నెల్లూరు జిల్లా వైసీపీలో మరోసారి ఫ్లెక్సీ రాజకీయం మొదలైంది. ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నిర్వహించిన కార్యక్రమం కోసం వేసిన ఫ్లెక్సీలో జిల్లా మంత్రి ఫొటో మిస్ అయింది. మంత్రి కాకాణి వర్గం దీన్ని అవమానంగా భావిస్తోంది. ప్రొటోకాల్ పాటించలేదని రుసరుసలాడుతోంది. దీనిపై నాయకులెవరూ స్పందించలేదు.
అసలేం జరిగింది..?
నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో పెన్నా నదికి వరదలు వచ్చినపుడు నదికి ఆనుకుని ఉన్న కాలనీలు నీటమునుగుతాయి. ఈ నష్టం నివారించేందుకు పెన్నా నదికి పక్కనే రిటైనింగ్ వాల్ కట్టేందుకు నిర్ణయించారు. సుమారు 100కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది. ఈ రిటైనింగ్ వాల్ శంకుస్థాపన కార్యక్రమం కోసం జిల్లా ఇన్ చార్జి మంత్రి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వచ్చారు. ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తో కలసి ఆయన రిటైనింగ్ వాల్ శంకుస్థాపన చేశారు. జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాస్తవానికి 100 కోట్ల రూపాయల పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి జిల్లా మంత్రి కూడా ఈ కార్యక్రమానికి వచ్చే ఆనవాయితీ ఉంది. కానీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి విజయవాడలో ఉండటంతో ఆయన ఈ కార్యక్రమానికి రాలేదని చెబుతున్నారు. అయితే కనీసం మంత్రి ఫొటో అయినా ఫ్లెక్సీలో లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రిటైనింగ్ వాల్ శంకుస్థాపన కోసం వేసిన ఫ్లెక్సీలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సీఎం జగన్, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఫొటోలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ కాకాణి ఫొటో మిస్ అయిందని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎవరూ బయటపడలేదు కానీ, కాకాణి ఫొటో మిస్సైందన్న వార్త జిల్లాలో కలకలం రేపింది.
ఆమధ్య నెల్లూరు నగరంలో కాకాణి ఫ్లెక్సీలు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. మంత్రిగా కాకాణి జిల్లాకు వచ్చే రోజే, అనిల్ సిటీ పరిధిలో బహిరంగ సభ పెట్టారు. ఇలా కొంత వివాదం నడిచిన సంగతి తెలిసిందే. కాకాణి, అనిల్ ఇద్దరినీ సీఎం తాడేపల్లి పిలిపించి మాట్లాడారు. ఆ తర్వాత అనిల్ ఇంటికి కాకాణి వెళ్లడంతో పరిస్థితి సద్దుమణిగింది అనుకున్నారంతా. కానీ ఇప్పుడు కూడా ఫ్లెక్సీ రూపంలోనే వ్యవహారం బెడిసిందనే ప్రచారం జరుగుతోంది. శిలా ఫలకంలో కాకాణి పేరు ఉన్నా, ఫ్లెక్సీలో ఫొటో లేకపోవడంపై ఆయన అనుచరులు, అభిమానులు గుర్రుగా ఉన్నారు. అయితే ఇది ఇక్కడితో సద్దుమణుగుతుందా, దీనికి కొనసాగింపుగా ఇరు వర్గాల నుంచి ఏవైనా రెచ్చగొట్టే ప్రకటనలు వెలువడతాయా అనేది వేచి చూడాలి.