ఆమెకు పెళ్లైంది, పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఓ యువకుడు ఆమెను ప్రేమించాడు. ఆమె కూడా అతనితో చనువుగా మెలిగింది. ఈ వ్యవహారం భర్తకు తెలిసి ఇంట్లో గొడవ జరిగింది. చివరికి పంచాయితీకి వ్యవహరం వెళ్లడం.. ఎక్కడివారక్కడ సైలెంట్ గా ఉండేందుకు నిర్ణయించుకున్నారు. భార్యా భర్తలిద్దరూ మకాం మార్చేశారు. కానీ ఆ యువకుడి మనసులోనుంచి ఆమె వెళ్లిపోలేదు. ఆమె జ్ఞాపకాలతో ఈమె వెంటే వెళ్లాడు. తీరా ఆమె ఊరిలో అతను శవమే తేలాడు. అతనిది హత్యా, ఆత్మహత్యా, లేక ప్రమాదమా.. అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. నెల్లూరు జిల్లా యువకుడు శ్రీకాకుళం జిల్లాలో శవమే తేలడం రెండు జిల్లాల్లోనూ కలకలంగా మారింది. 


ఈ ప్రేమకథ ఎలా మొదలైంది..?
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తామాడ గ్రామానికి చెందిన భార్యాభర్తలు స్థానికంగా ఉపాధి లేకపోవడంతో పిల్లలతో కలసి నెల్లూరు జిల్లాకు వలస వచ్చారు. ఇక్కడ తెలిసిన వారి సహాయంతో భర్త ఉపాధి వెదుక్కున్నాడు. ఇందుకూరుపేట మండలం గంగపట్నం పంచాయతి పల్లెపాలెంలోని రొయ్యల చెరువు వద్ద కాపలాకి వచ్చారు. ఆ క్రమంలో స్థానిక యువకుడు పొన్నవాడ నరేంద్ర(28)తో వివాహితకు పరిచయం ఏర్పడింది. ఆ పరియచం కాస్తా చనువుగా మారింది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్త, పలుమార్లు భార్యని మందలించాడు. తన భార్య జోలికి రావద్దని ఆ యువకుడిని కూడా హెచ్చరించాడు. ఈ గొడవ ముదరడంతో పోలీస్‌ స్టేషన్‌ లో కూడా కేసు నమోదైంది. ఆ తర్వాత పెద్దల సమక్షంలో రాజీ కుదిరింది.




రాజీ కుదిరిన తర్వాత భార్యా భర్తలిద్దరూ తమ స్వగ్రామానికి వచ్చేశారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తామాడ గ్రామానికి వారు తిరిగొచ్చేశారు. కానీ వివాహితతో అతడి ప్రేమ మాత్రం ఆగలేదు. వారి వెనకాలే నరేంద్ర కూడా తామాడ గ్రామానికి వచ్చాడు. అక్కడ కూడా పంచాయితీ పోలీస్ స్టేషన్ కి చేరింది. చివరకు లావేరు పోలీసులు ఆ యువకుడికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. కానీ ఆ యువకుడు ఆగలేదు. కొత్త సంవత్సరం రోజున ఆమెను చూసేందుకు మళ్లీ తామాడ వెళ్లాడు. డిసెంబర్ 31న మరోసారి గొడవ జరిగింది. ఆ తర్వాత ఆ యువకుడు కనిపించలేదు. ఇటు నెల్లూరు జిల్లాకు కూడా రాలేదని చెబుతున్నారు. 


బావిలో శవం.. 
ఇటీవల తామాడ గ్రామానికి సమీపంలోని ఓ నేలబావిలో నరేంద్ర శవం కనిపించింది. అతడి సెల్ ఫోన్ ఆధారంగా నెల్లూరులో ఉన్న కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. తమ కుమారుడిని ఎవరో హత్య చేసి బావిలో పడేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ బిడ్డను చంపేశారని, తమకు న్యాయం చేయాలని అంటున్నారు. అక్రమ సంబంధాల మోజులో ఆ యువకుడు బలైపోయాడు. పెద్దల వద్ద పంచాయితీ జరిగినప్పుడు కానీ, లేక పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినప్పుడు కానీ ఆగి ఉండాల్సింది. ఆమె మోజులో పడి జిల్లాలు దాటి వెళ్లి.. ఇలా అక్కడ ప్రాణాలు కోల్పోయాడు. అయితే నరేంద్ర మృతికి కారణాలు తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. 


Also Read: Fake News: నకిలీ వార్తలు మనుషుల భావోద్వేగాలను ఎంతగా ప్రభావితం చేస్తాయంటే.... ఓ కొత్త అధ్యయనం


Also Read: Gold-Silver Price: నేడు అతి స్వల్పంగా పెరిగిన పసిడి, వెండి మాత్రం నిలకడగా.. ఇవాల్టి ధరలు ఇలా..


Also Read: Cinema Tickets Issue: పేర్ని నానితో ఆర్జీవీ భేటీకి టైమ్ ఫిక్స్.. సోమవారమైనా టికెట్స్ రేట్లపై క్లారిటీ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి