నెల్లూరు నగర కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. కార్పొరేషన్ సమావేశ మందిరంలో సీఎం జగన్ ఫొటో ఉంచడంపై కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం జరిగింది. సభ్యులతో చర్చించి ఫొటోపై నిర్ణయం తీసుకుంటామన్నారు మేయర్ స్రవంతి. అయితే మిగతా కార్పొరేటర్లు పోడియం వద్దకు దూసుకొచ్చి ఆమెతో వాగ్వాదానికి దిగారు. కొంతసేపు తీవ్ర గందరగోళం నెలకొంది. 


మేయర్ బయటకు వెళ్లకుండా..
కార్పొరేషన్ సమావేశంలో గొడవ జరగడంతో వాయిదా వేసి మేయర్ స్రవంతి బయటకు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఆమెకు వ్యతిరేకంగా కొంతమంది కార్పొరేటర్లు దారికి అడ్డుగా నిలిచారు. ఆమెను బయటకు వెళ్లనివ్వకుండా అడ్డుపడ్డారు. అక్కడే బైఠాయించారు. పోలీసుల సాయంతో ఆమె బయటకు వెళ్లేందుకు ప్రయత్నించినా వీలు కాలేదు. చివరకు కార్పొరేషన్ సమావేశ మందిరంలో సీఎం జగన్ ఫొటో ఉంచేందుకు తనకేమీ అభ్యంతరం లేదని ఆమె సభ్యులకు చెప్పి తర్వాత బయటకు వెళ్లారు. 




నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని వైసీపీ సస్పెండ్ చేయడంతో ఆయనకు కొంతమంది కార్పొరేటర్లు మద్దతు తెలుపుతూ వైసీపీకి దూరం జరిగారు. నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి కూడా కోటంరెడ్డి వర్గంలో ఉన్నారు. దీంతో ఆమెను ఆదాల, అనిల్ వర్గం కార్పొరేటర్లు టార్గెట్ చేశారు. కార్పొరేషన్ సమావేశాల సమయంలో ఆందోళనలకు దిగుతున్నారు. తాజాగా సీఎం జగన్ ఫొటో కోసం గొడవ చేశారు. ఆ వ్యవహారం చినికి చినికి గాలివానలా మారడంతో చివరకు వాదోపవాదాలు జరిగాయి. అజెండా పేపర్లను కొంతమంది చించి పైకి ఎగరేశారు. తనపై కొంతమంది దాడి చేయడానికి ప్రయత్నించారని, గిరిజన మహిళను అవమానించడం సరికాదని మేయర్ స్రవంతి ఉద్వేగానికి లోనయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు. 


సమావేశాలు జరగడం కష్టమేనా..?
నెల్లూరు కార్పొరేషన్లో సగం సీట్లు రూరల్ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి, సగం సిటీలోకి వెళ్తాయి. మేయర్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్ కావడంతో రూరల్ నియోజకవర్గంలోని రిజర్వ్ సీటులో పోటీ చేసిన పొట్లూరి స్రవంతి మేయర్ గా ఎన్నికయ్యారు. మేయర్ దంపతులు మొదటినుంచీ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచర వర్గంగా ఉండేవారు. కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల సమయంలోనూ మేయర్ ఆయన వైపే ఉన్నారు. ఆ తర్వాత మేయర్ వర్గంలో ఉన్న కొంతమంది కార్పొరేటర్లు క్రమక్రమంగా ఆదాల గ్రూపులోకి వెళ్లారు. దీంతో నెల్లూరు కార్పొరేషన్లో ప్రస్తుతం నాలుగు గ్రూపులు తయారయ్యాయి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్గం, ఎంపీ ఆదాల వర్గం, సిటీ ఎమ్మెల్యే అనిల్ వర్గం, అనిల్ కి వ్యతిరేకంగా వైసీపీలోనే ఉన్న డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ వర్గం. ఇలా ఈ నాలుగు వర్గాలు కార్పొరేషన్లో ఉన్నాయి. అయితే మూడు వర్గాలకు తమలో తమకు పడకపోయినా.. వైసీపీలోనే ఉన్నాయి కాబట్టి.. కామన్ గా మేయర్ ని వ్యతిరేకిస్తున్నారు. 


నెల్లూరు రాజకీయ సమీకరణాలు మారిన తర్వాత ఇప్పటికి మూడుసార్లు కార్పొరేషన్ మీటింగుల్లో గొడవలు జరిగాయి. ఇకపై కూడా మీటింగ్ లు ప్రశాంతంగా సాగుతాయనే అంచనాలు లేవు. ప్రస్తుతం నగరంలో నాయకులంతా సైలెంట్ గానే ఉన్నా.. అధికారిక మీటింగ్ ల సమయంలోనే బలప్రదర్శనకు దిగుతున్నారు. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.