Nellore GGH Deaths Issue: నెల్లూరు ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఒకే రోజు ఆరుగురు మృతి చెందడం సంచలనంగా మారింది. అది కూడా అందరూ MICU లో ఉన్న పేషెంట్స్ కావడంతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ అయింది. శుక్రవారం ప్రభుత్వ ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాదాపు రెండు గంటలసేపు విద్యుత్తు సరఫరా లేకపోవడంతో ఆక్సిజన్ అందక ఒకే సమయంలో ఆరుగురు రోగులు చనిపోయారని వార్త బయటకు వచ్చింది. దీంతో వెంటనే ఆస్పత్రి వర్గాలు రంగంలోకి దిగాయి.
కరెంటు సరఫరాకు ఆక్సిజన్ కు సంబంధమే లేదన్న ఆస్పత్రి..
ఆక్సిజన్ అందక రోగులు చనిపోయారన్న వార్త అవాస్తవం అంటూ వారు వివరణ ఇచ్చారు. అసలు కరెంటు సరఫరాకు ఆక్సిజన్ కు సంబంధమే లేదన్నారు ఆస్పత్రి సూపరింటెండెంట్. వెంటిలేటర్ పై ఉన్న వారికి మాత్రమే కరెంటు సరఫరా అవసరం ఉంటుందని.. చనిపోయిన ఆరుగురు రోగులు వెంటిలేటర్ పై ఎవరూ లేరన్నారు. కరెంటు లేక.. వెంటిలేటర్ పై ఉన్నవారు చనిపోయి ఉంటే అందరూ ఒకే సమయంలో చనిపోయి ఉంటారని, కానీ ఇక్కడ అలా జరగలేదన్నారు. ఉదయం 7.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వేర్వేరు సమయాల్లో వేర్వేరు రోగులు చనిపోయారని సూపరింటెండెంట్ తెలిపారు.
గత 3 నుంచి 5 రోజులుగా చికిత్స..
నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో ఆక్సిజన్ అందక రోగులు చనిపోవడం అవాస్తవం అని, వదంతులు వ్యాప్తి చేయవద్దని ఆసుపత్రి సూపరంటెండెంట్ సిద్దా నాయక్ సూచించారు. చనిపోయినవారు పిల్లలు కాదని.. పెద్ద వయసు వారు, దీర్ఘ కాలిక రోగులు అని మరోసారి స్పష్టం చేశారు. వీరంతా గత 3 నుంచి 5 రోజులుగా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్లు అని తెలిపారు. ఆరు మంది ఒకేసారి చనిపోవడం వాస్తవం కాదని, ఎవరూ వదంతులు నమ్మవద్దు అని చెప్పారు.
లిక్విడ్ ఆక్సిజన్ అందుబాటులో ఉంది..
కరెంటు సరఫరా లేకపోవడంతో ఆక్సిజన్ సరఫరా అందక చనిపోవడం నిజం కాదని చెప్పారు. ఈ పేషెంట్లు ఎవరూ వెంటిలేటర్ మీద లేరు. మేం లిక్విడ్ ఆక్సిజన్ అందిస్తున్నాం. అయితే దీనికి విద్యుత్ సరఫరా అవసరమే లేదని పేర్కొన్నారు. చెన్నై సంస్థకు నగదు చెల్లిస్తున్నామని, ఎప్పటికప్పుడూ లిక్విడ్ ఆక్సిజన్ వస్తుందని వదంతులకు చెక్ పెట్టారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వంపై, నెల్లూరు జీజీహెచ్ పై దుష్ప్రచారం చేస్తున్నారని వివరణ ఇచ్చారు.
సిలిండర్ లేకపోయినా మూడు రకాల ఆక్సిజన్ సరఫరా అందుబాటులో ఉందని ఓ ముఖ్య అధికారి తెలిపారు. ఈ హాస్పిటల్ ఏపీలో ఉన్న హాస్పిటల్స్ లోనే మోడల్ హాస్పిటల్ అని, జీవో 51 ప్రకారం ఇన్ పేషెంట్ విభాగం గానీ, ఓపీ గానీ, మెడికల్ కాలేజీ, పల్మనాలజీ, రెడియాలజీ సహా ఇతర విభాగాలు ఇతర కాలేజీల కంటే ఇక్కడ ఎక్స్ ట్రా డిపార్ట్ మెంట్లు ఉన్నాయని చెబుతున్నారు. మెడిసిన్ కొరత ఉండదు, సిబ్బందికి సైతం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో కొరత లేదని స్పష్టం చేశారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial