Nellore Doctor Bribe: పోస్ట్ మార్టం చేసినందుకు డబ్బులు డిమాండ్ చేసిన ఓ ప్రభుత్వ డాక్టర్ చివరకు సస్పెండ్ అయ్యాడు. నిరుపేదల దగ్గర కూడా బలవంతంగా డబ్బులు వసూలు చేసినందుకు చివరకు విధులకు దూరమయ్యాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జరిగింది. ఉదయగిరి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు సంధాని భాషా వ్యవహారంపై జిల్లా కలెక్టర్ విచారణ జరిపి సస్పెన్షన్ వేటు వేశారు. 


అసలేం జరిగింది..?
పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండలం రాయకుంట గ్రామానికి చెందిన ఇరకం ముదిరాజు (27), భార్య మునీశ్వరి వలస కూలీలు. వారికి ఇద్దరు పిల్లలు. పిల్లలతో కలసి వారు పొట్టకూటికోసం నెల్లూరు జిల్లాకు వలస వచ్చారు. వరికుంటపాడు మండలం తూర్పుకొండారెడ్డిపల్లికి చెందిన ఓ రైతు పొలంలో నెల జీతానికి కుదిరారు. కుటుంబపోషణ కోసం ముదిరాజు గతంలో అప్పులు చేశాడు. అయితే ఆ అప్పులు తీర్చలేనేమోనన్న భయంతో అతను వరికుంటపాడులోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య కావడంతో పోస్ట్ మార్టం చేయాల్సి వచ్చింది. శవాన్ని ఉదయగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే డాక్టర్ సంధాని భాషా కాసులకు కక్కుర్తి పడ్డాడు. నిరుపేదలం, డబ్బులివ్వలేం అని వేడుకుంటున్నా కూడా ముదిరాజు భార్యని పోస్ట్ మార్టం చేసినందుకు డబ్బులు డిమాండ్ చేశాడు. తనకి 15వేల రూపాయలు, అటెండర్ కి వెయ్యి రూపాయలు ఇస్తేనే శవాన్ని అప్పగిస్తామన్నాడు. 


నిరుపేద కుటుంబం, డాక్టర్ వ్యవహారంపై ఎవరికీ ఫిర్యాదు చేసేంత అవగాహన ఆమెకు లేదు. దీంతో ఆమె ఊరిలోని తమ బంధువులకు ఫోన్ చేసింది. డబ్బులు కట్టనిదే డాక్టర్ భర్త మృతదేహానికి పోస్ట్ మార్టం చేయనంటున్నాడని వివరించింది. అక్కడి వారు కొంత ఆర్థిక సాయం చేశారు. ఆ డబ్బులు తీసుకొచ్చి ముదిరాజు భార్య మునీశ్వరి డాక్టర్ చేతిలో పెట్టింది. అయితే డాక్టర్ విషయం అప్పటికే స్థానికంగా సంచలనంగా మారింది. ఇలాంటి వ్యవహారాల్లో ఆరితేరారు కాబట్టి, స్థానికులు కూడా ఆయనపై నిఘా పెట్టారు. ఇప్పుడు మునీశ్వరి కుటుంబాన్ని డబ్బులకోసం వేధించడం, కనికరం లేకుండా పోస్ట్ మార్టం చేయబోనంటూ తిరస్కరించడంతో ఆ వ్యవహారాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. డాక్టర్ సంధాని భాషా లంచావతారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చివరకు జిల్లా అధికారులు రంగంలోకి దిగారు. విచారణ మొదలు పెట్టారు. రమేష్ నాథ్ ఆధ్వర్యంలో విచారణ జరిపి డాక్టర్ తప్పు ఉందంటూ నివేదిక ఇచ్చారు. వెంటనే జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు.. డాక్టర్ సంధాని భాషాని సస్పెండ్ చేశారు. 


నిరుపేద కుటుంబం, కనీసం భర్త మృతదేహాన్ని సొంత ఊరికి కూడా తీసుకుపోలేని దైన్యం. ఈ క్రమంలో బాధితురాలుకి పోలీసులు, స్థానికులు సాయం చేశారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించే  స్థోమత ఆమెకు లేకపోవడంతో.. ఉదయగిరి సీఐ, వరికుంటపాడు పోలీస్‌ సిబ్బంది ప్రైవేటు అంబులెన్స్‌ ఏర్పాటు చేశారు. బాధితురాలికి 40వేల రూపాయలు ఆర్థిక సాయం చేశారు. ఆమెను సొంత ఊరికి పంపించి వేశారు.