Attack on Nellore tdp leader with A Car: నెల్లూరు జిల్లాలో మరోసారి రాజకీయ వేడి మొదలైంది. నెల్లూరు సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్, నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిపై ఆయన కుమారుడి స్నేహితుడు రాజశేఖర్ రెడ్డి దాడి చేశాడు. ఉద్దేశపూర్వకంగా కారుని రివర్స్ లో స్పీడ్ గా డ్రైవ్ చేసి కోటంరెడ్డి కాలుకి గాయం చేశాడు. మద్యం మత్తులో అతను ఈ పని చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు చెబుతున్నారు వైద్యులు. ఆయన్ను స్థానిక అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


కోటంరెడ్డి ఇంటి వద్దే ఘటన.. 
కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి కుమారుడికి నాగవెంకట రాజశేఖర్ రెడ్డి స్నేహితుడు. ఈరోజు రాత్రి కోటంరెడ్డి ఇంటికి వచ్చిన రాజశేఖర్ రెడ్డి, ఆయన కుమారుడితో గొడవ పడ్డాడు. ఆ గొడవ పెద్దదిగా మారడంతో కోటంరెడ్డి జోక్యం చేసుకున్నారు. ఆయన రాజశేఖర్ రెడ్డిని మందలించారు. దీంతో అతడు తాగిన మైకంలో కోపంతో కారుని కోటంరెడ్డిపైకి పోనిచ్చాడు. కోటంరెడ్డి కాలుకి గాయమైంది. అతడిని ఆస్పత్రిలో చేర్పించారు.


నాయకుల పరామర్శ.... 
నెల్లూరు అపోలో ఆస్పత్రిలో చేరిన కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిని స్థానిక టీడీపీ నాయకులు పరామర్శించారు. నెల్లూరు డ్రగ్స్ కి అడ్డాగా మారిందని, గుట్కాలనుంచి, సింగిల్ నెంబర్ లాటరీల వరకు అన్నీ వైసీపీ నాయకుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయని అన్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్. వైసీపీ నాయకుల ఆగడాలు రోజు రోజుకీ పెచ్చుమీరిపోతున్నాయని, అధికార పార్టీ అండ చూసుకునే తమపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.


చంద్రబాబు పరామర్శ.. 
కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆరా తీశారు. కోటంరెడ్డిని తన సోదరుడిగా భావించే బాలకృష్ణ కూడా ఆయన కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. కోటంరెడ్డి భార్య సంధ్యను వారు ఫోన్ లో పరామర్శించారు. ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. దాడి ఘటన వెనుక రాజకీయ కోణం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. సిటీ నియోజకవర్గంలో క్రియాశీలకంగా ఉన్న సిటీ ఇంచార్జీ కోటంరెడ్డి పై దాడి జరగడం దారుణం అని అన్నారు చంద్రబాబు. ప్రజా ప్రతినిధుల పైనే దాడులు జరుగుతుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని బాలాజీ నగర్ పోలీసులను ఆయన ఆదేశించారు. ఆస్పత్రిలో ఉన్న బాలాజీ నగర్ ఎస్సై వేణుగోపాల్ తో చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. దాడి జరిగిన తీరును పోలీసుల ద్వారా ఆయన అడిగి తెలుసుకున్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని. ఈ ఘటనలో రాజకీయ కోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.


ప్రస్తుతం ఇదీ పరిస్థితి.. 
కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డికి కాలుకి తీవ్ర గాయమైంది. నాలుగు చోట్ల విరిగిందని, ఆపరేషన్ చెయ్యాలని డాక్టర్లు సూచించినట్టు ఆయన భార్య చెబుతున్నారు. ప్రస్తుతం ఆయనకు అపోలో ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.  టీడీపీ నేతలు ఆయనను పరామర్శించేందుకు ఆస్పత్రికి తరలి వస్తున్నారు.