Nellore News : యూట్యూబ్ ఛానెళ్లపై మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. తప్పుడు రాతలు రాయొద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిచ్చి పిచ్చిగా రాస్తే తనకూ నలుగురు అభిమానులు ఉన్నారని, వాళ్లు తట్టుకోలేరని హెచ్చరించారు. ఆ తర్వాత తనపై ఆరోపణలు చేయాల్సి వస్తుందన్నారు. తప్పు ఉంటే వేలెత్తి చూపించాలని, ఎక్కడెక్కడివో పాత వీడియోలు యూట్యూబ్ లో పెట్టి విమర్శిస్తారా అంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రెస్ ముసుగులో బెదిరింపులు, బ్లాక్ మెయిళ్లకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమన్నారు. అక్రిడేషన్ లేని వాళ్లు, విశ్లేషకుల ముసుగులో పిచ్చికూతలు కూస్తున్నారని మండిపడ్డారు.
నా అభిమానులు ఏదైనా చెయ్యొచ్చు
"కాబట్టి చెబుతున్నా, కామ్ గా ఉన్నా మీ యూట్యూబ్ ఛానెళ్లు ఎక్కడో హైదరాబాద్ లో కూర్చొని ఉన్నాం కదా అని తప్పుడు వార్తలు రాస్తే, అక్కడి రావడానికి ఎంతో సమయం పట్టదు. ఏదైనా తప్పు చేస్తే రాయండి. ఏదైనా ఉంటే నిజం రాయండి. ఎక్కడెక్కడివో రాసి, పాత వీడియోలు తీసి తప్పుడు రాస్తే మాత్రం నా అభిమానాలు చూస్తూ ఊరుకోరు. ఎంట్రా వీడు రోజు నా అనిల్ పై తప్పుడు రాతలు రాస్తున్నాడని దాడి చెయ్యొచ్చు. ఆ తర్వాత ఎలాగో అనిల్ కుమార్ దాడి చెయ్యించాడని రాస్తారు. మరి జాగ్రత్తగా రాయండి" అని యూట్యూబ్ ఛానళ్లకు ఎమ్మెల్యే అనిల్ కుమార్ వార్నింగ్ ఇచ్చారు.
చంద్రబాబుకు ఆ ఛాన్సే లేదు
టీడీపీ అధినేత చంద్రబాబు ఇక సీఎం అయ్యే ఛాన్సే లేదని మాజీ మంత్రి అనిల్ కుమార్ అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నెల్లూరు వెంకటేశ్వరపురంలో అనిల్ కుమార్ యాదవ్ పర్యటించారు. అనిల్ యాదవ్ మాట్లాడుతూ సీఎం జగన్ ను నేరుగా ఎదుర్కోలేక చంద్రబాబు, పవన్ కల్యాణ్ పొత్తుల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు పొత్తులు పెట్టుకుంటారో, కలిసుంటారో, పెళ్లి చేసుకుంటారో తమకు అనవసరమన్నారు. ఎవరు, ఎవరితో పొత్తులు పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు. అయితే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు వారి మీద వారికే నమ్మకం లేదన్నారు. విపక్షాలు పొత్తుల గురించి మాట్లాడుతున్నారంటే వైసీపీ ఎంత బలంగా ఉందో అర్థం అవుతోందని అనిల్ యాదవ్ అన్నారు. జగన్ అంటే ప్రతిపక్షాలు భయపడుతున్నాయని అర్థమవుతోందన్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో విపక్షాలకు భయం పట్టుకుందన్నారు. ఎప్పుడో జరిగిన ఘటనలను ఇప్పుడు వైరల్ చేస్తూ కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల అమలుతో ప్రజల మనసులో సీఎం జగన్ చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఎంత మంది కలిసి వచ్చినా వైసీపీకి ఎలాంటి నష్టం లేదన్నారు.