జిల్లా ఎస్పీ ఆఫీస్ లకు చాలామంది బాధితులు వస్తుంటారు. సోమవారం స్పందన కార్యక్రమంలో తమ ఫిర్యాదులు ఇస్తుంటారు. మిగతా రోజుల్లో నేరుగా ఎస్పీని కలసి తమ బాధలు చెప్పుకుంటారు. అయితే బాధితులెవరైనా ఎస్పీ ఆఫీస్ లోకి వెళ్లి అక్కడ ఫిర్యాదులు ఇవ్వాల్సి ఉంటుంది. తమ బాధలను నేరుగా ఎస్పీకి చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ నెల్లూరు జిల్లా ఎస్పీ నేరుగా బాధితురాలి వద్దకు వచ్చారు. ఆటోలో ఉన్న దివ్యాంగురాలు అంతదూరం తనకోసం నడచి రాలేదని తెలుసుకుని ఎస్పీ విజయరావు నేరుగా ఆటో వద్దకు వచ్చారు. ఆమె సమస్య తెలుసుకుని ఒక్క ఫోన్ కాల్ తో పరిష్కరించారు.
చెముడుగుంటకు చెందిన బాధితురాలు అరుణ గతంలో ఓసారి ఎస్పీ ఆఫీస్ కి వచ్చి తన భర్తతో ఉన్న మనస్పర్థల విషయంలో ఫిర్యాదు చేశారు. ఆ క్రమంలో వెంటనే భార్యా భర్తలకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రస్తుతం వారిద్దరూ కలసే ఉంటున్నారు. అయితే ఇటీవల ఆమెకు మరో సమస్య వచ్చింది. ఆమె తండ్రి ఇటీవలే మరణించారు. అయితే తోబుట్టవులు తండ్రి ఆస్తిలో ఆమెకు వాటా ఇవ్వకుండా వేధిస్తున్నారు. తండ్రి బతికి ఉన్నప్పుడు తనకు ఆర్థిక సాయం చేస్తానని మాటిచ్చారని ఇప్పుడు తండ్రి చనిపోవడం ద్వారా వచ్చిన డబ్బులో తన వాటా తనకు ఇప్పించాలని ఆమె ఎస్పీని వేడుకున్నారు.
గతంలో బాధితురాలి సమస్యను పరిష్కరించిన ఎస్పీ విజయరావు, ఇప్పుడు ఆమె కుటుంబ సమస్యకు కూడా పరిష్కారం చూపించారు. ఆమె దివ్యాంగురాలు కావడంతో తనకోసం ఆఫీస్ కి వచ్చారన్న విషయం తెలుసుకుని నేరుగా పార్కింగ్ ఏరియాకు వెళ్లారు. ఆటోలో ఉన్న ఆమె కిందకు దిగుతానని చెప్పినా వద్దని వారించారు. ఆమె వద్ద ఫిర్యాదు తీసుకున్నారు. దివ్యాంగురాలు కావడంతో అరుణకు వెంటనే సాయం చేయాల్సిందిగా సంబంధిత పోలీస్ స్టేషన్ కి ఆయన ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు.
అరుణ కుటుంబ సభ్యులతో స్థానిక పోలీసులు వెంటనే మాట్లాడారు. ఆమె నేరుగా ఎస్పీని కలిశారని తెలియడంతో ఇక అన్యాయంగా ఆమె సొమ్ముని తమ వద్ద ఉంచుకోవడం కుదరదని వారు గ్రహించారు. వెంటనే ఆమెసొమ్ము ఆమెకు ఇస్తామని చెప్పారు. కుటుంబ సభ్యుల ద్వారా తనకు వచ్చిన సొమ్ముతో కాలి ఆపరేషన్ చేయించుకుంటానని చెప్పారు దివ్యాంగురాలు అరుణ. తన బాధ వినేందుకు ఆఫీస్ నుంచి పరుగు పరుగున వచ్చిన ఎస్పీ విజయరావుకి ఆమె ధన్యవాదాలు తెలిపారు. గతంలో తన భర్తకు కౌన్సెలింగ్ ఇచ్చి తమ కుటుంబం విడిపోకుండా కాపాడారని, ఇప్పుడు తన కాలి వైద్యానికి అవసరమైన సొమ్ము చేతికందేలా చేసి తనకు మరోసారి మేలు చేశారంటూ ఆమె ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు.