు పోలీసులు. 


ప్రస్తుతం హేమంత్ ని నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని మానసిక పరిస్థితిని డాక్టర్లు అంచనా వేస్తున్నారు. గతంలో కూడా నెల్లూరు కలెక్టరేట్ ఎదుట వంశీకృష్ణ అనే యువకుడు బ్లేడుతో మణికట్టు దగ్గర గాయం చేసుకుని ఆత్మహత్య చేసుకోబోయాడు. తన తల్లిదండ్రులిద్దరూ తహశీల్దార్లుగా పనిచేసి రిటైర్ అయ్యారని, తన తల్లి కలెక్టరేట్ కి వచ్చినప్పుడు ఎవరో ఆమెను అవమానించారని, అందుకే తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు చెప్పాడు. తన తల్లికి ఎక్కడ అవమానం జరిగిందో అక్కడే ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు చెప్పాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అతడిని ఆస్పత్రికి తరలించారు. అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని తేల్చారు. ఇప్పుడు హేమంత్ కుమార్ కూడా కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యా యత్నం చేయడంతో కలకలం రేగింది. అతడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారమిచ్చారు. విచారణ మొదలు పెట్టారు.  నెల్లూరు కలెక్టరేట్ ఎదుటే ఈ ఘటన జరగడంతో కలెక్టరేట్ సిబ్బంది షాకయ్యారు. అక్కడి దుకాణదారులు కూడా ఒక్కసారిగా పరుగులు తీశారు. పక్కన ఉన్నవారు వెంటనే స్పందించడంతో ప్రమాదం తప్పింది.