నెల్లూరు జిల్లాలో మాస్క్ నిబంధన మళ్లీ తెరపైకి తెచ్చారు అధికారులు. ఇటీవల జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సహా స్పందనకు వచ్చినవారందరూ మాస్క్ లు ధరించి కనిపించారు. మాస్క్ లేనిదే కలెక్టరేట్ లోకి ఎంట్రీ లేదన్నారు అధికారులు. కచ్చితంగా మాస్క్ ధరించి రావాలని చెప్పారు. జిల్లాలో వైరల్ ఫీవర్లు పెరగడం, ఫ్లూ లక్షణాలతో కొంతమంది ఆస్పత్రుల్లో చేరడంతో కలెక్టర్ చక్రధర్ బాబు కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


కలెక్టరేట్ సహా ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగిన స్పందన కార్యక్రమాల్లో అధికారులంతా మాస్క్ లతో కనిపించారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా మాస్క్ లు ధరించి వచ్చారు. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో శానిటైజర్ల వినియోగం కూడా పెరిగింది.


కరోనా భయం తగ్గినట్టే తగ్గి మళ్లీ మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ప్లూ జ్వరాల బాధితులు ఎక్కువయ్యారు. ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య కూడా పెరిగింది. H3N2 వైరస్ కూడా అక్కడక్కడా బయటపడుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తత ప్రకటించింది. ఇటు రాష్ట్రంలో కూడా ఫీవర్ సర్వే మొదలు పెట్టారు అధికారులు. ఇంటింటికీ వెళ్లి జ్వరపీడితుల వివరాలు సేకరిస్తున్నారు.


దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల్లో పెద్దగా పెరుగుదల లేకపోయినా కొత్తగా వైరస్ బారిన పడుతున్నవారి సంఖ్య మాత్రం పెరుగుతోంది. దీంతో కేంద్రం కూడా మార్గదర్శకాలు విడుదల చేసింది. వైరల్ ఫీవర్లను తేలిగ్గా తీసుకోవద్దని ఆస్పత్రుల్లో చేరి చికిత్స తీసుకోవాలని సూచిస్తోంది. వైరల్ ఫీవర్లకు వాడాల్సిన మందుల వివరాలపై కూడా కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.




మళ్లీ ఆంక్షలు మొదలవుతాయా..?


ప్రస్తుతానికి కరోనా కేసుల్లో భారీ పెరుగుదల లేకపోవడంతో ఆంక్షలు విధించే అవకాశాలు చాలా తక్కువ అంటున్నారు. అయితే ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం అలర్ట్ గా ఉంటున్నాయి. తమిళనాడులో కూడా మాస్క్ నిబంధన తెరపైకి తెచ్చారు. ఇటు ఏపీలో అన్ని జిల్లాల్లో మాస్క్ నిబంధన లేకపోయినా నెల్లూరు మాత్రం అలర్ట్ అయింది. తమిళనాడుకు దగ్గరగా ఉన్న ప్రాంతం కావడంతో నెల్లూరు జిల్లాలో అధికారులు అప్రమత్తం అయ్యారు. జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సూచనలతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలలో అవగాహన కల్పిస్తున్నారు. అవగాహనలో భాగంగా జిల్లాలో మాస్క్ నిబంధన తెరపైకి తెచ్చారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించాల్సిందేనంటున్నారు. అయితే ఎక్కడా జరిమానాల ప్రస్తావన తేవడంలేదు. ప్రజలు కూడా స్వచ్ఛందంగానే మాస్క్ లు ధరించి బయటకు వస్తున్నారు. షాపింగ్ మాల్స్ లో కూడా మాస్క్ నిబంధన అమలు చేస్తున్నారు. 


జిల్లాలో ఫ్లూ లక్షణాలు లేవు..


జిల్లాలో ప్లూ లక్షణాలు లేవని, అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు DMHO డాక్టర్‌ ఎం.పెంచలయ్య. ఇమ్యూనైజేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేశామని చెప్పారు. ప్రస్తుత సీజన్‌ లో జలుబు, దగ్గు వారం, పదిరోజుల ఉంటుందని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే నయం అవుతుందన్నారు DMHO. వేసవిలో మజ్జిగ, నీరు, ఓఆర్‌ఎస్‌ ఫ్యాకెట్లు అధికంగా తీసుకుంటూ ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండబారిన పడకుండా ఉండాలన్నారు.