ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి రాజ్యసభ సీట్లు 18. విభజన తర్వాత ఏపీకి 11 సీట్లు లభించాయి. అప్పుడూ, ఇప్పుడూ ఎప్పుడూ ఎవరో ఒకరు నాన్ లోకల్ నాయకులు ఏపీనుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తూనే ఉన్నారు. గతంలో టీడీపీ హయాంలో బీజేపీ నేత సురేష్ ప్రభుకి అవకాశం లభించింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక వ్యాపార వేత్త పరిమళ్ నత్వానీకి ఆ ఛాన్స్ వరించింది. అయితే లోకల్, నాన్ లోకల్ ఎవరి రాజకీయాలు ఎలా ఉన్నా.. రాజ్యసభ సీట్లలో మాత్రం నెల్లూరు జిల్లాకు లక్కీ ఛాన్స్ లభిస్తూనే ఉంది. జిల్లాలవారీగా లెక్క తీస్తే.. ఒక జిల్లాకి ఒక రాజ్యసభ సీటు దొరకడం కూడా కష్టం. అలాంటిది ఏకంగా నెల్లూరు జిల్లాకు మూడు రాజ్యసభ స్థానాలు దక్కబోతుండటం మాత్రం నిజంగానే విశేషం.
ప్రస్తుతం 2.. ఇకపై 3..
ప్రస్తుతం ఏపీ తరపున రాజ్యసభలో ఉన్న ఎంపీల్లో ఇద్దరు నెల్లూరు జిల్లావారే ఉన్నారు. విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇద్దరూ నెల్లూరు నాయకులే. ఇక కొత్తగా ఇప్పుడు బీదా మస్తాన్ రావు వైసీపీ తరపున రాజ్యసభకు ఎంపికయ్యే అవకాశముంది. ఆయన ఎంపిక కూడా లాంఛనం అయితే అప్పుడు ముగ్గురు నాయకులు నెల్లూరు జిల్లానుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టవుతుంది. విజయసాయిరెడ్డి పదవీకాలం ముగుస్తున్నా.. ఆయనకు మరోసారి కొనసాగింపు అనేది లాంఛనమేనంటున్నారు.
జూన్ 21తేదీతో నలుగురు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయబోతున్నారు. విజయసాయిరెడ్డి, సురేష్ ప్రభు, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్.. వీరంతా రిటైర్ అవుతున్నారు. ప్రస్తుతం సురేష్ ప్రభు, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ బీజేపీ నాయకులుగా ఉన్నారు. అయితే వీరిలో సుజనా, టీజీ ఇద్దరికీ టీడీపీ సపోర్ట్ తో రాజ్యసభ సభ్యత్వం లభించింది. పార్టీలు ఏవయినా ఇప్పుడు ఖాళీ అవుతున్న నాలుగు స్థానాలు తిరిగి అధికార వైసీపీకే దఖలు పడతాయి. నాలుగు సీట్లలో వైసీపీ మద్దతుదారులే విజయం సాధిస్తారని అంటున్నారు. అయితే ఇందులో విజయసాయిరెడ్డి సీటు తిరిగి ఆయనకే ఇస్తున్నారు. మిగతా మూడు స్థానాల్లో ఒకటి అదానీ ఫ్యామిలీకి వెళ్తుందనే ప్రచారం ఉంది. ఇంకో సీటు నెల్లూరుకి చెందిన బీదా మస్తాన్ రావుకి కేటాయిస్తారని తెలుస్తోంది.
బీదా మస్తాన్ రావు 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున నెల్లూరు ఎంపీ సీటుకి పోటీ చేశారు. అయితే వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి అక్కడినుంచి గెలుపొందడంతో.. ఫలితాల తర్వాత పెద్ద గ్యాప్ లేకుండా బీదా పార్టీ మారారు. ప్రస్తుతం బీదా మస్తాన్ రావు సోదరుడు బీదా రవిచంద్ర టీడీపీలో జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్నారు. మస్తాన్ రావు మాత్రం వైసీపీలో చేరారు. చేరిక సమయంలోనే ఆయన రాజ్యసభ హామీ పొందారని, ఇప్పుడది సాకారమవుతుందని అంటున్నారు. మస్తాన్ రావుకి రాజ్యసభ ఖాయమైతే.. మొత్తం నెల్లూరు నుంచి ముగ్గురు నాయకులు పెద్దల సభలో కూర్చున్నట్టు అవుతుంది. ఒకరకంగా ఇది నెల్లూరుకి గర్వకారణమేనని చెప్పాలి.